Friday, 3 November 2017

Telugu Murli 18/10/2017

18-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీకు దివ్య దృష్టి లభించింది - ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుందని మీకు తెలుసు. అందువలన దీనినుంచి మమత్వము తొలగించాలి, పూర్తిగా బలి అవ్వాలి.
ప్రశ్న:- ఏ పిల్లలైతే అవినాశి తండ్రి పై పూర్తిగా సమర్పణ అయ్యారో వారి గుర్తులు ఏవి?
సమా:- వారు తమ ధనము మొదలైన వాటిని వ్యర్థంగా ఖర్చు పెట్టరు. భక్తిమార్గములో దీపావళి మొదలైన పండుగ రోజులలో ఎంతో బాణసంచా, టపాకాయలు మొదలైనవి కాలుస్తారు. అల్పకాలికమైన వేడుకలను, సంబరాలను ఖుషీగా జరుపుకుంటారు. ఇదంతా సమయాన్ని, ధనాన్ని, శక్తిని వృథా చేయడమేనని మీకు తెలుసు. ఇచ్చట మీరు ఇలాంటి వేడుకలు జరుపుకోరాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వానప్రస్థములో ఉన్నారు. మీరు ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ప్రపంచంలోకి వెళ్లాలి.
పాట:- మిమ్ములను పొంది మేము విశ్వమంతా పొందుకున్నాము......(తుమ్హే పాకే హమ్‌నే .........)

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థము చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని పొందుకున్నారు. మీరు 5 వికారాల పై విజయము పొందేందుకు అనగా మాయ పై విజయము పొంది జగత్‌జీతులుగా అయ్యేందుకు తండ్రి మీకు సహాయము చేస్తారు. జగత్తు అనగా మొత్తము ప్రపంచము. మనము ఈ జగత్తుకు అంతా యజమానులుగా అవుతామని పిల్లలకు తెలుసు. అయితే ఎప్పుడు అవుతారు? రావణ రాజ్యము సమాప్తమైనప్పుడు అధికారులుగా అవుతారు. ప్రతి సంవత్సరము రావణుని తగులబెడ్తూ ఉంటారు. సంగమ యుగములో తండ్రి వచ్చి ఆత్మ దీపాన్ని వెలిగించి సత్యయుగానికి యజమానులుగా చేస్తారు. దశరా తర్వాత దీపావళి పండుగనాడు మనుష్యులు చాలా మంచి మంచి వస్త్రాలు ధరిస్తారు. తరచుగా లక్ష్మీనారాయణులు, రాధా-కృష్ణులు మరియు దేవీల మందిరాలకు వెళ్తారు కానీ ఆ దేవీల గురించి, లక్ష్మీనారాయణుల గురించి వారికి తెలియదు. దేవీలనగా శివశక్తులు, బ్రాహ్మణీలు. దేవీల చేతులలో అస్త్ర-శస్త్రాలను చూపిస్తారు. వాస్తవానికి దేవీల చేతులలో ఎలాంటి అస్త్రశస్త్రాలు లేనే లేవు. వారు గుప్తంగా ఉన్నారు. రావణుని పై విజయము పొందితే అర్ధకల్పము వరకు మీ వేడుకలు, సంతోషాలు స్థిరమైపోతాయి. ఇప్పుడు మీరు వేడుకలు జరుపుకోరు. ఇది నిజమైన దీపావళి కాదు. ఎందుకంటే ఈ రోజు దీపాలు వెలిగిస్తారు, రేపు ఆరిపోతాయి. దశరా పండుగను కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. బ్రాహ్మణులైన మీరు మీ గృహాలలో దీపాలు వెలిగించరు. మందిరాలు మొదలైన వాటిలో దీపాలు, కరెంటు లైట్లు మొదలైనవి వెలిగిస్తారు. దీపావళి అనగానేమో, దశరా అనగానేమో మనుష్యులకు తెలియదు. ఆ సమయములో మొత్తం భారత ఖండమంతా క్రొత్తదిగా అవుతుంది. దీపాలు మొదలైనవి వెలిగించడం భక్తిమార్గానికి చెందినవి. భక్తిమార్గములో ఎంతో ధనాన్ని వృథా చేస్తారు. ఆ రోజు ఎంతో బాణసంచాను, టపాకాయలను కాలుస్తారు. సమయాన్ని, డబ్బును, శక్తిని ఎంతో వ్యర్థము చేస్తారు. ఇది ముళ్ళ అడవి. అందరూ అడవి మనుష్యులుగా అయిపోయారు. మీరు కూడా మొదట అలాగే ఉండేవారు. ఏమీ అర్థము చేసుకునేవారు కాదు. సత్యయుగములో వ్యర్థంగా ఖర్చు చేయరు. ఇచ్చట వ్యర్థముగా చాలా ఖర్చు చేస్తారు. దాన-పుణ్యాలు చేసినా అల్పకాల ఫలము దొరుకుతుంది. మనము అవినాశి తండ్రి పై బలిహారమయ్యాము. కనుక మన సర్వస్వము అవినాశిగా అయిపోతుందని మీకు తెలుసు. పాత శరీరాన్ని వదిలి క్రొత్తది తీసుకుంటారు. పిల్లలైన మీరు మోహజీత్‌ రాజు కథనైతే విన్నారు కదా. ఈ కథ సత్యయుగానికి చెందినది కాదు ఎందుకంటే అచ్చట అకాలమృత్యువు ఉండదు. ఆ సమయములో అందరూ నిర్మోహులుగా, మోహజీతులుగా ఉంటారని తెలిపేందుకు ఉదాహరణగా ఈ కథను తయారుచేశారు. శరీర సహితంగా పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించాలి ఎందుకంటే మీరు నూతన ప్రపంచములోకి వెళ్తున్నారు. పాత ప్రపంచము పై ఎవరికైనా మమకారము ఉంటుందా? దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. కేవలం దేహము పై మాత్రమే మమకారాన్ని తొలగించుకోమని బాబా చెప్పరు. కాని ఈ కళ్ళతో వేటినైతే చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఎందుకంటే ఇప్పుడు సర్వమూ సమాప్తము కానున్నదనే దివ్యదృష్టి మీకు లభించింది. పాత ప్రపంచము వినాశమయ్యే ఉంది. క్రొత్త విశ్వము తయారౌతుంది. శివబాబా మనకు రాజ్యమునిస్తారు. శివబాబా పేరు ఎల్లప్పుడూ(సదా) శివుడే. ఎందుకంటే వారికి తమ స్వంత శరీరము లేనే లేదు. బ్రహ్మ-విష్ణు-శంకరులకు కూడా వారి స్వంత శరీరాలు ఉన్నాయి. కాని వారు ఉపరి భాగములో (పైన) ఉంటారు. అమరనాథుడు అమరంగా చేసే కథను అమరలోకములోకి తీసుకెళ్లేందుకు వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయడంలో శ్రమ పడాల్సి ఉంటుంది కదా. ఇక్కడైతే అందరూ ముళ్ళగానే ఉన్నారు. ఒకరికొకరు ఎంతగా ముళ్ళను గుచ్చుకుంటారో చెప్ప శక్యము కాదు. అందువలన ఇప్పుడు మీరు ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరాదని తండ్రి చెప్తున్నారు. కామఖడ్గాన్ని ఉపయోగించరాదు. ఈ కామ హింస ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. ఎవరినైనా హతమారుస్తే ప్రాణములు మాత్రమే కోల్పోతారు. కాని ఇచ్చట(కామము వలన) జన్మ-జన్మాంతరములు దు:ఖితులుగా అవుతూ ఉంటారు. అందుకే తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు కామ ఖడ్గాన్ని ఉపయోగించరాదు.

ఇప్పుడు మీరు దశరా పండుగను జరుపుకుంటున్నారు. తర్వాత దీపావళి వస్తుంది. సత్యయుగములో లక్ష్మీ దేవి స్వయంగా రాజ్యపాలన చేస్తుంది. కావున అచ్చట వారిని కూర్చోబెట్టి పూజించే విషయమే ఉండదు. మందిరాలలో ఉండే మనుష్యులకు ఆ దేవతల జీవిత చరిత్ర్రలు తెలియదు. పిల్లలైన మీకు వారి జీవితచరిత్రలు తెలుసు. పిల్లలైన మీరు రూప్‌బసంత్‌లు(జ్ఞానయోగులు). తండ్రి చెప్తున్నారు - నేను కూడా శరీరాన్ని ధరించాను కాని నేను శరీరాన్ని ధారణ చేసే విధానము వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకు దీపావళి పండుగ సంతోషమునివ్వదు. ఎందుకంటే మనము ఇప్పుడు వానప్రస్థములో ఉన్నాము. మనము పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తాము. బాబా అంటారు - '' 108 అతుకులున్న బట్టలు ధరిస్తే దేహాభిమానము తొలగిపోతుంది''. ఈ సమయములో మీరు ముళ్ళ అడవి నుండి పుష్పాల ప్రపంచములోకి వెళ్తున్నారు. బాగా చదువుకుంటే, వ్రాసుకుంటే నవాబులౌతారని అంటారు. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను నరుని నుండి నారాయణునిగా చేస్తాను. దాని కొరకు ఉత్తమ పురుషార్థము చేయాలి. నేను చదివించేటప్పుడు పదవిని ఎందుకు పాడు చేసుకుంటారు? మాతా-పితలను ఎందుకు అనుసరించరు? ఎవరు బాగా చదువుకుంటారో వారు రాజవంశములోకి వస్తారని బాబా సాక్షాత్కారము చేయించారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మనము చదువుతున్నామని మీకు తెలుసు. మనుష్యులు మరణిస్తే స్వర్గవాసులుగా అవుతారని భావిస్తారు. అయితే స్వయంగా బాబాయే వచ్చి స్వర్గములోకి తీసుకెళ్తారని తర్వాత మళ్లీ రావణుడు నరకవాసులుగా చేస్తాడని మీకు తెలుసు. హిందూ, చీనీ భాయి-భాయి అని మనుష్యులు అంటారు. కాని మళ్లీ ఒకరికొకరు దు:ఖమునిచ్చుకుంటూ ఉంటారు. మాతా-పితల నుండి అపారమైన సుఖము లభిస్తూ ఉందని మీకు తెలుసు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుందని అంటారు. అందువలన ఇప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. కొంతమంది నరకవాసుల నుండి స్వర్గ వాసులుగా అవుతారు. కొంతమంది ఈ నరకము నుండి శాంతిధామ నివాసులుగా అవుతారు. కావున అందరికీ మేలే జరుగుతుంది. సత్యయుగములో దు:ఖమిచ్చే వస్తువేదీ ఉండదు. గొప్ప వ్యక్తుల వద్ద ఫర్నీచరు కూడా గొప్పగా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది. అచ్చట దు:ఖమిచ్చే జంతువులు మొదలైనవేవీ ఉండవు. అక్కడ ఫర్నీచరు కూడా మొదటి రకము కావాలి, దానిని స్వర్గమని అంటారు. అల్లా అవలద్దీన్‌ నాటకముంది. దీపాన్ని రుద్దగానే రాజ్యము లభిస్తు౦ది కావున మన తండ్రి అయిన అల్లా(బాబా) అవలద్దీన్‌ అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందువలన తండ్రి ఒక సెకెండులో వైకుంఠానికి అధికారులుగా చేస్తారు. బాబా స్వర్గమును(అవల్దీన్‌ను) సాక్షాత్కారము చేయిస్తారు. అలాగని మేము కూడా సాక్షాత్కారములోకి వెళ్తామని పిల్లలు అనరాదు. బాబా అంటున్నారు - ధ్యానులకన్నా జ్ఞానులు నాకు ప్రియమైనవారు ఎందుకంటే ధ్యానము(సాక్షాత్కారము)లో మాయ ప్రవేశిస్తుంది. జ్ఞానములో మాయ రాదు. ఎవరైతే నౌధా భక్తి(తొమ్మిది రకాల), గాఢమైన భక్తి చేస్తారో వారికి బాబా సాక్షాత్కారము చేయిస్తారు. ఇక్కడ నౌధా భక్తి చేయడం జరగదు. చిన్న చిన్న పిల్లలకు సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారానికి అలవాటు పడితే చదువును చదవలేరు. ప్రారంభంలో ధ్యానం కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చేవారు. కానీ ఈ రోజు వారు లేనే లేరు. జ్ఞానయుక్త ఆత్మలకు ఏ విషయములోనూ సంశయము రాదు. సంశయము వచ్చి చదువును వదిలేశారంటే తండ్రిని వదిలినట్లే. ఇప్పుడు సూర్యవంశీ దేవీదేవతల రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇతర ధర్మ స్థాపకులు ఎవ్వరూ రాజధానిని స్థాపన చేయరు. ఆ ధర్మము వృద్ధి చెందినప్పుడు వారి రాజ్యము నడుస్తుంది. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. ఎవరైనా క్రొత్తవారు వస్తే పరమపిత పరమాత్మతో మీకు ఏమి సంబంధము? అని అడగండి. అప్పుడు వారు పరమాత్మ మాకు తండ్రి అని చెెప్తారు. బాబా స్వర్గ స్థాపన చేస్తారు, రావణుడు దానిని నరకంగా చేస్తాడు. స్వర్గాన్ని తయారు చేసిన వారిని పూజిస్తారు, నరకాన్ని తయారు చేసిన వారిని తగులబెడ్తారు. ఎందుకంటే నరకములో మనుష్యులు కామచితి పై కాలిపోతారు. అందువలన కోపముతో రావణుని తగులబెడ్త్తారు. కాని రావణుడు తగులబడడు. పరంపర నుండి ఈ ఆచారము వస్తూ ఉందని వారంటారు. కాని పరంపరకు అర్థము వారికి తెలియదు. శత్రువు దిష్టిబొమ్మను తగులబెడ్త్తారు. రావణుని ఎందుకు కాలుస్తారు? ఎందుకంటే రావణుడు మిమ్ములను కాలుస్తాడు. మీరు రావణుని కాలుస్తారు. అయితే మనుష్యులకు ఈ విషయాలేవీ తెలియవు. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. అందువలన అచ్చట రావణుని తగులబెట్టరు. దానిని నిర్వికార ప్రపంచమని అంటారు. మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నాము. శాపమిచ్చేవాడు రావణుడు. రావణుడని ఎవరినంటారు? స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. సత్యయుగములో ఈ వికారాలు ఉండవు. సన్యాసులైతే తర్వాత వస్తారు. ఇప్పుడు దేవతా ధర్మము లేనే లేదు. అది మళ్లీ ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. 108 మాల తయారవుతూ ఉంది. అందువలన ప్రజలు కూడా కావాలి కదా. జయపూర్‌కు రాజు ఒక్కడే కాని ప్రజలు ఎంతమంది ఉండేవారు! ఇప్పుడు మాల తయారౌతూ ఉంది. ప్రజలు కూడా కావాలి. ఎవరైతే ఇక్కడ పిల్లలుగా తయారై మళ్లీ మధ్యలో వెళ్లిపోతారో వారు సాధారణ ప్రజలలోకి వెళ్లిపోతారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ జీవన్ముక్తి కావాలని అంటారు. జీవన్ముక్తి ఒక్కరికి మాత్రమే లభించదు కదా! పూర్తి రాజ్య వంశమంతా కావాలి. అష్టావక్ర గీతలో క్షణములో జీవన్ముక్తి లభించిందని వ్రాశారు. కాని ఎలా లభించింది? ఇది ఎవ్వరికీ తెలియదు. ఆది సనాతన దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిస్తుంది. రాజ్యపదవి లభిస్తూ ఉంటే మనము శ్రీమతమును ఎందుకు అనుసరించరు? కమలపుష్ప సమానంగా ఎందుకు అవ్వరాదు? మీరు బ్రాహ్మణులు కదా. అందువలన శంఖు, చక్రము, గద మరియు పద్మము మీ వద్ద ఉన్నాయి.

మనుష్యులు కేవలం దీపావళి పండుగనాడు మాత్రమే నూతన వస్త్రాలు ధరిస్తారు, మందిరాలకు వెళ్తారు. కృష్ణ జన్మాష్టమినాడు నూతన వస్త్రాలు ధరించరు. దీపావళి నాడు క్రొత్త వస్త్రాలు ధరిస్తారు. ఆ రోజు అన్నీ క్రొత్తవే. ఆ రోజున వ్యాపారస్థులు తమ పాత ఖాతాలను సమాప్తము చేసి నూతన ఖాతాలను ప్రారంభిస్తారు. మీరు కూడా ఇప్పుడు పాత ఖాతా సమాప్తము చేసుకొని కొత్తది ప్రారంభము చేస్తున్నారు. తండ్రి లాభము చేకూరుస్తారు, రావణుడు నష్టపరుస్తాడు. లాభము ఎలా కలుగుతుంది? మన్మనాభవ, మధ్యాజీభవ ద్వారా కలుగుతుంది. విష్ణువు మధ్యలో ఉన్నాడు కదా. మధ్యాజీభవ అనగా తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తాడు. అందువలన పాత ప్రపంచము వినాశనమైపోతుంది. శివబాబా కలియుగ అంత్యములో వస్తారు. తర్వాత మళ్లీ సత్యయుగము ప్రారంభమౌతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని వ్రాయబడి కూడా ఉంది. బ్రహ్మ ప్రజాపిత కదా. కావున మీరు ఎవరి పిల్లలు? శివుని పిల్లలా లేక బ్రహ్మ పిల్లలా? మీరే మాతా-పితా, బంధు, సఖా అని కూడా అంటారు. నిజానికి ప్రాక్టికల్‌గా వారు ఇప్పుడు మాతా-పితగా ఇక్కడ ఉన్నారు. చదువు చదువుకొని మళ్లీ వారసత్వము పొందుతున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి మిమ్ములను దు:ఖితులుగా చేస్తాడు. దు:ఖము కూడా మెల్ల మెల్లగా పెరుగుతుంది. ఈ కలియుగము విషయ సాగరము, సత్యయుగము క్షీరసాగరము. విష్ణువును క్షీర సాగరములో చూపిస్తారు. ప్రపంచములోని వారికి దశరా, దీపావళి గురించి తెలియదని మీకు తెలుసు. ఇప్పుడు వాటి రహస్యాన్ని కూడా మనము తెలుసుకున్నాము. నిన్న మనము స్వర్గములో ఉండేవారమని ఇప్పుడు నరకములో ఉన్నామని మీకు తెలుసు. మళ్లీ రేపు స్వర్గములో ఉంటాము. రేపు అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఎవరైనా వస్తే ఈ ఆశ్రమము ఎవరిదో తెలుసా? ప్రజాపిత బ్రహ్మ పేరు విన్నారా? అని అడగండి. ఇంతమంది బి.కెలు ఉన్నారు కావున బ్రహ్మ వీరందరికీ తండ్రి అయ్యారు కదా. తండ్రి నుండి వారసత్వమే లభిస్తుంది. తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేస్తే 'మధ్యాజీభవ' గా అవుతారు. బాబా వ్యాపారము చేయరాదని చెప్పరు. తండ్రి చెప్తున్నారు - భలే వ్యాపారము చేయండి కాని తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే వారి నుండి వారసత్వము లభిస్తుంది. వారసత్వము లభిస్తుందనే ఆశ(ప్రలోభము) ఉంది కదా. ఇతర స్థానాలలో ఈ ఆశ ఉండదు. పాఠశాలలో కూడా ఆశ ఉంటుంది. అందుకే విద్యార్థి జీవితము ఉత్తమోత్తమ జీవితమని అంటారు. ఇది అనంతమైన చదువు. అనంతమైన చరిత్ర-భూగోళాల గురించి మీకు తెలుసు. పాఠశాలలకు వెళ్లి అనంతమైన చరిత్ర-భూగోళము అంటే ఏమిటో తెలపండి. మీరు హద్దు చరిత్ర-భూగోళము చదివిస్తారు, మేము మీకు లక్ష్మీనారాయణుల అనంతమైన చరిత్ర- భూగోళాలు తెలియజేస్తాము. అంతేకాక లక్ష్మీనారాయణులు ఆ పదవి ఎలా పొందుకున్నారో కూడా తెలుపుతామని చెప్పండి. పోను పోను మీకు కాలేజీల నుండి కూడా ఆహ్వానము లభిస్తుంది. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. వారు స్పిరిచ్యువల్‌(ఆధ్యాత్మిక) ఫాదర్‌, అందువలన వారు ఆత్మలకు ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. నిరాకారులైన వారు సాకారములోకి వచ్చి వినిపిస్తారు. ఇందులో కృష్ణుని మాటే లేదు. ఏ విషయాన్నీ వారు అర్థము చేసుకోరు. వారి బుద్ధి రూపీ దారము చాలా చిక్కుబడి ఉంది. స్వతంత్రము కావాలని అంటూ ఉంటారు కానీ జగడాలు పెరుగుతూనే ఉంటాయి. స్వతంత్రము కావాలని అంటారు. రావణుని నుండి సత్య-సత్యమైన స్వతంత్రము మీకు లభిస్తుంది. మనము క్రైస్తవుల నుండి స్వతంత్రము పొందుతున్నామని భారతవాసులు భావిస్తారు. కాని స్వతంత్రము ఎక్కడ ఉంది? స్వతంత్రము, స్వతంత్ర రాజధాని మీకు మాత్రమే లభిస్తుంది. మీరు లభిస్తే భూమి, ఆకాశము, సముద్రము అన్నీ మాయమైపోతాయి అని పాటలో విన్నారు కదా. అందులో హద్దులేవీ ఉండవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాతా - పితలను పూర్తిగా అనుసరించి చదువు ద్వారా ఉన్నత పదవి పొందాలి. ఈ ప్రపంచము పై ఎలాంటి ఆసక్తిని ఉంచుకోరాదు, వనవాసములో ఉండాలి.
2. ఈ కనులకు ఏవైతే కనిపిస్తున్నాయో, వాటిని చూస్తూ కూడా చూడరాదు. పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. సంగమ యుగములో ఏదీ వ్యర్థము చేయరాదు.

వరదానము:- ''బాప్‌దాదా స్నేహానికి బదులు సమానంగా అయ్యే తపస్వీ మూర్త్‌ భవ''
సమయము యొక్క పరిస్థితుల అనుసారము స్వ ఉన్నతి కొరకు తీవ్ర వేగముతో సేవ చేసేందుకు లేక బాప్‌దాదా స్నేహానికి బదులు(రిటర్న్‌) ఇచ్చేందుకు వర్తమాన సమయంలో తపస్సు చేయడం చాలా అవసరము. పిల్లలకు తండ్రి పై ప్రేమ ఉంది. కాని బాప్‌దాదా ప్రేమకు బదులు, స్వరూపములో పిల్లలను తన సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. సమానంగా అయ్యేందుకు తపస్వీ మూర్తులుగా అవ్వండి. అందుకు నలువైపులా ఉన్న తీరాలను వదిలి అనంతమైన వైరాగులుగా అవ్వండి. తీరాలను ఆధారంగా చేసుకోకండి.

స్లోగన్‌:- ''శీతలంగా అయ్యి ఇతరులను శీతలమైన దృష్టితో తృప్తి పరచే శీతల యోగులుగా అవ్వండి''

Telugu Murli 17/10/2017

17-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - పరస్పరము ఒకరి పై ఒకరు గౌరవము౦చాలి, స్వయాన్ని మియా మిట్టూ ( నాకంతా తెలుసు) అని అనుకోరాదు, నేను ఏ కర్మ చేస్తే నన్ను చూచి అ౦దరూ చేస్తారని బుద్ధిలో గుర్తు ఉ౦డాలి''
ప్రశ్న:- ఏ స్థితిని తయారు చేసుకునేందుకు చాలా చాలా శ్రమి౦చాల్సి ఉంటు౦ది?
సమా:- గృహస్థ వ్యవహారములో ఉ౦టూ స్త్రీ - పురుషుల భావము సమాప్తమై మనసులో కూడా సంకల్ప, వికల్పాలు నడవరాదు, మేమంతా ఆత్మలము భాయి - భాయి (సోదరులము) ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, సోదరీ సోదరులము, ఈ స్థితిని తయారు చేసుకునేందుకు సమయము పడ్తు౦ది. కలిసి ఉ౦డినా వికారాల అగ్ని అ౦టుకోరాదు. నేర(క్రిమినల్‌) కార్యము(దాడి) జరగరాదు, దీనిని అభ్యాసము చేయాలి. సర్వ సంబంధాల శ్యాక్రిన్‌ అయిన తల్లిదండ్రులను స్మృతి చేయాలి.
పాట:- జగత్తు మారినా, మేము మారము,.........(బదల్‌ జాయే దునియా న బదలేంగే హమ్‌,...........)
ఓంశాంతి. ఇది పిల్లలు చేసిన గ్యారంటి లేక ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ నోటితో చేసేది కాదు. ఎప్పుడైతే పిల్లలు తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు ప్రతిజ్ఞ దానంతట అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు పదవి పొ౦దుకునేందుకు స్వతంత్రంగా పురుషార్థము చేస్తారు. ఉన్నత పదవి పొ౦దుకునేందుకు స్కూలులో అ౦దరూ స్వతంత్ర పురుషార్థము చేస్తారు. ఇచ్చట ఆత్మ చదువుకు౦టు౦ది. పరమాత్మ చదివి౦చేందుకు జీవాత్మగా అవుతారు. ఇతనిలో ప్రవేశమై ఇతనిని(బ్రహ్మ) మరియు బ్రహ్మముఖవంశావళీ వారిని చదివిస్తారు. స్వయం బ్రహ్మను బ్రహ్మముఖవంశావళి అని అనరు. బ్రాహ్మణులకు బ్రహ్మ ముఖవంశావళికి చెందినవారు. బ్రహ్మ శివముఖవంశాళీ కాదు. శివబాబా వచ్చి ఇతడిలో ప్రవేశమై తనవానిగా చేసుకు౦టారు. ఇతడు కూడా రచనే కదా. మొదట బ్రహ్మను రచిస్తారు, విష్ణువును రచి౦చరు. మొదట బ్రహ్మ, విష్ణువు, శంకరుడు అనే గాయనము కూడా ఉ౦ది. విష్ణువు, శంకరుడు, బ్రహ్మ అని అనరు. మొదట బ్రహ్మను రచిస్తారు. బ్రహ్మ కర్తవ్యము వేరు. ఇ౦దులో ప్రతి విషయము అర్థము చేసుకోవాలి. వీరిని మీరే తల్లి, త౦డ్రి,.......... అని అంటారు. కావున ఆయన నిరాకారుడు కదా. సాకారములో తల్లి-తండ్రి అవసరము. అ౦దుకే మమ్మాకు తల్లి ఎవరు? మమ్మాకు కూడా తల్లి బ్రహ్మనే అ౦టారు. బ్రహ్మకు తల్లి ఎవ్వరూ లేరు. ఈ తల్లి(బ్రహ్మ) స్త్రీ కానందున సరస్వతిని మమ్మా అని అ౦టారు. తండ్రి చదివి౦చినప్పుడు ఈమె కూడా చదువుకు౦టు౦ది. మీరు ఎలా విద్యార్థులో, అలా ఇతడు కూడా విద్యార్థియే. శివబాబా ఎప్పుడూ విద్యార్థిగా అవ్వరు.

పిల్లలైన మీరు బ్రహ్మ పదవిని కూడా చూస్తున్నారు - ఇతను అ౦దరికంటే ఎక్కువగా చదువుతారు. అ౦దరికంటే చాలా సమీపంగా ఉండడం చూస్తున్నారు. మొదట ఎవరి చెవులు వి౦టాయి? ఈ బ్రహ్మ అ౦దరికంటే సమీపంగా ఉన్నారు. అ౦దుకే మమ్మా-బాబా ఎక్కువగా చదువుతారని అ౦టారు. తర్వాత పిల్లలు నె౦బరువారుగా చదువుతారు. భలే బాబా ఇలా అంటారు - జగదీశ్‌ బచ్చా, మమ్మా-బాబాల కంటే బాగా అర్థం చేయిస్తాడు. బాబా మురళి చదివి ధారణ చేసిన తర్వాత గీతా మ్యాగజైన్‌ మొదలైనవి తయారు చేస్తాడు. ఎ౦దుకంటే ఇతడు శాస్త్రాలు మొదలైనవి చదివాడు. ఇ౦గ్లీషులో కూడా చురుకైనవాడు. దీనిని గౌరవము అని అ౦టారు. విద్యార్థులు ఒకరి పై ఒకరు గౌరవము౦చుకోవాలి. బాబా కూడా గౌరవమిస్తున్నారు కదా. కనుక తండ్రిని అనుసరి౦చాలి. భలే ఇ౦కా 16 కళా సంపూర్ణంగా అవ్వలేదు. నె౦బరువారీగా ఉ౦టారు కదా. ఏవో కొన్ని తప్పులు అందరూ చేస్తూనే ఉ౦టారు కనుక స్వయాన్ని అ౦తా నాకే తెలుసని అనుకోరాదు. తండ్రి ఎలా౦టి కర్మ చేస్తారో, అదే నేను చేస్తాను. నన్ను చూచి అ౦దరూ చేస్తారు. కావున ఒకరినొకరు గౌరవి౦చుకోవాలి. బాబాకు కూడా గౌరవమివ్వాల్సి వస్తు౦ది. వీరు భార్యా-భర్తలను సోదరీ - సోదరులుగా చేస్తారని జనులంటారు. అప్పుడు తెలివిగల పిల్లలైతే వెంటనే అందరము పరమాత్ముని పిల్లలమే కనుక సోదరీ - సోదరులమే అని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ - సోదరులైనారు కదా. సోదరీ - సోదరులవ్వడం మంచిదే కదా. బాబా పిల్లలుగా అయితే వారసత్వము తీసుకోగలరు. వారసత్వము శివబాబా ను౦డి బ్రహ్మబాబా ద్వారా లభిస్తుంది. అందుకు బ్రహ్మకుమారి - కుమారులుగా అవ్వవలసి వస్తు౦ది. తర్వాత ఎప్పుడూ వికారాలకు వశమవ్వరాదు. లేకు౦టే తప్పు కర్మ (నేర కథ) జరుగుతు౦ది. బాబా ఎ౦తో మంచిరీతిగా అర్థం చేయిస్తారు? పవిత్రంగా ఉ౦డేందుకు యుక్తులు కూడా తెలిపిస్తున్నారు. భార్య కూడా బాబా అని అ౦టు౦ది, భర్త కూడా బాబా అని అ౦టాడు. దీని వలన స్త్రీ - పురుషుల భావము వదిలిపోతు౦ది. ఆదమ్‌ మరియు బీబీ ద్వారా సృష్టి స్థాపన అయ్యిందని అ౦టారు. కావున అ౦దరూ వారి సంతానమే కదా. సోదరీ - సోదరులవుతారు. కుమార - కుమారీలకు ఇ౦త శ్రమ ఉ౦డదు. తాపలు ఎక్కిపోయినవారు క్రి౦దకు దిగి రావలసి వచ్చి౦ది. క్రి౦దకు దిగడంలో శ్రమ ఉ౦ది. అలాగని ఇద్దరు వేరు వేరుగా ఉ౦డాలని కాదు. కేవలం తోడుగా ఉ౦డండి. సత్యయుగములో ఎవ్వరూ అపవిత్రంగా అవ్వరు. అచ్చట పిల్లల కొరకు వేచి ఉ౦డాల్సిన పని ఉండదు. ఇచ్చట కొడుకు కొరకు వేచి ఉ౦టారు. అచ్చట సమయానుసారము వార౦తకు వారే సాక్షాత్కారము అవుతారు. ఇదెలా సాధ్యమని మనుష్యులు అంటారు. ఇచ్చట సంపూర్ణ వికారులైన వారు అచ్చట సంపూర్ణ నిర్వికారులు౦టారని ఎలా భావిస్తారు? అచ్చట దేహాభిమానము౦డదు, ఇచ్చట దేహాభిమానము ఉ౦టు౦ది. దేహాన్ని వదిలితే మనుష్యులు ఎ౦తగానో రోధిస్తారు(ఏడుస్తారు). అచ్చట ఏడుపే ఉ౦డదు. అచ్చట సమయానుసారము శరీరాన్ని వదలి రాకుమారులుగా అవుతామని సాక్షాత్కారము అవుతు౦ది. ఇచ్చట కూడా భవిష్యత్తులో మహారాజ-మహారాణీలుగా అవుతామని సాక్షాత్కారము చేసుకు౦టారు. కృష్ణుని వంటి బాలుని ఒడిలో చూస్తారు. సాక్షాత్కారము ద్వారా సూర్యవంశీ మహారాజా - మహారాణులుగా అవుతామో లేక చంద్రవంశీయులుగా అవుతామో తెలియదు ఎ౦దుకంటే ఇది పూర్తిగా కొత్త విషయము. అ౦దుకే మొదట తండ్రిని గుర్తించమని అ౦టారు. తండ్రి చెప్తున్నారు - నేను ఎ౦త ప్రీతిగా(లవ్‌లీగా) ఉన్నానో చూడండి.

నేను సర్వ సంబంధాల శ్యాక్రిన్‌ను, నన్ను తలంపు చేయండి అని చెప్తున్నాను. నీవే తల్లివి, తండ్రివి......... అని అ౦టారు. ఒక్కొక్క మాటలో నిశ్చయము౦డాలి. అయితే ఏదో ఒక మాటలో సంశయము వచ్చేస్తు౦ది మళ్లీ రాజ్య పదవిని పొ౦దలేరు. అ౦దుకే బాబా చెప్తున్నారు - మన్మనాభవ. తండ్రిని తలంపు చేస్తే మీరు ప్రేయసులౌతారు. వీరు ఆత్మిక ప్రేయసీ - ప్రియులు. నేను ఆత్మ, పరమాత్మకు ప్రేయసిని అని పక్కా చేసుకోవాలి. కృష్ణుడు అ౦దరికీ ప్రియుడు అవ్వలేరు. కృష్ణుని అ౦దరూ స్మృతి చేయరు. ఈ తండ్రి చెప్తున్నారు - మన్మనాభవ. ఇప్పుడు నా వద్దకు రావాలి. నాటకము పూర్తి అవుతు౦ది, ఇ౦టికి వెళ్లాలి. అప్పుడు ఇల్లు తప్పక గుర్తుకు వస్తు౦ది. మురళీలో ప్రతి విషయానికి వివరము లభిస్తు౦ది. పిల్లలు మురళీ వ్రాసుకోరు. మళ్లీ అదే విషయాలు బాబాను అడుగుతూ ఉ౦టారు. ముఖ్యమైన విషయము - ప్రేయసి - ప్రియుడు. భక్తులందరూ ప్రేయసులే. ఎందుకంటే అందరూ పరమాత్మను స్మృతి చేస్తారు. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు. పిల్లలైన మీరిప్పుడు కొత్త విషయాలు వింటారు. అయితే వి౦టూ వి౦టూ మాయ చె౦పదెబ్బ వేస్తు౦ది, రావణుడు తక్కువేమీ కాదు. తండ్రి సర్వశక్తివంతుడు, మాయ కూడా సర్వశక్తివంతమే. అర్ధకల్పము మాయావీ రాజ్యము నడుస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - 5 వికారాల దానమిస్తే గ్రహణము వదులుతు౦ది. అయినా ఒక్కసారిగా వదలదు. కొ౦తమంది దానమిచ్చి మళ్లీ వాపస్‌ తీసుకు౦టారు. ఇది డబ్బు విషయము కాదు, వికారాల మాట. సాధు-సన్యాసులు డబ్బు దానమిచ్చి తిరిగి తీసుకోరాదని చెప్తారు. ఎ౦దుకంటే అదే వారి సంపాదన. చాలా మంది మనుష్యులు సన్యాసుల వద్దకు వెళ్లి పిల్లలు కావాలని కోరుతారు. మా ఆశీర్వాదాలతో పిల్లలు కలుగుతారని అ౦టారు. ఒకవేళ కొడుకు జన్మిస్తే మేమిచ్చామని అ౦టారు. మరణిస్తే భావి(అలా జరగాలని ఉందని) అని అ౦టారు. ఒకరి పని ఏదైనా సానుకూలమౌతే చాలా మందికి విశ్వాసము ఏర్పడ్తు౦ది. ఈ విధంగా వారి వృద్ధి జరుగుతు౦ది. ఒకవైపు తమ మహిమ చేసుకు౦టారు, రె౦డవ వైపు భావి అని అ౦టారు. మీరు ఈ సమయంలో గుప్త యోధులు, అచ్చట గుప్త యోధుల జ్ఞాపక చిహ్నాలు నిర్మిస్తారు. చాలా గొప్ప గొప్పవారు అక్కడికి వెళ్తారు. సైనికుల పై పుష్పగుచ్ఛాలు౦చమని చెప్తారు. అరే! ఎవరిని గురి౦చి తెలియదో వారి స్మృతిచిహ్నము ఎలా తయారౌతు౦ది. మీరు ఇప్పుడు గుప్తముగా ఉన్నారు తర్వాత మీరు చాలా బాగా ప్రసిద్ధమౌతారు. మీ మందిరాలు నిర్మిస్తారు. ఇప్పుడు మీరు గుప్తముగానే రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు.

మధురమైన పిల్లలూ, మీరు చాలా అపురూపమైన పిల్లలు కదా. 5 వేల సంవత్సరాల తర్వాత లభి౦చారు. తప్పిపోయిన కొడుకు లభిస్తే తల్లితండ్రులకు ఎ౦తో సంతోషము కలుగుతుంది. పిల్లలు కూడా బాబా - బాబా అని అ౦టూ ఉ౦టారు. ఇప్పుడు వినాశనము జరుగుతు౦ది, మీరు మాయమై పోతారు అనగా తండ్రి ను౦డి విడిపోతారు మళ్లీ కల్పము తర్వాత తండ్రితో కలుస్తే తల్లితండ్రికి ఎ౦తో ప్రేమ ఉ౦టు౦ది కదా. అర్ధకల్పము మీరు సుఖాన్ని అనుభవిస్తారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా దు:ఖితులుగా అవుతారు. సుఖము కాకిరెట్టకు సమానమని సన్యాసులు అ౦టారు కదా. వారు కూడా వికారాల కొరకు చెప్పిన మాటే. గురునానక్‌ కూడా మురికి బట్టలను ఉతికేస్తారని అంటారు(మూత్‌ పలీతీ కపడ్‌ ధోయే) - అయితే ఉతికేది ఎవరు? ఒక్క పరమాత్మనే. వారిని ఏక్‌ ఓ౦కార్‌....... అని సిక్కులు గాయనము చేస్తూ ఉ౦టారు. ఈ జ్ఞానములో మీ బుద్ధి చాలా చురుకుగా ఉ౦డాలి. ఎందుకంటే ఆత్మలను జాగృతము చేయాల్సి ఉంటుంది. కనుక ఆత్మ కూడా చురుకుగా అవుతుంది. కొ౦తమంది చాలా చురుకు బుద్ధిగా అవుతారు. మాతలు, కన్యలు చాలా బాగా నిల్చుంటారు. లేకు౦టే మాతలు కూర్చుని పతులకు అర్థం చేయించేందుకు చాలా ధైర్యము, నిర్భయత ఉండాలి. మిగిలిన వారంతా నరకవాసులు, దుర్గతిలో ఉన్నారు. వారు భక్తిలో నాట్యము చేస్తూ, భజనలు చేస్తూ ఉ౦టారు. వారి సద్గతి జరగదు. పిల్లలైన మీరు సద్గతిలోకి వెళ్లేందుకు పూర్తి మౌనంగా ఉ౦టారు. నారదుడు నేను లక్ష్మిని వరిస్తానని అన్నాడు. నిజానికి లక్ష్మిని వరి౦చేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు. భక్తులు వరి౦చలేరు. లక్ష్మీనారాయణులకు రాజ్యము ఎలా లభి౦చింది? ఎప్పుడు లభి౦చింది, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ మీకు మాత్రమే తెలుసు. కావున మీరు మందిరాలకు వెళ్లి తల వంచి నమస్కరి౦చరు. మేమే లక్ష్మీ నారాయణులుగా అవుతున్నామని భావిస్తారు. మీరు నమస్కరి౦చడం సమాప్తమైపోయింది. మీరు నమస్కరించరని, వారు మిమ్ములను నాస్తికులని అ౦టారు. వాస్తవానికి మీరే ఆస్తికులు. నంబరువారు పురుషార్థానుసారముగా ఉంటారు. వారు నాస్తికులు, వారికి పరమాత్మను గురించి తెలియదు. మీరు ఇప్పుడు భగవంతుని వారిగా అయ్యారు. అయినా మాయ చె౦పదెబ్బ వేస్తే అనాథలై దిక్కులేని వారిగా అవుతారు. భలే వృద్ధులుగా ఉన్నవారిని కూడా మాయ యవ్వనవంతులుగా చేసేస్తు౦ది. మాయా తుఫానులు వస్తాయి. మీరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని సహయోగులై ఈ నూతన యాత్రలో తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. మొత్తం ఆధారమంతా బుద్ధియాత్ర పైనే ఉంది. చలి౦చక స్థిరముగా ఉ౦డే అ౦గదుని వలె తయారవ్వాలి. ఈ స్థితి చివరిలో వస్తు౦ది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒకరి చేతినొకరు పట్టుకొని సహయోగులై తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉ౦డాలి. సర్వ సంబంధాల శ్యాక్రిన్‌ అయిన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి.
2. ఎలాగైతే తండ్రి ప్రతి పుత్రునికి గౌరవమిస్తారో, అలా తండ్రిని ఫాలో చేయాలి. మనకంటే పెద్దవారికి తప్పకుండా గౌరవమివ్వాలి.
 
వరదానము:- ''ఒక్కరి పాఠాన్ని స్మృతిలో ఉంచుకొని తపస్సులో సఫలత ప్రాప్తి చేసుకునే నిరంతర యోగీ భవ''
సఫలతకు విశేష ఆధారము లేక సహజ సాధనము తపస్సే. ఒకటి అనే శబ్ధాన్ని పక్కాగా చేసుకోండి. తపస్సు అనగా ఒక్కరి వారిగా అవ్వడం. తపస్సు అనగా మనసు, బుద్ధిని ఏకాగ్రము చేయడం. తపస్సు అనగా ఏకాంత ప్రియులుగా ఉండడం. తపస్సు అనగా స్థితిని ఏకరసంగా ఉంచుకోవడం. తపస్సు అనగా సర్వ ప్రాప్తుల ఖజానాలను వ్యర్థము నుండి రక్షించుకోవడం, పొదుపు చేయడం. ఈ 'ఒక్కరి' ఆలోచనను స్మృతిలో ఉంచుకుంటే నిరంతర యోగిగా, సహజ యోగిగా అయిపోతారు. శ్రమ నుండి విడుదలైపోతారు.
 
స్లోగన్‌:- ''ఎవరైతే మనసు - బుద్ధిని మన్మతము నుండి సదా ఖాళీగా ఉంచుకుంటారో, వారే ఆజ్ఞాకారులు.''
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాల

1) సత్యయుగంలో ఈ ఈశ్వరీయ జ్ఞానము లభించదు - ఒకవేళ ఎవరైనా ఈ సంగమ యుగములో ఈశ్వరీయ జ్ఞానము ఏదైతే లభిస్తూ ఉందో, అది మళ్లీ మాకు సత్యయుగంలో లభిస్తుందా అని అడిగితే సత్యయుగంలో స్వయం మనమే జ్ఞాన స్వరూపులుగా ఉంటాము. దేవతా ప్రాలబ్ధాన్ని భోగిస్తూ ఉంటాము. అక్కడ ఈ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు. ఇప్పుడు అజ్ఞానులకైతే జ్ఞానము అవసరముంది. అక్కడ అందరూ జ్ఞానస్వరూపులుగా ఉంటారు. అక్కడ ఎవ్వరూ అజ్ఞానులుగా ఉండరు. కనుక జ్ఞానము ఇవ్వాల్సిన అవసరముండదు. ఇప్పుడైతే ఈ సమయములో మొత్తం ఈ విరాట్‌ డ్రామా ఆదిమధ్యాంతాలను గురించి మనకు తెలుసు. ఆదిలో మనము ఎవరము? ఎక్కడ నుండి వచ్చాము? మధ్యలో కర్మబంధనాలలో చిక్కుకొని మళ్లీ ఎలా కిందపడ్డాము? అంతములో మనము కర్మబంధనాల నుండి అతీతమై కర్మాతీత దేవతలుగా అవ్వాలి. ఆ పురుషార్థమే ఇప్పుడు నడుస్తూ ఉంది. తద్వారా మనము భవిష్య ప్రాలబ్ధముగా సత్యయుగంలో దేవతలుగా అవుతాము. ఒకవేళ అక్కడ దేవతలుగా ఉన్న మేము క్రింద పడ్తామని తెలిస్తే సంతోషము మాయమైపోతుంది. కనుక అక్కడ క్రింద పడ్తామనే జ్ఞానముండదు. ఈ ఆలోచన అక్కడ ఉండదు. ఈ జ్ఞానము ద్వారా మనమిప్పుడు ఉన్నతమై, సుఖపడే జీవితాన్ని తయారు చేసుకోవాలని ఇప్పుడు తెలిసింది. మళ్లీ అర్ధకల్పము తర్వాత మన ప్రాలబ్ధాన్ని అనుభవించి మళ్లీ విస్మృతి ద్వారా మాయకు వశమై క్రింద పడిపోతాము. పైకి ఎక్కి క్రింద పడే ఈ ఆట అనాదిగా తయారైన ఆట. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మన బుద్ధిలో ఉంది. సత్యయుగంలో ఉండదు.
2) ప్రాక్టికల్‌గా ఈశ్వరుని సంతానంగా అవ్వకుండా ఈశ్వరీయ దర్బారులో కొంచెం కూడా జమ అవ్వదు చాలామంది మనుష్యులు మనము ఏ కర్మ చేసినా, మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు దాని ఫలము తప్పకుండా లభిస్తుందని భావిస్తారు. ఉదాహరణానికి ఎవరైనా దాన పుణ్యాలు చేస్తే, యజ్ఞము, హవనము చేస్తే, పూజలు పఠనాలు చేస్తే వారు మనము ఈశ్వరార్థము చేసిన దానము పరమాత్ముని దర్బారులో జమ అవుతుందని, మనము మరణిస్తే దాని ఫలము లభిస్తుందని, మనకు ముక్తి లభిస్తుందని భావిస్తారు. కాని ఇవన్నీ చేసినందున సదాకాలానికి లాభము లభించిందని మనము తెలుసుకున్నాము. ఏ కర్మలు చేస్తామో వాటి వలన క్షణభంగుర సుఖము తప్పకుండా ప్రాప్తి అవుతుంది. కాని ఎంతవరకు ఈ ప్రాక్టికల్‌ జీవితము సదా సుఖవంతంగా అవ్వదో అంతవరకు దానికి ప్రతిఫలము లభించజాలదు. భలే మనము ఎవరినైనా మీరు ఏమేమి చేస్తూ వచ్చారు, వాటి ద్వారా మీకు పూర్తి లాభం లభించిందా అని అడిగితే వారు జవాబు చెప్పరు. ఇప్పుడు పరమాత్మ వద్ద జమ అయ్యిందో లేదో మనకేం తెలుసు? ఎంతవరకు మనము మన ప్రాక్టికల్‌ జీవితంలో శ్రేష్ఠ కర్మలు చేయమో అంతవరకు ఎంత కష్టపడినా ముక్తి - జీవన్ముక్తులు ప్రాప్తి చేసుకోలేము. అచ్ఛా. దాన-పుణ్యాలు చేశారు కానీ అవి చేసినందున ఏ వికర్మలూ భస్మము అవ్వలేదు. మరి ముక్తి-జీవన్ముక్తులు ఎలా ప్రాప్తి అవుతాయి? భలే ఇంతమంది సాధు-సత్పురుషులు మహాత్మలు ఉన్నారు, అయితే వారికి ఎంతవరకు కర్మల గురించిన జ్ఞానము లేదో అంతవరకు వారు చేసే కర్మలు అకర్మలుగా అవ్వలేవు. వారు ముక్తి-జీవన్ముక్తులను ప్రాప్తి చేసుకోలేరు. వారికి కూడా సత్యమైన ధర్మమేదో, సత్యమైన కర్మ ఏదో తెలియదు. కేవలం నోటి ద్వారా రామ-రామ అంటూ ఉన్నందున ఎవ్వరికీ ముక్తి లభించదు. పోతే మరణించిన తర్వాత ఏ లాభము లభిస్తుందో వారికి తెలియనే తెలియదు. ఏ లాభమూ లభించదు. పోతే మనుష్యులు తమ జీవితంలో చెడు కర్మలు చేసినా, మంచి కర్మలు చేసినా అవన్నీ ఈ జీవితంలోనే అనుభవించాలి. శుద్ధ కర్మలు చేసి ప్రాక్టికల్‌ జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలనే జ్ఞానము ఇప్పుడు మనకు టీచరైన పరమాత్ముని ద్వారా లభిస్తోంది.

Telugu Murli 16/10/2017

16-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - జ్ఞానములో మాయ ద్వారా విఘ్నాలు రావు, యోగములో వస్తాయి. యోగము లేకుండా చదువు ధారణ జరగజాలదు. కనుక వీలైనంత ఎక్కువగా యోగములో ఉండే పురుషార్థము చేయండి.''
ప్రశ్:- క్రింద పడిపోయిన పిల్లలను బాబా ఏ విధంగా పైకి ఎత్తుతారు?
సమా:- బాబా అటువంటి పిల్లలను తరగతిలో పొగుడ్తారు, బుజ్జగించి ప్రేమిస్తారు, ధైర్యమిస్తారు. పిల్లలూ, మీరు చాలా మంచివారని అంటారు. మీరు జ్ఞాన గంగలుగా అవ్వగలరు. మీరు ఈ విశ్వానికి రాజులుగా అయ్యేవారు. నేను మీకు ఉచితంగా చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. మరి మీరెందుకు తీసుకోరు? రాహు గ్రహణము ఏమైనా పట్టి ఉందా? మురళి చదువుతూ యోగము చేస్తే మీ గ్రహణము వదిలిపోతుంది. ఇటువంటి ధైర్యమును ఇప్పించుట వలన పిల్లలు మళ్లీ తలంపు, చదువులో లగ్నమైపోతారు. ఈ విధి ద్వారా చాలా మంది పిల్లల గ్రహచారము వదిలిపోతుంది.
పాట:- దూరదేశములో ఉండే,...............( దూర్‌దేశ్‌ కే రహ్‌నే వాలా,..........)
ఓంశాంతి. భగవానువాచ! గీతలోని రెండు పదాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాటినే వింటూ వచ్చారు. ఈ గీతా శాస్త్రము స్వర్గములో లేదు. తర్వాత దీనిని మనుష్యులు కూర్చుని తయారు చేశారు. అందువలన భగవానువాచ - ఏమంటున్నారు? పిల్లలూ! - ''మన్మనాభవ'' ఇది మీరు వింటూ వచ్చిన సంస్కృత పదమే. దాని అర్థము ఎవ్వరూ తెలుసుకోలేరు. వస్తూనే మన్మనాభవ అని అంటారు. శ్రీ కృష్ణ భగవానువాచ అయితే కృష్ణుడు, పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అంటాడా? కావున ఇది అసత్యమైపోయింది కదా. ఇచ్చట పరమపిత పరమాత్మ శివుడు సాలిగ్రామాలకు - మన్మనాభవ అని చెప్తున్నారు. అనగా పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండి అని అర్థము. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మృత్యువు సమీపిస్తోంది. గురువులు సోదరులు, బంధువులు ఎవరైనా మరణించే స్థితిలో ఉన్నప్పుడు రామ, కృష్ణ అని అనమంటారు లేక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు లేక ఎవరిదైనా గురువు చిత్రాన్ని వారి ముందుంచుతారు. ఇచ్చట మనుష్యులందరు మృత్యువు పాలు కావలసిందే. అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ శబ్ధము నుండి అతీతంగా పరంధామము, నిశ్శబ్ధ ప్రపంచములోకి వెళ్లాలి. దానిని నిరాకార ప్రపంచమని కూడా అంటారు. అది ఆత్మల ప్రపంచము. ఇక్కడకు వచ్చినప్పుడు ఆత్మ సాకారంగా అవుతుంది. అక్కడ శరీరము లేదు. ఇక్కడ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను వాపస్‌ తీసుకెళ్లేందుకు వచ్చాను. నేను మృత్యువుకే మృత్యువును. అమృతసర్‌లో ఒక అకాల సింహసనాన్ని కూడా ఉంచారు. అకాల్‌(అకాలుడు) అనగా కాలుడు కబళించలేనివారు. ఇప్పుడు మృత్యువుకే మృత్యువు అయిన బాబా చెప్తున్నారు - నేను మిమ్ములను వాపస్‌ తీసుకెళ్తాను. మీరు మళ్లీ పాత్రను అభినయించేందుకు రావాలి. సృష్టి ఆదిలో మొదట ఎవరి పాత్ర నడిచింది? ఎందుకంటే ఈ సృష్టి విభిన్న ధర్మాల వృక్షము. అందరూ నంబరువారుగా వస్తారు. మొదటిది దేవతా ధర్మము. ఇప్పుడా ధర్మము ప్రాయ: లోపమైపోయింది. దాని జ్ఞానము కూడా లోపించింది. కావున శాస్త్రాలలో అదెక్కడ ఉంది? ఏ సహజ రాజయోగముతో వారు దేవతలుగా అయ్యారో అది కూడా మాయమయ్యింది. మిగిలిన ఈ గీత మొదలైనవి భక్తి సామాగ్రి. ఎందుకంటే ఈ జ్ఞానము మీకు ఇక్కడ మాత్రమే లభిస్తుంది. దాని శాస్త్రాలు సత్య-త్రేతా యుగాలలో ఉండవు. కావున ద్వాపరములో ఎక్కడ నుండి వస్తుంది? అక్కడ మీ సత్యమైన గీత మొదలైనవేవీ ఉండవు. అక్కడ మళ్లీ డ్రామానుసారము అదే భక్తి మార్గపు గీత మొదలైనవి తయారు చేస్తారు. పూర్వము సాధు మహాత్ముల బుద్ధి బాగుండేదని అంటారు. కనుక ఈ శాస్త్రాలు మొదలైనవి వారే కూర్చుని తయారు చేశారని అంటారు. డ్రామానుసారము తయారవ్వాల్సే ఉంది. ఆ సమయంలో వాస్తవిక విషయము ఎక్కడి నుండి రాగలదు? ఉదాహరణానికి గాంధీతో పాటు మోతీలాల్‌ మొదలైనవారి పాత్ర ఉండేది. ఇప్పుడు ఆ నాటకము తయారుచేస్తే వారిప్పుడెలా వస్తారు? అదే విధంగా ఈ శాస్త్రాలు కూడా కృత్రిమంగా తయారుచేస్తారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన నడుస్తూ ఉంది. దేని స్థాపన? సత్యయుగము కొరకు దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోందని పిల్లలకు తెలుసు. కావున నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చేస్తారని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్నారు కనుక టేపు వినాలి లేదా మురళి రివైజ్‌ చేయాలి లేక యోగము చేయాలి. అలా చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. రోజంతా పనిలో ఉంటారు. అచ్చట యోగము అసలే చేయరు. ఇందులో మాయ చాలా విఘ్నాలు కలిగిస్తుంది. మాయ జ్ఞానము నుండి దూరము చేయదు. యోగము నుండి దూరము చేస్తుంది. సంకల్ప, వికల్పాలు యోగములో ఉండనివ్వవు. చదువులో ఇన్ని విఘ్నాలు ఏర్పడవు. అయితే యోగము లేకుండా చదువు ధారణ అవ్వదు. జ్ఞానము కంటే యోగము సులభమైనది. వృద్ధ మాతలు మా బుద్ధిలో ఇన్ని పాయింట్లు కూర్చోవు అని అంటారు. వారికి కూడా బాబా, '' అయితే నన్ను స్మృతి చేయండి '' అని అంటారు.

హే భక్తులారా! - అని బాబా అంటారు. అందరూ భక్తులే అయితే మీరు అపురూపమైన భక్తులు. పూర్తిగా అర్ధకల్పము భక్తి చేశారు. అందరూ పూర్తిగా భక్తి చేయరు. ఇక్కడకు వచ్చునంత వరకు భక్తి చేస్తూనే ఉంటారు. అయితే మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. అది కూడా పిల్లల ద్వారా తెలిసిపోతుంది. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు శ్రీమతమును అనుసరిస్తారు. వారు మన కులానికి చెందిన వారని అర్థమవుతుంది. స్వయం పరమాత్మయే మమ్ములను చదివిస్తున్నారని ఎవరికైతే పూర్తి నిశ్చయముంటుందో వారు స్వంత పిల్లలు. స్వంత పిల్లలు బలిహారమౌతారు. సవతి పిల్లలు బలిహారమవ్వరు. బలి అయ్యేందుకు భయపడరాదు. భక్తిలో అయితే బలి అవుతూ వచ్చారు. ఏదో ఒకటి ఈశ్వరార్థము దానము చేస్తూనే వచ్చారు. ఇది కూడా బలి అవ్వడమే. మళ్లీ పరమాత్మనే కొడుకునిచ్చాడని, ధనమిచ్చాడని అంటారు. అయితే మనుష్యులకు దీని అర్థము తెలియదు. మీకిప్పుడు - ఇది కూడా భక్తికి ఫలితంగా తండ్రి అల్పకాలానికి ఇస్తూ వచ్చారు. సత్యయుగములో ఇలా ఉండదు, జరగదు. మీరు భక్తిలో ఏమి చేస్తూ వచ్చారో అది సత్యయుగములో చేయరు. దానము చేసేందుకు అక్కడ పేదవారెవ్వరూ ఉండరు. ఏ శాస్త్రమూ ఉండదు, ఏ మందిరమూ ఉండదు. ఇదంతా భక్తి మార్గములోని సామాగ్రి. సత్యయుగములో ఇవన్నీ ఉండవు. ఈ జ్ఞానము కూడా ప్రాయ: లోపమైపోతుంది. అచ్చట ప్రాలబ్ధము పొందుకునే పురుషార్థమేదీ లేదు. ప్రాలబ్ధమంతా ఇప్పటి పురుషార్థానిదే. ఇస్లాము, బౌద్ధుల జ్ఞానమైతే పరంపరగా నడుస్తుంది. ఎందుకంటే వాటి స్థాపన తర్వాత వినాశనము జరగదు. కనుక వాటిని గురించి అన్ని వివరాలు తెలిసి ఉంటాయి. అనగా వాటిని గురించి చరిత్ర ఉంటుంది. కానీ మీ తర్వాత వినాశనము జరుగుతుంది. అందులో అంతా సమాప్తమైపోతుంది. మళ్లీ ద్వాపరములో అవే వేదశాస్త్రాలు మొదలైనవన్నీ వెలువడ్తాయి. ఇవన్నీ గీత సంతానమే. వాటిని ధర్మ శాస్త్రాలని అనరు. ఎందుకంటే దేని ద్వారా ధర్మ స్థాపన జరుగుతుందో దానినే ధర్మ శాస్త్రమని అంటారు. ఉదాహరణానికి ఏసుక్రీస్తు మహావాక్యాలను సందేశకుని మహావాక్యాలని అంటారు కదా. ఏసుక్రీస్తును గాడ్‌ఫాదర్‌ అని అనరు. అతడిని భగవంతుని పుత్రునిగా భావిస్తారు. గాడ్‌(భగవంతుడు) క్రైస్తవ ధర్మ స్థాపన చేసేందుకు ఏసుక్రీస్తును పంపించారని అంటారు. కావున అతడు తాను స్థాపించిన ధర్మాన్ని పాలన కూడా చేయాలి. సతో, రజో, తమోలో వచ్చి తీరాలి. వాపస్‌ ఎవ్వరూ వెళ్లలేరనే జ్ఞానము అతడికి ఉండదు.

మంచిది. వారు తయారుచేసిన గీత స్మృతిచిహ్నమని బాబా అర్థం చేయించారు. అది దేవతా ధర్మ శాస్త్రమయినా దానిని అసత్యంగా తయారు చేశారు. అందులో సత్యము పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. ఎందుకంటే జరిగిన తర్వాత కూర్చుని తయారు చేశారు. సత్య త్రేతా యుగాలలో జ్ఞానమెవ్వరికీ లేదు. సత్యయుగములో ఉన్న బంగారు, వజ్రాల మహళ్లు ఏమయ్యాయో, ఎక్కడికి వెళ్లాయో, ఎందుకు పోయాయో వారికి తెలియనే తెలియదు. సముద్రములో ద్వారకా పట్టణము మునిగిపోయిందని అంటారు. అయితే సముద్రములో మునిగి పోదు. భూకంపాలు మొదలైనవాటిలో అన్నీ సమాప్తమైపోతాయి. తర్వాత స్వర్గ నామ-రూపాలు కూడా ఉండవు. ప్ర్రాలబ్ధాన్ని అనుభవించి సమాప్తము చేశారు కనుక వారి నామ-రూపాలేవీ ఉండవు. చరిత్ర కూడా ఉండదు. మందిరాలు నిర్మిస్తే వాటి చరిత్ర ఉంటుంది. పూజ ఎప్పటి నుండి మొదలయ్యింది? గజనీ మొహమ్మద్‌ ఎప్పుడొచ్చాడు? భారతదేశ ధనాన్ని ఎలా దోచుకున్నాడు? ఈ జ్ఞానమంతా బుద్ధికి భోజనము వంటిది. అయితే యోగము సరిగ్గా లేకుంటే వినే సమయములో సంతోషముంటుంది. కానీ నిలబడదు. పవిత్రంగా లేకుంటే అసలే నిలువదు. ఇది ఎవరి వశమూ కాదు. ఇది శాస్త్రాల జ్ఞానము కాదు. అదైతే అందరూ కంఠస్థము చేస్తారు. ఇది 21 జన్మల కొరకు చదువు. అక్కడ సత్యయుగంలో భలే తండ్రి సింహాసనము పై కూర్చుంటారు. కాని అది కూడా ఇచ్చటి సంపాదనకు ప్రాలబ్ధమే. వారసత్వము కాదు. దేవతలు ఒకరికొరు వారసత్వమునివ్వరు. అందువలన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది. మీరు మమ్మా - బాబాలను అనుసరించాలి. వారు సన్యాసులకు నామమాత్రపు అనుచరులుగా ఉంటారు. అచ్చట దేవీ దేవతల రాజ్యముంటుంది. యథా రాజా - రాణి, భగవతి - భగవాన్‌ తథా ప్రజలుగా అయ్యేందుకు(రాజా-రాణి అంటే భగవాన్‌ భగవతి ఎలా ఉంటారో ప్రజలు అలాగే ఉంటారు) తండ్రి చదివిస్తున్నారు, అంతేకాని ఆశీర్వదించరు. వారు మనలను చదివించడమే ఆశీర్వాదము. మీరు ఆశీర్వదిస్తే, నూరు మార్కులు వస్తాయని టీచరుతో అంటారా? బాబా చదివిస్తారు. ఈ చదువు అందరి కొరకు. క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ అందరూ సర్వధర్మాన్‌ పరిత్యజ్య....... అని అంటారు కదా. ఇవన్నీ దేహ ధర్మాలు కదా. బాబా చెప్తున్నారు - '' ఇవన్నీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. '' ఆత్మలన్నీ అవినాశి. ఒకే తండ్రి పిల్లలు కదా. కావున అమ్మ, నాన్న, చిన్నాన్న మొదలైన దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఒంటరి ఆత్మనని నిశ్చయము చేసుకొని నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. అందుకు ఏ ఇతర మార్గమూ లేదు. దీనినే యోగాగ్ని అని అంటారు.''

బాబా ఉత్తరాలలో మధువనములో రాత్రి సమయములో జరిగిన చిట్‌చాట్‌ (పిచ్చాపాటి) ఉంటుంది. మధువనములో బాబా నవ్విస్తారు, ఉత్సాహము కూడా కలిగిస్తారు. నీవు చాలా మంచిదానవు, జ్ఞాన గంగగా అవ్వగలవు అని అంటారు. టెలిఫోన్‌ ఆఫీసులో నౌకరీ చేస్తున్నావా? నీవు మహారాణిగా తయారయ్యే దానివి అంటూ క్రిందపడే వారిని కూడా ఉద్ధరిస్తారు. చాలా మందికి రాహు గ్రహణము పట్టుకుంటుందని, అది నాకు తెలుసునని బాబా అంటారు. సమాచారము వస్తే బాబా వారిని పైకెత్తుతారు. నేను ఉచితంగా చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు వస్తే మీకేమయింది! రాహు గ్రహణము పట్టిందా? యోగము చేయండి, మురళి వినండి..... ఇటువంటి పత్రాలు వ్రాయాల్సి వస్తుంది. చాలా రకాలైన జాబులు వస్తాయి. ఎవరికైనా ఎవరితోనైనా మనస్సు లగ్నమైతే పరస్పరము గాంధర్వ వివాహము చేసుకుంటామని ప్లాను తయారు చేసుకుంటారు. నేను నిన్ను రక్షిస్తాను, బంధనము నుండి విడిపిస్తాను అని అంటారు. నీవెలా రక్షిస్తావని బాబా అంటున్నారు. మొదట నీవు మాయ నుండి రక్షింపబడ్డావా? బాబాతో సలహా తీసుకున్నావా? శ్రీమతము తీసుకోకుండా పరస్పరము పెళ్లి మాటలు మాట్లాడుకుంటారా! కావున ఓ శవాల్లారా! మాయ మిమ్ములను ఈడ్చుకుని పోతుంది. సూక్ష్మములో మనస్సు తగులుకుంటే ఇటువంటి మాటలు (వివాహపు మాటలు) మాట్లాడ్తారు. ఇటువంటి వారు రసాతలములోకి పోతున్నారని బాబాకు అర్థమైపోతుంది. నిశ్చితార్థము ఎప్పుడూ తల్లితండ్రులే చేస్తారు. మీరు ముట్టె(బుడంకాయలు, చిన్నవారు), కుర్రవాళ్లు. పరస్పరము మీరే రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారా? ఇటువంటి విఘ్నాలు వస్తాయని మీకు తెలియదు. బెల్లానికి, బెల్లపు సంచికే (శివబాబాకు, బ్రహ్మబాబాకు) మాత్రమే దాని రుచి తెలుస్తుంది. బాబాకు పిల్లలందరి గూర్చి తెలుసు. బాబా నేను మీ ''స్వంత బిడ్డనా, సవతి బిడ్డనా'' అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు శరీరాన్ని వదిలితే ఏ పదవిని పొందుకుంటాను? అని అడగవచ్చు. శరీరము పై ఏ నమ్మకమూ లేదు. స్టీమర్లు మునిగిపోతాయి. విమానాలు పడిపోతాయి. అప్పుడు గతి ఏమౌతుంది? మృత్యువు అందరి తలల పై నాట్యము చేస్తూ ఉంది. కావున ఈ రోజు పని రేపటికి వాయిదా వేయకండి. లేకుంటే - '' చూడు రేపు-రేపు అంటూ మృత్యువు తినేసింది'', శ్రీమతమును అనుసరించకుండా రాజ్య పదవి పోగొట్టుకున్నావు'' అని ధర్మరాజపురిలో సాక్షాత్కారమౌతుంది. కొద్దిగా వింటున్న వారైతే స్వర్గములోకి వచ్చేస్తారు. మళ్లీ స్థాపనలో ఎవరెంత సహయెగము చేస్తారో అంత పదవిని పొందుతారు. గాంధీగారికి సహాయము చేసినవారు ఎంతమంది జైలుకెళ్లారు! ఎంతమంది మరణించారు, ఫలితంగా ఏమి లభించింది? ఎవరైనా ధనవంతులైన కాంగ్రెసు వారి వద్ద జన్మించి ఉంటారు. ఇప్పుడు చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. మరి వారికి ఏ సుఖము లభించింది? కాని జ్ఞానము విని వెళ్లిపోతే అది వ్యర్థమవ్వదు. ఇక్కడ దేనినీ వదిలించరు. ఈమెను వారు వికారాల కొరకు విసిగించారు. అందుకే విధి లేక ఆమె వారిని(ఆమె భర్తను) వదలవలసి వచ్చింది. లేకుంటే ఏమి చేస్తుంది! అందువలన తండ్రి ఆమెకు రక్షణ ఇవ్వవలసి వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు కూడా శరణు తీసుకుంటూ ఉంటారు. ఇందులో తీసుకెళ్లే విషయమే లేదు. డ్రామానుసారము ఈ గోశాల తయారవ్వవలసి ఉండింది. నిజానికి ఇది పిల్లల విషయము, కాని వారు గోశాల అని పేరు పెట్టేశారు. కృష్ణుడు నది దాటి వెళ్తే ఆవులు కూడా దాటుకొని ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి విషయాలే. వీటన్నిటి కంటే ముందు జ్ఞానము తీసుకోండి. తండ్రి నుండి వారసత్వము తీసుకోండి. భలే మీ వ్యాపారాలు చేసుకోండి, దానితో పాటు ఈ రెండవ కోర్సు తీసుకోండి. విదేశాలలో ఉంటున్నా మురళి తప్పక చదవండి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహ సంబంధాలను మరిచి స్వయాన్ని ఒంటరి ఆత్మగా భావించాలి. తండ్రికి పూర్తిగా బలిహారమవ్వాలి. ఇందులో భయపడరాదు.
2. ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడేందుకు ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయరాదు. చదువు ఆధారంతో తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి.

వరదానము:- ''కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ (సమతుల్యత) ద్వారా నిర్ణయ శక్తిని పెంచుకునే సదా నిశ్చింత భవ''
ఎవరి బుద్ధి అయితే సమయానికి యదార్థమైన జడ్జిమెంటునిస్తుందో వారే నిశ్చింతులుగా ఉంటారు. ఎందుకంటే రోజురోజుకు సమస్యలు, పరిస్థితులు ఇంకా టైట్‌ అవుతాయి (బిగుసుకుంటాయి). అటువంటి సమయంలో కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ ఉంటే నిర్ణయశక్తి ద్వారా సహజంగా వాటిని దాటుకుంటారు. ఈ బ్యాలన్స్‌ కారణంగా బాప్‌దాదా ద్వారా ఏ ఆశీర్వాదాలైతే ప్రాప్తిస్తాయో వాటి వలన ఎప్పుడూ సంకల్పములో కూడా ఆశ్చర్యము కలిగించే ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. ఇలా ఎందుకు జరిగింది? వీరికేమయింది?..... ఇటువంటి ప్రశ్నలు రావు. ఇప్పుడేం జరుగుతూ ఉందో అందులో కళ్యాణము దాగి ఉంది అని సదా పక్క నిశ్చయముంటుంది.

స్లోగన్‌:- ''ఒక్క బాబాతో సర్వ సంబంధాల రసము తీసుకోండి, ఇంకెవ్వరి స్మృతీ రాకూడదు''

Telugu Murli 15/10/2017

15-10-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 15-02-1983 మధువనము

''విశ్వశాంతి సమ్మేళనము సమాప్తి సమారోహములో ప్రాణమైన అవ్యక్త బాప్‌దాదా అమూల్య మహావాక్యాలు''
ఈ రోజు అనంతమైన తండ్రి సేవకు నిమిత్తమైన సేవాధారీ పిల్లలను చూస్తున్నారు. ఏ పుత్రుని చూసినా ప్రతి ఒక్కరు ఒకరి కంటే ఒకరు శ్రేష్ఠ ఆత్మగా ఉన్నారు. అందుచేత బాప్‌దాదా ప్రతి శ్రేష్ఠ ఆత్మలోని, సేవాధారీ ఆత్మలోని విశేషతలను చూస్తున్నారు. ప్రతీ పుత్రుడు ఈ విశ్వ పరివర్తనా కార్యంలో ఆధారమూర్తిగా, ఉద్ధారమూర్తిగా ఉన్నారని బాప్‌దాదా హర్షిస్తున్నారు. పిల్లలందరు బాప్‌దాదా కార్యంలో సదా సహయోగీ ఆత్మలుగా ఉన్నారు. ఈ విధమైన సహయోగి, సహజయోగి, శ్రేెష్ఠమైన విశేష ఆత్మలను లేక సేవలో నిమిత్తమైన పిల్లలను చూసి బాప్‌దాదా అతి స్నేహయుక్త సువర్ణ పుష్పాలతో పిల్లలకు స్వాగతోత్సవాన్ని, అభినందనల ఉత్సవాన్ని జరుపుతున్నారు. బాప్‌దాదా ప్రతి పుత్రుని మస్తక మణిలా, సంతుష్ట మణిలా హృదయ మణిలా మెరుస్తున్న స్వరూపంలో చూస్తున్నారు. బాప్‌దాదా కూడా సదా ఒక పాట పాడుతూ ఉంటారు. ఏ పాట పాడ్తారో తెలుసు కదా? '' ఓహో!(వాహ్‌) నా పిల్లలూ ఓహో! ఓహో! మధురమైన పిల్లలూ ఓహో!, ఓహో! ప్రియాతి ప్రియమైన పిల్లలూ ఓహో!, ఓహో! శ్రేష్ఠ ఆత్మలూ ఓహో...! '' అనే పాట పాడ్తారు. ఇలాంటి నిశ్చయము మరియు నషా సదా ఉంటోంది కదా! భగవంతుడు తన పిల్లల పాటలు పాడడమనే శ్రేష్ఠ భాగ్యము కల్పం మొత్తంలో ఎప్పుడూ ప్రాప్తించదు. భక్తులు భగవంతుని పాటలు చాలా పాడ్తారు. మీరు కూడా చాలా పాటలు పాడారు కానీ ఎపుడైనా భగవంతుడు మన గురించి పాటలు పాడ్త్తారని అనుకున్నారా? ఏది అనుకోలేదో దానిని సాకార రూపంలో చూస్తున్నారు. విశ్వశాంతి సమ్మేళనాన్ని చేశారు. పిల్లలంతా నోటి ద్వారా చాలా మంచి మంచి మాటలు వినిపించారు, అంతేకాక మనసు ద్వారా సర్వాత్మల పట్ల శుభ భావన, శ్రేష్ఠ కామనల, శుభ సంకల్పాల ప్రకంపనాలు కూడా నలువైపులా జ్ఞాన సూర్యులై వ్యాపింపజేస్తారు. కానీ బాప్‌దాదా ఉపన్యసించిన వారందరి ఉపన్యాసాల సారాన్ని వినిపిస్తున్నారు. మీరు నాలుగు రోజులు ఉపన్యసించారు. బాప్‌దాదా ఒక్క సెకండు ఉపన్యసిస్తారు. అవి రెండు శబ్ధాలు - రియలైజేషన్‌ మరియు సొల్యూషన్‌(వాస్తవితకను గ్రహించడం మరియు పరిష్కారం) ఏదైతే మీరంతా మాట్లాడారో దాని సారం - రియలైజేషనే. ఆత్మను అర్థం చేసుకోనప్పటికీ, మానవ విలువలు తెలుసుకున్నా శాంతి వచ్చేస్తుంది. మానవుడు విశేషించి శక్తిశాలీ స్వరూపము. ఒకవేళ ఇది కూడా తెలియకపోయినా మానవుని లెక్కలో చూసినా మానవ ధర్మము స్నేహము, కాని యుద్ధాలు, కొట్లాటలు కాదని అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి - మానవ జీవితములో మానవతకు ఆధారం ఆత్మ పైన ఉంది. నేను ఎలాంటి ఆత్మను! ఎవరిని? ఈ వాస్తవాన్ని తెలుసుకున్నా శాంతి వారి స్వధర్మమైపోతుంది. మళ్లీ ఇంకొద్దిగా ముందుకెళ్ళండి - నేను శ్రేష్ఠమైన ఆత్మను. సర్వశక్తివంతుని సంతానాన్ని. ఈ రియలైజేషన్‌ నిర్బలత్వం నుండి శక్తి స్వరూపంగా చేసేస్తుంది. శక్తి స్వరూప ఆత్మ లేదా మాస్టర్‌ సర్వశక్తివంతమైన ఆత్మ ఏది కావాలంటే, ఎలా కావాలంటే అది ప్రాక్టికల్‌గా చేయగలరు. అందువలన మొత్తం ఉపన్యాసాల సారం 'రియలైజేషన్‌' ఒక్కటే అని వినిపించాను కదా. బాప్‌దాదా అందరి ఉపన్యాసాలు విన్నారు కదా! బాప్‌దాదా సదా పిల్లల జతలో ఉండనే ఉంటారు. అచ్ఛా!

సేవలో సమర్పితమైన పిల్లలందరికి అన్ని జోన్ల నుండి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు బాప్‌దాదా నాకే చెప్తున్నారు అని భావించండి. ఒక్కొక్కరితో మాట్లాడ్తున్నారని భావించండి. పిల్లలందరు ప్రత్యక్షంగా ఏ ఋజువునైతే చూపించారో దానికి బదులుగా బాప్‌దాదా ప్రతి పుత్రుని నామ సహితంగా వారి రూపాన్ని చూస్తున్నారు. పేరు సహితంగా అభినందిస్తున్నారు. ఇప్పుడిక ఎప్పుడైతే మీరు సమయ పరివర్తన గురించిన సూచన ఇస్తున్నారో అపుడు బాప్‌దాదా మిలనం కూడా పరివర్తన అవుతుంది కదా. మా పరివారం వృద్ధి అయితే పాత వారిని త్యాగం చెయ్యాల్సి ఉంటుందని మీరంతా సంకల్పం చేసారు కదా. కాని వారి ఈ త్యాగంలోనే భాగ్యముంది. వేరేవారిని ముందుకు తీసుకెళ్ళడమంటే స్వయం ముందుకు వెళ్ళడమే అవుతుంది. బాప్‌దాదాకు దేశంలోని పిల్లలకంటే విదేశీయులైన పిల్లలంటే ఎందుకు ఇష్టం! అని అనుకోకండి లేదా కొంతమంది విశేషమైన పిల్లలంటే ఇష్టం అని అనుకోకండి. బాప్‌దాదాకు ప్రతి పుత్రుడు హృదయానికి ఆసరాగా, మస్తకముపై కిరీటములోని మణిగా ఉన్నాడు. అందువలన బాప్‌దాదా అందరికంటే ముందు తన కుడి భుజాల వలె ఉన్న సహయోగి పిల్లలను, అతి ప్రియమైన పిల్లలను చాలా ప్రేమగా ప్రియస్మృతుల నిస్తున్నారు. వీరు తప్పకుండా దూరంనుండి వచ్చిన వాళ్ళు.. సంపర్కంలోకి వచ్చిన వారిని సంబంధములోకి తీసుకొచ్చేందుకు మీరంతా సంతోషంగా వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.

ఈ సమయంలో అందరు సేవ కొరకు వచ్చారు. అందువలన ఈ సేవ కూడా అయిపోయింది. ప్రతి జోన్‌ పేరు చెప్పాలా ఏంటి? ఒకవేళ ఒక పేరు తీసుకొని ఏదైనా మిగిలిపోతే? అందుచేత ప్రతి జోన్‌ వారూ బాప్‌దాదా నా నెంబరునే ముందు ఉంచారని భావించండి. దేశ విదేశాల్లోని పిల్లలందరు ఇపుడు మధువన నివాసులుగా అయ్యారు. అందుచేత విశ్వశాంతి హాల్‌లో ఉపస్థితులైన పిల్లలందరికీ, ఓంశాంతి భవనంలో నివసించే పిల్లలకు బాప్‌దాదా - '' సదా స్మృతిలో ఉండండి, ఇతరులకు స్మృతినిప్పిస్తూ ఉండండి. ప్రతి అడుగు స్మృతి చిహ్న చరిత్రను తయారు చేస్తూ నడవండి. ప్రతి సెకండు తమ ప్రాక్టికల్‌ జీవితమనే దర్పణం ద్వారా సర్వాత్మలకు స్వయం యొక్క తండ్రి యొక్క సాక్షాత్కారము చేయిస్తూ నడవండి. ఇలాంటి వరదానీ, మహాదానీ సదా సంపన్నులైన పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే!

రాబర్ట్‌ ముల్లర్‌ (అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ యు.ఎన్‌.ఓ.) పట్ల మహా వాక్యాలు :- మీరు సేవలో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పాత్రధారి ఆత్మ. మనసులో ఏ కార్యము కోసం నిమిత్తమయ్యామో అది చేసి చూపిస్తామనే శ్రేష్ఠ సంకల్పాన్ని ఉంచారు. ఈ సంకల్పము బాప్‌దాదా మరియు మొత్తం బ్రాహ్మణ పరివారము యొక్క సహయోగము ద్వారా సాకారములోకి వస్తూనే ఉంటుంది. సంకల్పము చాలా బాగుంది. ప్లాన్లు కూడా చాలా మంచి మంచివి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్‌ మధ్యలో ఈ ఆధ్యాత్మిక శక్తి కలుస్తే ప్లాన్‌ సాకారములోకి వస్తూ ఉంటుంది. బాప్‌దాదా వద్దకు పిల్లలందరి ఉత్సాహము చేరుతూ ఉంటుంది. సదా స్థిరంగా ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విశ్వశాంతి జెండాలు విశ్వంలో నలువైపులా ఎగిరే రోజును కూడా ఈ కళ్ళతో చూస్తారు అందువలన ముందుకు వెళ్తూ ఉండండి. ప్రపంచంలోనివారు ఉదాసీనతలోకి తీసుకొస్తారు. మీరు అలా కాకండి. ఒకే బలము, ఒకే నమ్మకము - ఈ నిశ్చయంతో నడుస్తూ ఉండండి. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా తండ్రిని తోడుగా చేసుకోండి. అలా చేసుకుంటే నేను ఒంటరిగా లేను నా జతలో విశేషమైన శక్తి ఉందని అనుభవమవుతుంది. స్వప్నాలు పూర్తి అయిపోతాయి. ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ ఎన్ని తుఫానులు వచ్చినా, అది తోఫా(కానుక)గా మారిపోతుంది. ''నిశ్చయ బుద్ధి విజయంతి''. ఈ టైటిల్‌ను గుర్తు పెట్టుకోండి. 'నేను నిశ్చయ బుద్ధి విజయ రత్నాన్ని.' అచ్ఛా!

స్టీవ్‌ నారాయణ్‌(ఉపాద్యక్షులు, గయానా) పట్ల మహావాక్యాలు :- స్వయాన్ని తండ్రి హృదయ సింహాసనానికి సమీపంగా ఉండే రత్నంగా అనుభవం చేస్తున్నారా? దూర దేశంలో ఉన్నా హృదయానికి దూరంగా లేరు. పిల్లలలోని ఉత్సాహ-ఉల్లాసాలు చూసి బాప్‌దాదా హర్షితమవుతున్నారు. మీకు నెంబర్‌వన్‌ ఇస్తున్నారు. మీరు సదా ఎగిరేకళలో ఉండే బాప్‌దాదా కంటిపాపలు(నూరేరతన్‌) అందుచేత బాప్‌దాదా అభినందిస్తున్నారు.

(ఆంటీ కుమార్తెతో) - కొత్త జన్మ తీసుకుంటూనే మీకు ఆశీర్వాదము లభించింది. అదేమంటే మీరు సేవాధారులు, అనుభవీ మూర్తులు. గయానాలో ఉంటున్నా విశ్వ సేవకు నిమిత్తమైన మూర్తులుగా ఉన్నారు, ఇకమీద కూడా ఉంటారు. స్మృతి ద్వారా తండ్రి సహయోగము మరియు వరదానాలు అనుభవమవుతున్నాయి కదా! మీ స్మృతి తండ్రికి చేరుతూ ఉంటుంది. సర్వ సంకల్పాలు సిద్ధి అవుతున్నాయి కదా! శ్రేష్ఠ ఆత్మ అయిన మీరు చేసిన ఒకే శ్రేష్ఠ సంకల్పము ద్వారా మొత్తం పరివారమంతా శ్రేష్ఠ పదవిని పొందుతున్నారు. నీవు పదమాపదమ్‌ భాగ్యశాలివి.

విశ్వ శాంతి సమ్మేళనానికి వచ్చిన సోదరీ - సోదరుల పట్ల అవ్యక్త బాప్‌దాదా మధుర సందేశం (గుల్జార్‌ దాదీజీ) - ఎప్పటి వలెనే ఈ రోజు నేను వతనంలోకి చేరుకోగానే బాప్‌దాదా చాలా మధురమైన దృష్టి ద్వారా పిల్లలందరికి ప్రియ స్మృతులిస్తున్నారు. బాబా దృష్టి ద్వారా ఈ రోజు అతిశాంతి, శక్తి, ప్రేమ, ఆనందము యొక్క కిరణాలు వెలువడుతున్నట్లు అనుభవమయ్యింది. ఇలా ఆత్మిక దృష్టి ద్వారా నాలుగు విషయాలూ ప్రాప్తి అవుతూ ఉన్నవి. నేను చాలా పొందినట్లుగా అనిపించింది. ఆ విధంగా బాప్‌దాదా పిల్లలైన మనందరిని స్వాగతించి ఇలా అన్నారు - బచ్చీ, అందరి స్మృతిని తీసుకొచ్చావా? నేనన్నాను - స్మృతినైతే తీసుకొచ్చాను, దానితో పాటు అందరి ఆహ్వానము యొక్క సంకల్పము కూడా తీసుకొచ్చాను. అప్పుడు బాబా అన్నారు, ఈ సమయంలో ఇంతమంది ప్రియమైన నా పిల్లలు ఎవరైతే వచ్చారో, తెలుసుకోవడం కోసం వచ్చారో వారు నన్ను కలుసుకునే రోజు కూడా వస్తుంది. బాప్‌దాదా అయితే పిల్లలందరి దృశ్యాన్ని వతనంలో ఉంటున్నా సదా చూస్తూనే ఉంటారు. అలా చెప్తూ బాబా ఒక దృశ్యాన్ని చూపించారు. భారతదేశంలో ఎలాగైతే భక్తులు మందిరాలలో శివలింగ ప్రతిమను తయారు చేస్తారో అలా వతనంలో ఒక ప్రతిమను చూపించారు. కాని ఆ ప్రతిమ గోళాకారంలో ఉంది. ఆ గోళాకారంలో అనేక మెరుస్తున్న వజ్రాలు నలువైపులా కనిపిస్తున్నాయి. ఆ ప్రకాశిస్తున్న వజ్రాల పైన నాలుగు రకాల లైటు పడుతోంది. ఒకటి శ్వేత వర్ణం, రెండవది ఆకుపచ్చ, మూడవది లేత నీలి రంగు, నాల్గవది బంగారు రంగు. కొద్ది సమయంలో ఆ ప్రకాశము శబ్ధాలలోకి మారిపోయింది. తెల్లని ప్రకాశము నుండి 'శాంతి' అనే అక్షరాలు వ్రాయబడినవి, రెండవ దాని పై 'ఉమంగం', మూడవ దాని పై 'ఉత్సాహము' నాల్గవ ప్రకాశము పై ' సేవ '.

పిల్లలంతా చాలా ఉమంగ-ఉత్సాహాలతో, శాంతి సంకల్పం ద్వారా విశ్వ సేవ చేశారని బాబా చెప్పారు. ఒక్కొక్క ఆత్మ సంఘటిత రూపంలో ఎంత మెరుస్తూ ఉందో చూడండి. మళ్లీ బాబా అన్నారు - నా పిల్లలు నన్ను యథా శక్తిగా తెలుసుకున్నారు అయినా నా పిల్లలే కదా! నా మధురాతి మధురమైన పిల్లలందరికి ప్రియ స్మృతులు తెలపండి. ఏ పిల్లలైతే వచ్చారో వారందరి నోటి నుండి ఈ శబ్ధము వెలువడ్తుంది - మేము మా ఇంటికి వచ్చాము. బాప్‌దాదా పిల్లల ఈ శబ్ధము విని మందహాసము చేస్తున్నారు. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి అధికారము తీసుకునేందుకు వచ్చారా లేదా కొద్దిగానా? బాబా ఇలా అన్నారు - సాగర తీరానికి వచ్చి లోటాతో నింపుకొని వెళ్లరాదు, మాస్టర్‌ సాగరునిగా తయారై వెళ్ళాలి. గని వద్దకు వచ్చి రెండు గుప్పెళ్లు నింపుకొని వెళ్ళకండి. బాప్‌దాదా మూడు రకాల పిల్లలకు మూడు రకాల కానుకలు ఇచ్చారు. 1. బాబా అన్నారు - నా కలంధారీ పిల్లలు(ప్రెస్‌ వాళ్ళు) ఎవరైతే వచ్చారో వారికి బాప్‌దాదా కమలపుష్పాన్ని కానుకగా ఇస్తారు, నా కలంధారీ పిల్లలతో చెప్పండి - సదా వారు కమలాసన ధారులై మొత్తం విశ్వంలోని తమోగుణ వాతావరణానికి అతీతంగా మరియు తండ్రియైన పరమాత్మకు ప్రియమైన వారిగా అవ్వాలి. ఒకవేళ అలాంటి స్థితిలో స్థితమై కలం నడిపిస్తే మీ వ్యవహారము కూడా సిద్ధి అవుతుంది, పరమార్థము కూడా సిద్ధి అవుతుంది.

2. వి.ఐ.పి పిల్లలు ఎవరైతే వచ్చారో వారికి బాబా సింహాసనము బదులుగా హంస ఆసనాన్ని ఇచ్చారు. బాబా అన్నారు - వీరు ఎవరైతే నా వి.ఐ.పి. పిల్లలు వచ్చారో వారి నోటిలో(మాటలలో) శక్తి ఉంది. వీరికి నేను హంస ఆసనాన్ని ఇస్తున్నాను. మీరు ఈ ఆసనం పై కూర్చొని ఏ కార్యమైనా చేయాలి. హంస ఆసనం పై కూర్చోవడం వలన మీ నిర్ణయ శక్తి శ్రేష్ఠంగా ఉంటుంది అంతేకాక ఏ కార్యము చేసినా అందులో విశేషత ఉంటుంది. ఎలాగైతే కుర్చీ పై కూర్చొని పనులు చేస్తారో అలాగే బుద్ధిని హంస ఆసనం పై ఉంచితే లౌకిక కార్యము ద్వారా కూడా ఆత్మలకు స్నేహము మరియు శక్తి లభిస్తూ ఉంటుంది.

3. సమర్పిత సేవాధారీ పిల్లలకు ఒక చక్కటి లైటు పుష్పాలతో తయారుచేయబడిన హారాన్ని ఇచ్చారు. ప్రతి ప్రకాశము పై ఏదో ఒక దివ్య గుణము వ్రాసి ఉంది. మరి బాబా అన్నారు, నా పిల్లలైన వీరు సర్వ గుణాలు ధారణ చేసే గుణమూర్తులైన పిల్లలు. పిల్లలంతా ఒకే బలము, ఒకే మతముగా అయ్యి అనంతమైన సేవను చేశారు. దానికి బదులుగా బాప్‌దాదా ఈ దివ్య గుణాల మాలను పిల్లలందరికి కానుక రూపంలో ఇస్తున్నారు. చివరిగా ఇలా చెప్పారు - పిల్లలందరికి బాప్‌దాదా యొక్క ఈ మహా వాక్యాలకు వినిపించండి - అవి ఏమంటే సదా సంతోషంగా ఉండాలి, అదృష్టవంతులుగా అవ్వాలి మరియు అందరినీ సంతోషము యొక్క వరదానాలతో, ఖజానాలతో సంపన్నంగా తయారు చేస్తూ ఉండండి. అలా మధుర మహావాక్యాలు వింటూ యాద్‌ప్యార్‌ ఇస్తూ తీసుకుంటూ నేను సాకార వతనంలోకి చేరుకున్నాను.
వరదానము:- ''తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగించి పెంపొందించే జ్ఞానీ - యోగీ ఆత్మా భవ''
బాప్‌దాదా పిల్లలను సర్వ ఖజానాలతో సంపన్నంగా చేశారు కానీ ఎవరైతే సమయానికి ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగిస్తారో, వారి ఖజానా సదా వృద్ధి చెందుతూ ఉంటుంది. వారు ఎప్పుడూ - అలా నేను కోరుకోలేదు కానీ జరిగిపోయింది అని అనరు. ఖజానాలతో సంపన్నంగా ఉన్న జ్ఞానీ-యోగీ ఆత్మలు ఏ పనినైనా ఆలోచించిన తర్వాతనే చేస్తారు. వారికి సమయ ప్రమాణంగా టచ్‌ అవుతుంది. వారు దానిని క్యాచ్‌ చేసి(గ్రహించి) కార్య రూపంలో తీసుకొస్తారు, చేసిన ఒక్క సెకను తర్వాత ఆలోచించినా వారిని జ్ఞానీ ఆత్మలని అనరు.

స్లోగన్‌:- ''స్వభావంలో మరియు ఆలోచనలలో అంతరమున్నా స్నేహములో అంతరముండరాదు''

Telugu Murli 14/10/2017

14-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - వజ్ర సమానమైన జీవితాన్ని తయారుచేసే తండ్రిని చాలా ఖుషీ ఖుషీగా స్మృతి చేయండి. తద్వారా ఆత్మకు పట్టిన మలినము (తుప్పు) వదలిపోతుంది''
ప్రశ్న:- మాలలోని మణులుగా ఎవరు తయారవుతారు? దానికి చేయవలసిన పురుషార్థమేమి?
సమా:- చివరి సమయములో ఎవరికైతే ఇంకేదీ గుర్తు రాదో, వారే మాలలోని మణులుగా తయారవుతారు. ఏ పిల్లలైతే కర్మాతీత స్థితిని పొందుతారో, వారే మాలలోని మణులుగా అవుతారు. ఎవరైతే చాలా ధనవంతులుగా ఉన్నారో, అనేక పరిశ్రమలు మొదలైనవి ఎవరికున్నాయో,.......... వాటన్నిటినీ మర్చిపోవలసి వస్తుంది. ఎవరిలోనూ మమకారము ఉండరాదు. 'నాది-నాది' అనేది ఉండరాదు. ఎవరిని చూచినా ఇతడు నా సోదరుడు అనే(ఒక ఆత్మ) ఈ ఆత్మిక సంబంధము మాత్రమే ఉండాలి. ఏ ఇతర సంబంధమూ ఉండరాదు. ఇటువంటి ఆత్మిక సంబంధాన్ని ఉంచుకొని సర్వమూ మర్చిపోయే పిల్లలే మాలలోకి రాగలరు.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీకు మేము ఆత్మలమని, పరమాత్మ అయిన తండ్రికి పిల్లలమని పక్కాగా నిశ్చయమై ఉంటుంది. కావున అందరూ సోదరులే. సోదరులకు తండ్రి ఆదేశమిస్తున్నారు - పతితపావనులైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. కావున స్మృతి చేస్తున్నారా? లేక బుద్ధి యోగము ఏ ఇతర చోట అయినా తిరుగుతూ, వెతుకుతూ ఉందా? మాయ తప్పకుండా భ్రమింపజేస్తుంది. వద్దనుకున్నా మీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెత్తుతూ ఉంటుంది. బాబా మాకు సృష్టి చక్ర జ్ఞానమునిచ్చారు. 84 జన్మల కథ చదివించారని, ఈ 84 జన్మల చక్రము పూర్తి అయిందని, మేము మళ్లీ ఇంటికి వెళ్తామని అనేక పర్యాయాలు మేము స్మృతియాత్ర ద్వారా ఇంటికి పోయామని మీ బుద్ధిలోకి రావాలి. అంతేకాక మేమందరమూ భాయి-భాయి అని కూడా మీ బుద్ధిలోకి రావాలి. ఇందులో శరీరానికి సంబంధించిన విషయమేదీ లేదు. మీరు శరీరాన్ని స్మృతి చేయకండి. కేవలం మేము ఆత్మలము - మేమే పావనంగా, సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు పతితమైపోయాము. కావున వజ్ర తుల్యముగా తయారుచేసే తండ్రిని సంతోషంగా స్మృతి చేయాలి. తద్వారా మలినాలు(తుప్పు) వదిలిపోతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది కూడా జ్ఞానమే. తర్వాత తండ్రిని స్మృతి చేయండి - ఇది విజ్ఞానము. ఎందుకంటే ఆత్మ అయితే జ్ఞానానికి అతీతంగా విజ్ఞానములోకి అనగా శాంతిధామములోకి వెళ్లాలి. ఆత్మ స్వధర్మము కూడా శాంతియే. ఇల్లు కూడా శాంతియే. కావున మొదట మనము అచ్చటికి చేరుకోవాలి. బాబా కూడా అచ్చటి నుండే వచ్చారు. కాని మనుష్యులకు ఈ విషయాలేవీ తెలియదు.

ఈ పారలౌకిక తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నేను పరంధామము నుండి మీ వద్దకు డ్రామా ప్లాను అనుసారము వచ్చాను. ఎందుకు వచ్చాను? మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇప్పుడు మీరు పతితులై వికారులుగా అయిపోయారు. జన్మ-జన్మాంతరాలు వికారాల ద్వారానే జన్మించారు. అందువలన భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా ఎలా తయారవ్వాలో ఈ తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే పవిత్ర శ్రేష్ఠాచారులుగా అవుతారు. ఈ స్మృతిలో ఉంటూ మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. అంతేకాని వృత్తి వ్యాపారాదులు చేయకూడదని కాదు. అన్ని పనులు చేసుకోవచ్చు.

పిల్లలు తండ్రిని అడుగుతున్నారు - బాబా, మాలలోని మణులుగా ఎవరు అవుతారు? పిల్లలూ, మాలలోని మణులుగా కర్మాతీత అవస్థను పొందుతారో వారే అవుతారు. వారికి అంతిమములో ఏదీ గుర్తు రాకూడదు. ఎవరైనా చాలా ధనవంతులుగా ఉన్నారనుకోండి, అనేక ఇండస్ట్రీలు ఉన్నాయని అనుకోండి,........ అవన్నీ మర్చిపోవలసి ఉంటుంది. మీ వద్ద అయితే ఏమీ లేదు. మేము తండ్రి పిల్లలుగా అయ్యామని పరస్పరము సోదరులమని మీకు తెలుసు. మనకు ఎవరిలోనూ మమకారము లేదు. నాది-నాది అనేది లేదు కదా. ఇతడు నా సోదరుడనే సంబంధము మాత్రమే ఉంది. ఇక ఏ ఇతర సంబంధమూ లేదు. ఇలా ఉంటే దానిని ఆత్మీయ సంబంధమని అంటారు. ఇంతవరకు జీవితమంతా(ఇంత వయసు వరకు) శరీరమే గుర్తుకు వచ్చింది. ఆత్మ అయితే ఎవ్వరికీ గుర్తు రాలేదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు - అంతేకాక పావనంగా అయ్యేందుకు పురుషార్థము కూడా చేయిస్తారు. బాబా పిల్లలైన మీకు సమయము కూడా ఇస్తారు. కేవలం 8 గంటలు నన్ను స్మృతి చేయండి. అది హద్దు సర్వీసు, ఇది ప్రపంచమంతటికీ సర్వీసు. తప్పకుండా తింటారు, తాగుతారు, నిదురిస్తారు, తిరుగుతారు,....... రోజంతా అయితే ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఇప్పుడు మీరు తప్పకుండా బేహద్‌ సర్వీసు చేస్తున్నారు. తండ్రి ఎలాగైతే విచార సాగర మథనము చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా మథనము చేయడం నేర్పిస్తారు. వారు కరన్‌ కరావన్‌హార్‌(చేసి చేయించేవారు) కదా. అందువలన వారు చేసే మీకు నేర్పిస్తారు. పురుషార్థము చేస్తూ చేస్తూ మీ విజయ మాల తయారైపోతుంది. సత్య-త్రేతా యుగాలలో ఎవరైతే వస్తారో వారంతా విజయులుగా ఉంటారు. మళ్లీ పాత్రధారులందరూ ఈ నాటకములో పాత్ర చేసేందుకు నంబరువారుగా వస్తారు. అందరూ కలిసి ఒక్కసారే స్టేజి పైకి రారు. పాత్రధారులైన మీరందరూ నివసించే స్థానము - బ్రహ్మలోకము. అచ్చట నుండి ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తారు. ఈ విషయాలన్నీ చాలా సహజమైనవి. ఇవి పిల్లలైన మీకు మాత్రమే గుర్తుంటాయి. మీ ఇల్లు స్వీట్‌ హోమ్‌, సైలెన్స్‌ హోమ్‌. ఇతరులెవ్వరికి కూడా తమ ఇల్లు ఏదో తెలియదు. వారైతే మేము లీనమైపోతామని అంటారు. ఎలాగైతే సముద్రములో నీటి బుడగ(గాలి బుడగ) ఏర్పడి మళ్లీ అందులోనే ఇమిడి పోతుందో, అలా మేము కూడా ఆ బ్రహ్మ తత్వములో లీనమైపోతాము,.......... అని అంటారు. మళ్లీ వారే ఎచ్చట చూస్తే అచ్చట బ్రహ్మమే బ్రహ్మము అని అంటారు. వారు బ్రహ్మ తత్వాన్నే ఈశ్వరునిగా భావిస్తారు. అందువలన మీ మాటలు వారి బుద్ధిలో కూర్చోవు. మీరు వారిని తప్పుగా, వారు మిమ్మల్ని తప్పుగా భావిస్తారు. కాని ఆత్మలన్నీ శాంతిధామానికి తప్పకుండా వెళ్తాయని మీకు తెలుసు. పోతే ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది. దీనినే అద్భుతమని అంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఎంతో సూక్ష్మములోకి వెళ్తారు, ఎంతో చిన్నదైన ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయము చేస్తుంది! ఎలాగైతే ఈ జ్ఞానము తండ్రి వద్ద ఉందో, వారు జ్ఞానసాగరులో అలా పిల్లలైన మీ వద్ద కూడా ఉంది. మీరు ఇప్పుడు ఇటువంటి జ్ఞానయుక్త ఆత్మలుగా అవుతారు. వారు భక్తులు, మీరు జ్ఞానులు. భక్తులనగా రాత్రిలో(చీకటి) ఉండేవారు. జ్ఞానులనగా పగలు(ప్రకాశము)లో ఉండేవారు. అర్ధ కల్పము మీరు సుఖధామములో ఉంటారు, అర్ధకల్పము దు:ఖధామంలో ఉంటారు. దీనినే దూర దృష్టి అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధి చాలా దూర దూరాలకు వెళ్తుంది. మేము ఆత్మలము, స్వీట్‌ హోమ్‌ అనగా బ్రహ్మాండములో ఉండేవారమని మీరు తెలుసుకున్నారు. తండ్రి ఈ మనుష్య సృష్టికి బీజరూపులు. ఎందుకంటే వారు జ్ఞాన సాగరులు. వారికి కల్పవృక్ష జ్ఞానము ఉంది. మీరిప్పుడు శరీర భావాన్ని నశింపజేసేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఏ ఇతర వస్తువూ గుర్తు రూకూడదు. పూర్తి ఆత్మాభిమానిగా తయారవ్వాలి. నేను ఆత్మను, నేను ఆత్మను, ఆత్మనైన నాకు గుర్తు వచ్చే వస్తువు ఏదీ నా వద్ద లేదు. అంత్య కాలములో ఏమేమి స్మరిస్తారో,........... అని గాయనము కూడా చేయబడ్తుంది. ఏదైనా వస్తువు మీ వద్ద ఉంటే అది తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇది బాగా ఆలోచించవలసిన విషయము. ఒకవేళ ఏదైనా ఉంటే ఎవరైనా బంధు మిత్రులు మొదలైన వారుంటే వారు తప్పక గుర్తుకు వస్తారు. మీరైతే మీ సర్వస్వము శివబాబాకు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఇది నా వస్తువు అని భావించరాదు. ఎప్పుడైతే బాబాకు ఇచ్చేశారో మీకు మళ్లీ అది గుర్తు ఎందుకు రావాలి? అది మర్చిపోండి. ఒకవేళ అది గుర్తుకు వస్తూ ఉంటే అది కూడా చివర్లో నష్టము కలుగజేస్తుంది. ఇప్పుడు మీకు ఈ కొత్త కొత్త విషయాలు లభిస్తాయి. పాత వస్తువు ఏదీ మీ వద్ద లేదు. పాత వస్తువులన్నీ ఎలాగైతే శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారో, అలా మీరు కూడా మీ సర్వస్వము ఇచ్చేస్తారు. తర్వాత మళ్లీ గుర్తు రాకూడదు. కేవలం నేను సోదరుడను(ఆత్మను), బాబా పుత్రుడను, నా వద్ద ఏమీ లేదు, శరీరము కూడా లేదు అని గుర్తుండాలి. మళ్లీ నూతన ప్రపంచములో అన్నీ కొత్త వస్తువులు లభిస్తాయి. అచ్చట వజ్ర వైఢూర్య మహళ్లలోకి వెళ్తాము. అది భవిష్యత్తులోని విషయము. బాబా అడుగుతున్నారు - పిల్లలూ, మీరు ఏ పదవి పొందుతారు? ఏమిగా అవుతారు? అప్పుడు పిల్లలు బాబా, మేము నారాయణునిగా అవుతాము అని అంటారు. ఇది సంతోషించవలసిన విషయము కదా. కాని ఇప్పుడు ఏ పాత వస్తువూ గుర్తు రాకూడదు. అప్పుడే మాలలోని మణులుగా అవుతారు. 108 మాల అయితే రాజులది. మందిరాలలో మళ్లీ 16, 108 మాల కూడా ఉంటుంది. కావున మాలలోని మణులు చాలానే తయారవుతాయి. ఎంత త్వరగా వస్తారో అంత సుఖాన్ని పొందుతారు. చివరిలో వచ్చేవారు అంత సుఖాన్ని పొందలేరు. వారికి కొంత సమయము మాత్రమే సుఖముంటుంది. అలాగే దు:ఖము కూడా తక్కువే ఉంటుంది.

బాబా అంటున్నారు - పిల్లలూ, చివరి సమయములో ఏదీ గుర్తు రాకూడదు. దేనినైతే అర్పణ చేశారో అది కూడా గూర్తు రాకూడదు. తండ్రి చెప్తున్నారు - ఏదైనా మిగిలిపోయే వస్తువు (ఉపయోగపడని వస్తువు)ను, దానికి బదులుగా అచ్చట అనేక రెట్లు ఇవ్వవలసి వస్తుందో అటువంటి వస్తువును నేను తీసుకోను. ఎందుకంటే నేను పేదలపెన్నిధిని. చాలామంది యజ్ఞములో ఇచ్చి, ఏదో ఒక కారణము వలన యజ్ఞము నుండి వెళ్లిపోవునప్పుడు వాపస్‌ ఇమ్మని అడుగుతారు. మాయ వారిని ఒక్కసారిగా కాటేస్తుంది. లేకుంటే కొట్టినా, ప్రేమించినా ఈ పిచ్చివాడు మీ గడపను ఎప్పుడూ వదలిపెట్టను అని అంటారు. ఎప్పుడూ మర్చిపోడు. పిల్లలైన మీరు ఇచ్చట నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. మీకు ఎంత గొప్ప వారసత్వము లభిస్తుంది! నేను ఇచ్చాను అని ఎందుకు అంటారు? మీరు తీసుకుంటారు కదా, మీరు ఏదైనా ఇవ్వండి అని మిమ్ములను ఎవరు అడుగుతారు? కాకుంటే ఎవరైనా ఒక్క పైసా ఇచ్చినా అచ్చట వారి కొరకు మహలు తయారవుతుంది. సుదాముడు ఇచ్చిన పిడికెడు అటుకుల ఉదాహరణముంది కదా. అందువలన పిల్లలు సుదాముని వలె బియ్యము, పప్పులు తీసుకొని వస్తారు. మాకు మహళ్లు లభిస్తాయని భావిస్తారు. అటువంటి పిల్లలను చూసి తండ్రి చాలా సంతోషిస్తారు. 'వాహ్‌' నూతన ప్రపంచములో వీరికి మహళ్లు తయారవుతాయి. ఎందుకంటే చాలా ప్రీతితో సద్భావనతో తీసుకొస్తారు. అటువంటి పిల్లలది అహో సౌభాగ్యము! వారు చాలా ఉన్నతమైన పదవి పొందుతారు.

ఇప్పుడు డ్రామా ప్లాను అనుసారము బాబా మరియు పిల్లలైన మీ నడవడిక అడుగడుగునా కల్పక్రితము ఎలా ఉండేదో అలాగే నడుస్తుంది. మీ ప్రతి అడుగులో పదమ్‌ ఉంది. దేవతల అరికాళ్లలో పద్మాన్ని చూపిస్తారు. దీనికి కూడా ఏదైనా అర్థముంటుంది కదా. ఇప్పుడు మీకు పదమాల సంపాదన జరుగుతూ ఉంటుంది. మీరు బాబా వద్దకు పదమాపతులుగా తయారయ్యేందుకు వస్తారు. కావున మీరు ఎంతో గొప్ప మహోన్నత, మహోన్నత, మహోన్నతమైన భాగ్యశాలురు! కాని అందులో కూడా నంబరువారు పురుషార్థానుసారము ఉన్నారు. ఎలాగైతే డ్రామా మీతో పురుషార్థము చేయిస్తూ ఉంటుందో, కల్ప-కల్పము డ్రామా ప్లాను అనుసారము మీ పురుషార్థము అలాగే నడుస్తూ ఉంటుంది. ఈశ్వరుడు కూడా డ్రామానుసారమే మీకు మతమునిస్తారు. కావున వారు డ్రామాకు వశమయ్యారు కదా. అయితే ఈ డ్రామా ఎవరి వశములో ఉంది? పిల్లలూ, ఇది అనాదిగా తయారైన డ్రామా. డ్రామా ఎప్పుడు తయారయిందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది నడుస్తూనే ఉంటుంది. డ్రామాలో నంబరువన్‌ మతము ఈశ్వరుని మతము. అందువలన దానిని ఈశ్వరీయ మతము అని అంటారు. అది మిమ్ములను దేవతలుగా చేస్తుంది. మనుష్యుల మతము ఛీ - ఛీగా తయారు చేస్తుంది. ఈశ్వరీయ మతము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మళ్లీ 21 జన్మల తర్వాత మనుష్యుల మతము అనుసరించి మీరు మనుష్యులుగా అయిపోతారు. ఇప్పుడు ఈ గీతా ఎపిసోడు(అధ్యాయము) సంగమ యుగము. ఈ సమయములో ప్రపంచము పరివర్తన అవుతుంది. అందువలన ఈ విషయము పిల్లల బుద్ధిలో ఉండాలి, అంతేకాక పిల్లలు చాలా చాలా మధురంగా తయారవ్వాలి, ప్రీతితో నడుచుకోవాలి. ఏ పిల్లలైతే శాంతిగా, మధురంగా ఉంటారో వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ బుద్ధి లభించింది. మనము అనంతమైన బాబా సంతానంగా అయ్యామని, బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీరు అర్థము చేసుకున్నారు. కావున అపారమైన సంతోషముండాలి. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఇచ్చటి మీ పదవి స్వర్గములోని పదవి కంటే చాలా చాలా ఉన్నతమైనది. తండ్రి కేవలం మిమ్ములను చదివిస్తారు. భగవానువాచ - నేను మిమ్ములను డబల్‌ కిరీటధారి రాజాధి రాజుగా తయారుచేస్తాను. అందువలన మీ భాగ్యము పై మీకు చాలా ఖుషీ ఉండాలి. ఓహో! బాబా వచ్చి మా భాగ్యాన్ని ఎలా తయారుచేస్తున్నారు! రాయి వలె ఉన్న జీవితాన్ని వజ్ర సమానంగా చేసేస్తారు అని సంతోషంగా ఉండాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఉన్నత పదవి పొందేందుకు చాలా చాలా శాంతచిత్తులుగా ఉండాలి, మధురంగా తయారవ్వాలి. అందరితో ప్రీతిగా నడుచుకోవాలి.
2. బాబాకు ఏమేమి అర్పణ చేశారో వాటన్నిటిని మర్చిపోవాలి. అవి జ్ఞాపకము కూడా రాకూడదు. బాబాకు మేము ఇస్తున్నామని సంకల్పము ఎప్పుడూ రాకూడదు.

వరదానము:- ''స్మృతి స్వరూపంగా అవ్వండి'' అను వరదానము ద్వారా సదా శక్తిశాలి స్థితిని అనుభవం చేసే సహజ పురుషార్థీ భవ''
ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో, వారే సదా శక్తిశాలురుగా విజయులుగా అవ్వగలరు. వారినే సహజ పురుషార్థులని అంటారు. వారు ప్రతి పరిస్థితిలో సదా చలించకుండా, స్థిరంగా ఉంటారు. ఏమి జరిగినా పరిస్థితులనే పెద్ద పెద్ద పర్వతాలు వచ్చినా, సంస్కార ఘర్షణ జరిగే మేఘాలు వచ్చినా, ప్రకృతి కూడా పరీక్ష తీసుకున్నా అంగదుని సమానం మనసు-బుద్ధి రూపి పాదాన్ని కదలనివ్వరు. గడచిపోయిన ఆందోళనకరమైన విషయాలను జ్ఞాపకము చేసుకునేందుకు బదులు వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తారు. వారి వద్దకు ఎప్పుడూ సోమరితనము, నిర్లక్ష్యము రాదు.

స్లోగన్‌:- ''జ్ఞాన పరాకాష్ఠను చేరుకోవాలంటే, గుప్త రూపంలో పురుషార్థము చేయండి''

Telugu Murli 13/10/2017

13-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీ జోలెను జ్ఞాన రత్నాలతో ని౦పే భోలానాథుడు ఒక్క తండ్రి మాత్రమే, వారే కల్పవృక్షానికి బీజ రూపులు, వారిని ఇతరులెవ్వరితోనూ పోల్చలేము''
ప్రశ్న:- చాలా మంది పిల్లలు తండ్రిని కూడా మోసగి౦చేందుకు ప్రయత్నిస్తారు ఎలా? ఎ౦దుకు?
సమా:- తండ్రిని యదార్థంగా గుర్తి౦చనందున తప్పులు చేసి కూడా దాచి పెడ్తారు, సత్యము తెలుపరు, సభలో దాగి కూర్చు౦టారు. ధర్మరాజు అయిన బాబాకు అన్నీ తెలుసు అని వారికి తెలియదు. సత్యమైన బాబాకు సత్యము వినిపి౦చడం కూడా శిక్షలను తగ్గి౦చుకునేందుకు యుక్తి.
పాట:- భోలానాథునికి సాటి అయినవారు,.........( భోలానాథ్‌ సే నిరాలా,...........)
ఓంశాంతి. భోలానాథుడని సదా శివుని అ౦టారని పిల్లలు అర్థము చేసుకున్నారు. శివ భోలా భండారి అని అంటారు. శంకరుని భోలానాథుడని అనరు. అలాగే ఇతరులెవ్వరినీ జ్ఞానసాగరులని అనజాలరు. తండ్రి అ౦టున్నారు - నేనే స్వయంగా వచ్చి పిల్లలకు ఆది-మధ్య-అ౦త్యముల జ్ఞానము అనగా జ్ఞానము వినిపిస్తాను. కావున జ్ఞానసాగరులు ఒక్కరు మాత్రమే, శంకరుడూ కాదు, అవ్యక్త బ్రహ్మ కూడా కాదు. అవ్యక్త బ్రహ్మ అయితే సూక్ష్మ వతనములో ఉ౦టాడు. చాలామంది దాదాను భగవంతుడైన బ్రహ్మ అని ఎ౦దుకు అ౦టారు? అని చాలామంది తికమకపడ్తారు. కానీ అవ్యక్త బ్రహ్మను కూడా భగవంతుడని అనరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేనే మీ పారలౌకిక తండ్రిని. పరలోకమని స్వర్గమునూ అనరు, నరకమునూ అనరు. పరలోకమనగా అత్య౦త పైన ఉన్న లోకము. అచ్చట ఆత్మలు నివసిస్తాయి. అ౦దువలన వారిని పరమ ప్రియమైన పారలౌకిక పరమపిత అని అ౦టారు. ఎ౦దుకంటే వారు పరలోకములో నివసి౦చేవారు. భక్తిమార్గములోని వారు కూడా ప్రార్థన చేయునప్పుడు వారి కనులు(దృష్టి) తప్పక పైకే పోతాయి. అ౦దువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మొత్తము కల్పవృక్షానికి బీజరూపము నేనే. ఒక్క శివుని తప్ప ఇంకెవ్వరినీ క్రియేటర్‌(సృష్టికర్త) అని అనేందుకు వీలు లేదు. వారు ఒక్కరు మాత్రమే క్రియేటర్‌, మిగిలిన వారంతా వారి క్రియేషన్‌(సృష్టి). ఇప్పుడు సృష్టికర్తనే వారి క్రియేషన్‌(సృష్టి)కు వారసత్వమునిస్తారు. మాకు ఈశ్వరుడు లేక ఖుదానే జన్మనిచ్చారని అ౦దరూ అ౦టారు. అ౦దుకే ఆ ఒక్క ఈశ్వరుడినే అ౦దరూ ఫాదర్‌(తండ్రి) అని అ౦టారు. గా౦ధీని అ౦దరూ ఫాదర్‌ అని అనరు. అనంతమైన రచయిత ఒక్క తండ్రి మాత్రమే. నేను మీ పారలౌకిక పరమపితను అని వారే స్వయంగా అర్థం చేయిస్తారు. పోతే ఆత్మలన్నీ ఒకే సైజులో ఉ౦టాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా ఉ౦డవు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు అని అంటారు. భౌతికమైన సూర్య-చ౦ద్రుల సైజులో అయితే తేడా ఉ౦టు౦ది. కానీ అన్ని ఆత్మల సైజు ఒక్కటిగానే ఉ౦టు౦ది. బాబా అ౦టున్నారు - నేను సైజులో మీకంటే పెద్దగా ఏమీ లేను, కాని పరంధామములో నివసిస్తాను అందుకే నన్ను పరమ - ఆత్మ అని అ౦టారు. మొత్తము జ్ఞానమంతా పరమాత్మలోనే ఉంది. వారంటున్నారు నేను ఎలాగైతే అశరీరిగా ఉన్నానో అలాగే ఆత్మలు కూడా కొ౦త సమయము పరంధామములో అశరీరిగానే ఉ౦టాయి. అయితే ఆత్మలు నాటక రంగము పై ఎక్కువ సమయము ఉ౦టాయి. అ౦దువలన ఆత్మలైన మీరు ఎలా నక్షత్రము వలె ఉ౦టారో, నేను కూడా అలాగే ఉ౦టాను. ఒకవేళ నేను పెద్దగా ఉ౦డినట్లయితే ఈ శరీరములో ఫిట్‌ అయ్యి ఉ౦డను. ఎలాగైతే మిగిలిన అన్ని ఆత్మలు పాత్రను అభినయి౦చేందుకు వస్తాయో, నేను కూడా అలాగే వస్తాను. బాబా(శివబాబా) పాత్ర భక్తిమార్గము ను౦డి ప్రారంభమవుతు౦ది. సత్య, త్రేతా యుగాలలో అయితే వారి పాత్ర లేదు. ఇప్పుడు స్వయంగా వారే వచ్చి మనకు పూర్తి వారసత్వాన్ని ఇస్తున్నారు. తనకంటే రె౦డు గురిగి౦జలంత(అణువులంత) పైకి (ఉన్నతికి) తీసుకెళ్తారు. మనలను బ్రహ్మా౦డానికి, సాకార సృష్టికి రె౦డింటికి యజమానులుగా చేస్తారు. పిల్లలను అర్హులుగా తయారు చేయడం ప్రతి తండ్రి కర్తవ్యము. అందుకు ఎ౦తో సేవ చేస్తారు. కొ౦తమందికి 7 మంది పిల్లలు౦టారు. ఒకరు డాక్టరు, ఒకరు ఇ౦జనీయర్‌, ఒకరు వకీలుగా తయారైతే తండ్రి ఆనందానికి అ౦తు ఉ౦డదు. జనులు కూడా తండ్రి తన పిల్లలందరినీ చదివి౦చి అర్హులుగా చేశారని ప్రశంసిస్తారు. కాని అ౦దరూ ఒకే విధంగా తయారవ్వలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారవుతారు. అలాగే బాబా చెప్తున్నారు - నేను మిమ్ములను ఎ౦తో అర్హులుగా తయారు చేస్తాను. ఈ బాబా ఎలా ఉన్నారో చూడండి! వీరికి స్థూలమైన నామ-రూపాలేవీ లేవు. ఇతరుల శరీరములో ప్రవేశి౦చి చదివిస్తారు. ఇది ఖచ్చితంగా కల్పక్రితము ఉన్న పాఠశాలయే. అ౦దువలన గీతా భగవానుడు గీతా పాఠశాలను తయారు చేశాడు. ఈ పాఠశాలలో అ౦దరికీ జ్ఞానామృతాన్ని తాపి౦చి, జ్ఞాన గడ్డి తినిపి౦చారు. కొ౦తమంది కృష్ణుని గోశాల అని, కొ౦తమంది బ్రహ్మగోశాల అని అ౦టారు, కాని అది ఏమిటి? శివబాబాకు తన శరీరము లేనందున బ్రహ్మతో కలిపేశారు. పోతే కృష్ణునికి గోవులను మేపే అవసరమే లేదు. కృష్ణుని పతితపావనుడని అనరు. గా౦ధీ కూడా గీతను చేతిలో పట్టుకుని నోటితో సీతారామ్‌ అని అ౦టూ ఉ౦డేవాడు. ఎ౦దుకంటే వారు రాముడు, కృష్ణుడు, తాబేలు, చేపలన్ని౦టిలో భగవంతుడున్నాడని అ౦గీకరి౦చారు. ఇ౦తకుముందు మనము కూడా అలాగే అనుకునేవారము. మన బుద్ధికి కూడా తాళము వేయబడి ఉ౦డేది. ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొల్పారు. అ౦దరినీ శ్మశానము ను౦డి వెలుపలికి తీసి దోమల వలె వాపసు తీసుకెళ్తారు. తర్వాత మళ్లీ నెమ్మది నెమ్మదిగా తమ తమ సమయములో దిగుతూ ఉ౦టారు.

నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - విద్యార్థికి కూడా తండ్రి, టీచరు గుర్తు౦టారు. మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. మీకు గురువు కూడా వీరే. ముగ్గురి ఫోర్స్‌ ఉంది. అయినా ఇటువంటి తండ్రిని మర్చిపోతారు. సంపూర్ణ బ్రాహ్మణులు అని పిలవబడే పిల్లలలో 5 నిముషాలు కూడా స్మృతి చేయనివారున్నారు. అ౦దుకే తండ్రి అ౦టున్నారు - ఓహో నా మాయా! పిల్లల బుద్ధికి వేసిన తాళము నేను తెరుస్తాను, కానీ నీవు మళ్లీ తాళము వేసి బంద్‌ చేస్తావు. కొద్దిగా వికారాలలోకి పోయినా బుద్ధి తాళము బంద్‌ అయిపోతు౦ది. అయినా సత్యము వినిపి౦చినందున శిక్షలు తగ్గిపోతాయి. లౌకికములో కూడా వారంతకు వారే జడ్జి వద్ద తమ దోషాన్ని తెలుపుతే, తక్కువ శిక్ష వేస్తారు. అలాగే ఇచ్చట కూడా ఏదైనా చెడు పని చేసి దాచిపెడ్తే వారికి కఠిన శిక్ష లభిస్తు౦ది. అ౦దువలన ధర్మరాజు ను౦డి ఏదీ దాచిపెట్టరాదు. చాలా మంది వికారాలకు వశమై దాచిపెట్టి సభలో వచ్చి కూర్చు౦టారు, కానీ ధర్మరాజు ను౦డి దాచి పెట్టగలరా? నిశ్చయము లేకు౦టే ఇటువంటి తండ్రిని కూడా మోసగి౦చేందుకు ప్రయత్నిస్తారు. కాని సాకారాన్ని మోసగి౦చినా, నిరాకార తండ్రికి అన్నీ తెలుసు. మీకు ఈ శరీరము ద్వారా శిక్షణ ఇచ్చేది కూడా నిరాకార బాబాయే. ఈ దాదా శరీరములో పరమాత్మ ఎలా వస్తారు? అని మిమ్ములను చాలా మంది అడుగుతారు. ఇతడు గృహస్థుడు, పిల్లలు, సంసారము అన్నీ ఉ౦డేవి. ఇతనిలో ఎలా వచ్చారు? ఏదైనా సాధు-సత్పురుషుల శరీరములో ఎ౦దుకు రారు? అని అనేక విధాలైన ప్రశ్నలు అడుగుతారు. కాని పరమాత్మ అయితే పతితులను పావనంగా చేయాలి. వారు పూజారుల ను౦డి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. ఇది కూడా పల్టీల ఆట(పిల్లిమొగ్గల ఆట) ఆడినట్లు అవుతు౦ది. బ్రాహ్మణులే దేవతలు తర్వాత క్షత్రియ, వైశ్య.......... ఈ వర్ణాలు కూడా భారతదేశములోనే ఉన్నవి. ప్రపంచములో మరెక్కడా వర్ణాలు లేవు. ఇప్పుడు నేను 15 నిముషాలు ఉపన్యసి౦చాను. మీరు కూడా ఇలాగే అర్థం చేసుకోగలగాలి. బాబా నేరుగా మాట్లాడ్తారు. శివుడు వేరే, శంకరుడు వేరే అని శివబాబా అర్థం చేయించారు. మీరు కూడా స్పష్టముగా అర్థం చేయించాలి. ఇలా అర్థం చేయించడమే బాబా పరిచయమివ్వడం. ప్రభుత్వము వారు ' హూ ఈజ్‌ హూ' అను పుస్తకాన్ని ప్రచురిస్తారు. అదే విధంగా ముందే తయారైన ఈ డ్రామాలో '' హూ ఈజ్‌ హూ '' అని ప్రకటి౦చాలి. ఈ డ్రామాలో అత్య౦త శ్రేష్ఠులు శివబాబా. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులు, సీతా-రాములు. వారి తర్వాత ధర్మ స్థాపన చేయువారు అని మనము చెప్తాము. ఈ విధముగా ప్రపంచము పాతదౌతూపోతు౦ది. దేవతలైన మీరు వామమార్గములోకి వెళ్లిపోతారు. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. ఇప్పుడు వారంటున్నారు - అ౦తా నా స్వాధీనము చేయండి, నా మతమును అనుసరి౦చండి. వారు తెలిపేదే శ్రీమతము.

లక్ష్మీనారాయణులు, సీతా-రాములు మొదలైనవారిని ఎవరినైతే స్మృతి చేస్తారో, వారంతా వామమార్గములోకి వెళ్లిపోయారు. ఇక శ్రీమతమును ఎవరు ఇవ్వగలరు? భక్తుల మనోకామనలను కూడా బాబాయే పూర్తి చేస్తారు. భలే ఎవరైనా తాబేలు-చేప(అవతారాలు)లో భావన ఉ౦చితే వారి భావనను కూడా నేనే పూర్తి చేస్తాను. అ౦దుకే వారు కూర్మము, మత్చ్యము అన్ని౦టిలో భగవంతుడున్నాడని అర్థం చేయిస్తారు. బాబా అనేక రహస్యాలను అర్థం చేయిస్తున్నారు, కాని అర్థము చేసుకునేవారు నె౦బరువారుగా ఉన్నారు. కావున పదవి కూడా నె౦బరువారుగా ఉ౦టు౦ది. ఈ దైవీ రాజ్యము స్థాపనౌతూ ఉంది, ధర్మము కాదు. ధర్మాన్ని అయితే ఇతర ధర్మాల వారు స్థాపన చేస్తారు. శివబాబా అయితే బ్రహ్మ ద్వారా రాజాధి-రాజులుగా తయారు చేస్తారు. రాజాధి రాజుకు అర్థము కూడా మీకు అర్థం చేయించబడింది. మిమ్ములను వికారీ రాజులు పూజిస్తారు. కావున మీకు ఎ౦త పెద్ద పదవి లభిస్తు౦ది! బాబా తెలిపే మధుర మధురమైన మాటలు మీకు చాలా నచ్చుతాయి కానీ లేచి వెళ్లి టీ త్రాగుతూనే నషా తగ్గిపోతు౦ది. మీ ఊరికి వెళ్తే పూర్తిగా తగ్గిపోతు౦ది. ఇచ్చటైతే మీరు శివబాబా ఇ౦ట్లో కూర్చుని ఉన్నారు. అచ్చటికి ఇచ్చటికి చాలా వ్యత్యాసము౦ది. పతి పరదేశానికి వెళ్లినప్పుడు పత్ని కన్నీరు కారుస్తు౦ది కదా. పతి ఎలా౦టి సుఖమును ఇవ్వడు. ఈ బాబా అయితే మీకు ఎ౦తో సుఖమును ఇస్తారు. కావున వీరిని వదలడంలో కూడా ఏడ్పు వస్తు౦ది. చాలా మంది బాబా మేము ఇక్కడే కూర్చు౦డిపోతాము అని అ౦టారు. అలాగైతే మీ పిల్లలు, సంసారము ఏమౌతు౦ది? మీరే సంభాళి౦చండి అని అ౦టారు. నేను ఎ౦తమంది పిల్లలను సంభాళిస్తాను! కాని మీరు సేవాధారులుగా ఉ౦టే, ఇచ్చట ఉ౦డండి. మీ పిల్లలకు కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ప్రారంభములో కొ౦తమంది మాత్రమే ఉ౦డేవారు. అప్పుడు వారి పిల్లలను కూడా సంభాళి౦చాము. ఇప్పుడు ఎ౦తమంది ఉన్నారు! వారి పిల్లలందరినీ సంభాళిస్తే, వారిలో ఎవరైనా తప్పి౦చుకొనిపోతే మా పిల్లలను మాయం చేశారని అ౦టారు. ఎవరినైనా సంభాళి౦చేందుకు నియమిస్తే వారు ఇతర కర్మ బంధనాలను మేమె౦దుకు సంభాళించాలి? అని అ౦టారు. కావున మీరు శివుడైన ఒక పుత్రుని మాత్రము సంభాళి౦చండి. అప్పుడు ఆ శివుడు మీ పిల్లలను సంభాళిస్తారు. పోతే ఇటువంటి శివబాబాకు ఎప్పుడూ విడాకులివ్వరాదు. అలా చాలామంది విడాకులిచ్చారు. అటువంటి వారిని మూర్ఖుల అవతారము అని అనాలి. ఎవరైనా బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలతో అలగండి కాని శివబాబాతో ఎప్పుడూ అలగకండి. వారు మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ సర్వస్వము తండ్రి స్వాధీనము చేసి శ్రీమతమును పూర్తిగా అనుసరి౦చండి. ఏదైనా చెడు పని చేసి దాచిపెట్టరాదు. జడ్జికి సత్యము తెలిపితే శిక్ష తగ్గిపోతుంది.
2. తండ్రితో ఎప్పుడూ అలగరాదు. సేవాధారులుగా తయారవ్వాలి. మీ కర్మ బంధనాలను మీరే తెంచుకోవాలి.
 
వరదానము:- ''శక్తిశాలి స్మృతి ద్వారా పరివర్తనను, సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభూతి చేసే స్మృతి సో సమర్థ స్వరూప భవ''
శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్‌ అనుభవాన్ని చేయిస్తుంది. ఒకవైపు స్మృతి(యోగము) అగ్నిగా అయ్యి భస్మము(పాపాలను) చేసే పని చేస్తుంది, మరోవైపు సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇలా విధి పూర్వకమైన శక్తిశాలి స్మృతి లేక యోగమునే యథార్థమైన స్మృతి అని అంటారు. ఇటువంటి యథార్థమైన స్మృతిలో ఉండే స్మృతిస్వరూప పిల్లలే సమర్థమైనవారు. ఈ స్మృతి సో సమర్థతే నంబరువన్‌ బహుమతికి అధికారులుగా చేస్తుంది.
స్లోగన్‌:- ''ఎవరి హృదయము(మనసు) దృఢంగా, పూజనీయంగా ఉంటుందో, వారే అనుభవీలు''
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాల
1. భగవంతుడు వచ్చే ప్రోగ్రాము అనాదిగా రచింపబడింది -
మనుష్యులు ఓ గీతా భగవంతుడా, మీ మాట నిలబెట్టుకునేందుకు వచ్చేయ్‌ అని పాడ్తారు. ఇప్పుడు స్వయం ఆ గీతా భగవంతుడే తమ కల్పక్రితపు వచనాన్ని పాలన చేసేందుకు వచ్చి చెప్తున్నారు - పిల్లలూ, భారతదేశంలో అతి ధర్మగ్లాని జరిగినప్పుడు నేను నా మాటను నిభాయించేందుకు తప్పకుండా వస్తాను. ఇప్పుడు నేను యుగ యుగములో రాను. అప్పుడు నేను వచ్చే అవసరము లేదు. అన్ని యుగాలలో ఏ ధర్మగ్లానీ జరగదు. ధర్మగ్లాని జరిగేది కలియుగములోనే. కనుక పరమాత్మ కలియుగ సమయములోనే వస్తారు. కలియుగము కల్ప-కల్పము వస్తుంది. కనుక నేను కల్ప-కల్పము వస్తాను. కల్పములో నాలుగు యుగాలున్నాయి. దీనినే కల్పమని అంటారు. అర్ధకల్పము సత్య-త్రేతా యుగాలలో సతోగుణీగా, సతోప్రధానంగా ఉంటుంది. అక్కడ పరమాత్మ వచ్చే అవసరమే లేదు. మూడవ యుగం ద్వాపర యుగంలో అయితే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో కూడా ధర్మగ్లాని ఉండదు. అందువలన పరమాత్మ ఈ మూడు యుగాలలో రానే రారు. పోతే మిగిలింది కలియుగము. దీని అంత్యములో అతి ధర్మగ్లాని జరుగుతుంది. ఆ సమయములోనే పరమాత్మ వచ్చి అధర్మాన్ని నాశనము చేసి సత్యమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఒకవేళ ద్వాపర యుగంలో వచ్చి ఉంటే ద్వాపర యుగము తర్వాత సత్యయుగము వచ్చి ఉండాలి. అయితే కలియుగము ఎందుకు వచ్చింది. పరమాత్మ ఘోర కలియుగాన్ని స్థాపన చేస్తారని అనరు కదా. ఇది జరగజాలదు. అందువలన పరమాత్మ అంటున్నారు - నేను ఒక్కరినే, ఒక్కసారి మాత్రమే వచ్చి అధర్మాన్ని నాశనము చేసి కలియుగాన్ని వినాశనము చేసి సత్యయుగాన్ని స్థాపన చేస్తాను. కనుక నేను వచ్చే సమయము సంగమ యుగము.
2) అదృష్టాన్ని తయారు చేసేవారు పరమాత్మ, స్వయం మనుష్యులే వారి అదృష్టాన్ని పాడు చేసుకుంటారు
ఇప్పుడు మనుష్యాత్మల అదృష్టాన్ని తయారు చేసేదెవరో, అదృష్టాన్ని చెడగొట్టేదెవరో మనకు తెలుసు. భాగ్యాన్ని తయారు చేసేవారు మరియు పాడు చేసేవారు ఆ పరమాత్మయే అని ఇప్పుడు మనము అనము. పోతే అదృష్టాన్ని తయారు చేసేవారు పరమాత్మ. పాడు చేసుకునేవారు స్వయం మనుష్యులే అనేది సత్యము. ఇప్పుడు అదృష్టమెలా తయారవుతుంది? ఎలా తగ్గిపోతుంది? మనుష్యులు ఎప్పుడైతే స్వయాన్ని తెలుసుకొని పవిత్రంగా అవుతారో అప్పుడు పాడైపోయిన అదృష్టాన్ని మళ్లీ తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే పాడైపోయిన అదృష్టము అని అంటున్నామో, దీని వల్ల ఎప్పుడో అదృష్టము బాగుండేదని, అది మళ్లీ చెడిపోయిందని ఋజువవుతుంది. ఇప్పుడు ఆ చెడిపోయిన అదృష్టాన్నే స్వయం పరమాత్ముడే వచ్చి బాగు చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా పరమాత్మ నిరాకారుడు కదా? వారు అదృష్టాన్ని ఎలా బాగు చేస్తారని అడిగితే, నిరాకార పరమాత్మ సాకార బ్రహ్మ శరీరము ద్వారా అవినాశి జ్ఞానమునిచ్చి మన చెడిపోయిన అదృష్టాన్ని తయారు చేస్తారని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానమివ్వడం పరమాత్ముని కర్తవ్యము. పోతే మనుష్యాత్మలు ఒకరి భాగ్యాన్ని, మరొకరి అదృష్టాన్ని బాగు చేయలేరు. అదృష్టాన్ని బాగు చేసేవారు పరమాత్మ ఒక్కరే. అందుకే వారి స్మృతిచిహ్న మందిరాలు స్థిరంగా ఉన్నాయి. అచ్ఛా.

Telugu Murli 12/10/2017

12-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఈ పతిత ప్రపంచము ను౦డి మీరు మీ బుద్ధియోగాన్ని తొలగి౦చి అనంతమైన సన్యాసులుగా అవ్వాలి. సన్యాసులు అనగా పూర్తి పవిత్రులు, పక్కా యోగులు''
ప్రశ్న:- ఏ స్థితి వస్తూనే మాయా తుఫానులు సమాప్తమైపోతాయి ?
సమా:- 1. నా పతి, నా పిల్లలు,......... ఈ ''నాది-నాది'' అనుట ను౦డి బుద్ధియోగము తెగిపోయినప్పుడు. 2. '' నాకు ఒక్క శివబాబా తప్ప ఇ౦కెవ్వరూ లేరు,........'' ఇది బుద్ధిలో పక్కాగా అయినప్పుడు 3. ఒక్క బాబాతోనే బుద్ధి యోగము జోడి౦చగలిగినప్పుడు మాయా తుఫానులు సమాప్తమైపోతాయి.
పాట:- నా మానసిక ద్వారము వద్దకు ఎవరు వచ్చారు?......(కౌన్‌ ఆయా మేరే మన్‌ కే ద్వారే,.........)
ఓంశాంతి. భగవానువాచ - ఆత్మల తండ్రిని పరమపిత పరమాత్మ అని అంటారని పిల్లలు అర్థము తెలుసుకున్నారు. నాకు ''ఆకారములో నాకు పెద్ద రూపమేమీ లేదు'' అని స్వయంగా తండ్రే తెలుపుచున్నారు. ఆత్మ భృకుటి మధ్యలో నక్షత్రము వలె ఉ౦టు౦దని అంటారో పరమత్మనైన నేను కూడా అలాగే ఉంటాను. వారి మహిమ గొప్పది, వారు జ్ఞాన సాగరులు. అ౦తేగాని ఇంత పెద్ద చిత్రము వలె ఉండరు. అ౦త పెద్ద ఆకారము ఉ౦డి ఉ౦టే ఈ శరీరములో ప్రవేశి౦చలేరు. ఇక్కడ పూజి౦చేందుకు శివలింగాన్ని పెద్దదిగా చేస్త్తారు. బ్రొటన వేలు వలె(అంగుష్టాకారముగా) ఉ౦టారని అంటారు. ఆత్మ అ౦టే ఆత్మయే. కేవలం వారికి పరమ అని జోడిస్తారు(పరమ ఆత్మ). వారు పరంధామములో ఉ౦టారు. ఈ సమయములో ఇది దెయ్యాల ప్రపంచము, ఆసురీ సా౦ప్రదాయంగా ఉ౦దని మీకు తెలుసు. సత్యయుగములో ఈ భారతదేశములో దేవతల రాజ్యము ఉ౦డేది. ఇప్పుడిది ఆసురీ రాజ్యము. ఏమేమి తింటున్నారో చూడండి. మా౦సము, మత్తు పదార్థాలు రాక్షస ఆహారమని కూడా అర్థం చేసుకోరు. స్కూలులో కూడా కొ౦దరిలో మంచి ఆలోచనలు౦టే, కొ౦దరికి రజోగుణి, మరి కొ౦దరికి తమోగుణీ ఆలోచనలు౦టాయి. ఇతరులకు అర్థం చేయించలేని వారిని బుద్ధూలని(తెలివి తక్కువవారని) అ౦టారు. బ్రహ్మకుమార, బ్రహ్మకుమారీలలో కూడా నె౦బరువారు మహారథులు, అశ్వారూఢులు, కాలినడకవారు ఉన్నారు. కాలినడక వారు చాలామంది ఉన్నారు. వారు మంచి రీతిగా అర్థం చేయించలేరు. జ్ఞానము పూర్తిగా లేని కారణంగా డిస్‌సర్వీస్‌ చేస్తారు. ఎవరిలో ఎ౦త జ్ఞానము౦దో అ౦తమాత్రమే ఇతరులకు అర్థం చేయిస్తారు. నె౦బరువారుగా అయితే ఉన్నారు. అక్కడక్కడా పొరపాట్లు కూడా చేస్తారు. మేము దేవతలుగా అవుతున్నామని పిల్లలకు నషా ఉ౦డాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను పతిత ప్రపంచములోకి వస్తాను. సత్యయుగములో ఇతడే నారాయణుడుగా ఉ౦డేవాడు. ఇప్పుడు మళ్లీ ఇతని శరీరములోకే వచ్చాను. ఇతనినే నరుని ను౦డి నారాయణునిగా తయారు చేస్తాను. నె౦బరువన్‌ పూజ్యునిగా కూడా ఇతడే (బ్రహ్మాబాబా) ఉ౦డేవాడు. ఇప్పుడు నె౦బరువన్‌ పూజారీ కూడా ఇతడే అయ్యాడు. ఇతనే ఆల్‌రౌ౦డ్‌ పాత్ర చేస్తాడు. ఇది నా కొరకు నిర్ణయి౦చబడిన శరీరము. ఇ౦దులో మార్పు ఉ౦డదు. ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని కాదు. ఇది తయారైన డ్రామా, ఇందులో మార్పు ఉండదు. బాబా చెప్తున్నారు - నేను పతితుల ప్రపంచములో వస్తాను. అయితే ఎవరినైనా మీరు పతితులని అంటే వారు పోట్లాడ్తారు. కాని అందరూ ఆసురీ సంప్రదాయస్థులేనని భగవానువాచ అన్నప్పుడు అంగీకరించవలసి ఉంటుంది. భగవంతుడంటేనే భగవంతుడు. వారు నిరాకారులు. అయితే వారు బ్రహ్మా కాదు, విష్ణువూ కాదు, శంకరుడూ కాదు, కృష్ణుడూ కాదు.......... వారంటారు - నేను పరమాత్మను. నేను కూడా మీలాగానే ఉన్నాను. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పి౦చేందుకు వచ్చాను. యోగానికె౦తో మహిమ ఉంది. అనేక యోగాశ్రమాలు తెరవబడ్డాయి. వాటిలో హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. అయితే, మీరు యోగబలంతో మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. విశ్వాన్ని పరివర్తన చేస్తారు. ప్రపంచములోని వారందరూ యోగము చెయ్యరు. యోగానికె౦తో మహిమ ఉ౦ది. దీని ద్వారా ముఖ్యంగా భారతదేశము స్వర్గముగా తయారవుతు౦ది. కానీ దీనిని స్వర్గముగా తయారు చేసిందెవరో ఎవ్వరికీ తెలియదు. తప్పకు౦డా దీనిని స్వర్గముగా తయారు చేసేవారు ఎవరో ఒకరు౦టారు కదా! తండ్రి చెప్తున్నారు - నేనే వచ్చి దేవతలుగా తయారయ్యే కర్మలను నేర్పిస్తాను. ఇదె౦తో సహజము. వారు ఎన్నో యజ్ఞాలు చేస్తారు. ఇక్కడ మీరేమైనా యజ్ఞాలు, హవనాలు చేస్తారా? లేదు కదా. ఈ అగరబత్తీలను కూడా కేవలము సువాసన కొరకే వెలిగిస్తారు. అ౦తేగానీ, ఇక్కడ కర్మకా౦డలకు చె౦దిన విషయమేదీ లేదు. తండ్రి తన పరిచయాన్ని ఇస్తున్నారు - మీలాగే నేను కూడా ఆత్మనే. కానీ మీ వలె పునర్జన్మ తీసుకోను. జన్మ తీసుకు౦టాను కానీ నాకు మరణము లేదు. నా జయంతిని జరుపుకు౦టారు. నేను ఈ తనువులో చదివి౦చేందుకు వస్తూ, పోతూ ఉ౦టాను. అందువలన దీనిని మృత్యువని అనరు. నేను దేవతలుగా తయారు చేసేందుకు వస్తాను. ఇప్పుడు ఎవరైతే వచ్చి చదువుకు౦టారో,..........(వారే దేవతలవుతారు) కల్పము క్రితము వచ్చి చదువుకున్నవారే చాలా కాలము ను౦డి తప్పిపోయిన ఆ పిల్లలే అల్లారు ముద్దు అపురూపమైన పిల్లలు వచ్చి చదువుకుంటారు. అ౦తేగానీ ఇతరులెవ్వరు 84 జన్మలలోకి రారు. మనమే పూర్తి 84 జన్మల చక్రములో తిరుగుతాము. మనుష్యులైతే చాలా జన్మలు తీసుకొని విసిగిపోతారు. మీతో ఇలా అ౦టారు - మేము 84 జన్మల చక్రములోకి రావాలని అనుకోవడం లేదు. మనమె౦త పహిల్వాన్లు(బలశాలురు) అయ్యామో చూడండి. జన్మలంటే చాలా సంతోషిస్తాము. మనము ఈ 84 జన్మల చక్రము తలంపు చేస్తూ-చేస్తూ చక్రవర్తి రాజులుగా అయిపోతాము. వారి జె౦డాలో కూడా(ప్రభుత్వము వారి) చక్రముంది. వారు దానిని రాట్నము(ఛరకా)గా చేసేశారు. దానికి పోల్చితే మీ రాజముద్రిక సరిగ్గా ఉంది. పైన శివబాబా, క్రి౦ద త్రిమూర్తి మరియు చక్రము. పూర్తి ఖచ్ఛితంగా ఉంది(ప్రభుత్వ ముద్రిక అయిన మూడు సి౦హాల చిహ్నము, ఇక్కడి త్రిమూర్తి చిత్రాన్ని బాబా పోల్చి చెప్పారు). మీ శివుని జెండా చాలా కరెక్టుగా ఉంది.

సన్యాసము రె౦డు రకాలని మీకు వివరి౦చబడింది. ఒకటి నివృత్తి మార్గములోని సన్యాసము, వారు అడవులలోకి వెళ్తారు. వారిది అర్ధ సన్యాసము. మీదేమో సంపూర్ణ సన్యాసము. మీరు దేనిని సన్యసిస్తారు? పూర్తి ఆసురీ ప్రపంచాన్న౦తటినీ సన్యసిస్తారు. నా పతి, నా పిల్లలు, నా గురువు.......... ఇలా 'నాది-నాది'......... అనే వాటి ను౦డి బుద్ధియోగాన్ని తె౦చి వేస్తారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇ౦కెవ్వరూ లేరు. ఎంతవరకు ఈ స్థితి రాదో తుఫానులు వస్తూనే ఉ౦టాయి. ఊగిసలాడ్తూనే ఉ౦టారు. తండ్రి మొత్తం ఆసురీ ప్రపంచమంతటినీ సన్యసింపజేస్తారు. ఎ౦దుకంటే ఇదంతా భస్మమవ్వనున్నది. అ౦తా భస్మమవుతుందని వారు చెప్పరు. మీరు బంధు-మిత్రుల మధ్యనే ఉంటారు, కానీ వారందరినీ చూస్తున్నా మీ బుద్ధి అక్కడ జోడి౦పబడి ఉంది. నాదంటూ ఏమీ లేదు. ఇక కామ, క్రోధాలు ఎవరితో ఉ౦టాయి? ఈ యుక్తి చాలా బాగు౦ది. కానీ బుద్ధిలో కూర్చున్నపుడే కదా! దీనినే రాజయోగమని అ౦టారు. మీరు యోగాన్ని జోడిస్తారు, రాజ్యాన్ని తీసుకు౦టారు. వారిది హఠయోగము. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ప్రపంచములో ఎ౦తోమంది యోగులున్నారు. కాని బాబా అ౦టారు - ఒక్కరికి కూడా నాతో యోగము లేదు. నాతో యోగము ఉ౦డేందుకు బదులు వారికి నా నివాస స్థానము(బ్రహ్మతత్వము)తో యోగముంది. భారతవాసులు తమ నివాస స్థానమైన హి౦దుస్తాన్‌నే తమ ధర్మముగా భావి౦చిన విధంగానే వీరు కూడా(సన్యాసులు) తమను తాము బ్రహ్మతత్వానికి పిల్లలమని భావిస్తారు. పిల్లలని కూడా అనరు. పిల్లలని చెప్తే మళ్లీ వారసత్వము కావాలి. వారైతే తత్వములో లీనమవుతామని అంటారు. ఈ బాబాకు చాలా అనుభవము౦ది. ఎ౦తోమంది సన్యాసులు, గురువుల ద్వారా అనుభవమును గడి౦చారు. అర్జునుడికి కూడా ఎ౦తో మంది గురువులు౦డేవారని చూపుతారు. మీరందరూ అర్జునులే. ఈ సమయములో మొత్తం ప్రపంచమ౦తటి పై రావణ రాజ్యము ఉ౦ది. మొత్తం ప్రపంచమంతా లంకనే. కేవలం ఈ శ్రీలంక(సీలోన్‌) అనే ఈ చిన్న ద్వీపము మాత్రమే లంక కాదు. అది హద్దులోని లంక. కానీ మొత్తము ప్రపంచమంతా బేహద్‌ లంకయే. ఇప్పుడు ప్రపంచమంతటి పై రావణ రాజ్యముంది. రామరాజ్యములో ఇ౦తమంది మనుష్యులు లేరు. రామ రాజ్యమున్నపుడు రావణ రాజ్యము౦డదు. మరి ఎక్కడికి వెళ్లిపోతు౦ది? క్రిందికి పాతాళములోకి వెళ్లిపోతుంది. మళ్లీ రావణ రాజ్యము పైకి వచ్చినప్పుడు రామ రాజ్యము క్రి౦దకెళ్ళిపోతు౦ది. ఇది నాటకము కదా! చక్రము తిరిగినప్పుడు సత్య యుగము పైకి వచ్చేస్తుంది. ద్వాపర-కలియుగాలు క్రిందికి పోతే సత్య-త్రేతా యుగాలు క్రింది నుండి పైకి వచ్చేస్తాయి. ఇది చక్రములోని మాట కానీ వారేమో అలా వ్రాసేశారు. అ౦తేగానీ సాగరములోకి వెళ్లిపోవడం లేదా సాగరము ను౦డి పైకి రావడం గానీ జరగదు.

ఇవె౦తో గొప్ప గుహ్యమైన, బాగా అర్థము చేసుకోవలసిన విషయాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇ౦దులో ప్రధానమైనది పవిత్రత. తర్వాత యోగము కూడా పక్కాగా ఉ౦డాలి. దీనినే సంపూర్ణ సన్యాసమని అ౦టారు. అనగా ఈ ప్రపంచము ను౦డి బుద్ధియోగము పూర్తిగా సమాప్తమగుట. ఈ విషయాలు మీలో కూడా కొ౦దరు మాత్రమే అర్థము చేసుకుంటారు. ఒకవేళ అ౦దరూ అర్థము చేసుకుంటే అ౦దరూ జ్ఞాన గంగలుగా అయిపోతారు. చిన్న నది కావచ్చు, కెనాల్స్‌(కాలువలు)గా కావచ్చు. చిన్న బావిగా అయ్యి ఇ౦ట్లో వినిపి౦చగలిగినా వారు కొంత అర్థం చేసుకున్నారని భావి౦చవచ్చు. కానీ ఇ౦ట్లో కూడా తెలుపలేరు. తండ్రి చెప్తున్నారు - ఎంత పేదవారైనా ఇ౦ట్లో గీతా పాఠశాలను తెరవవచ్చు. భలే ఒకే గది ఉ౦డి, అ౦దులోనే తి౦టూ, త్రాగుతూ, నిద్రపోతూ కూడా ఉ౦డినా మంచిదే. పని త్వరగా ముగి౦చేసి శుభ్రము చేసి ఈ క్లాసు నిర్వహి౦చండి. మూడడుగుల భూమిలో ఇంత పెద్దదైన ఈ హాస్పిటల్‌ను తెరవవచ్చు. ధనవంతుల విషయాన్ని వదిలేయండి. తండ్రి పేదలపెన్నిధి కదా! ధనవంతులైతే తమకు ఇక్కడే స్వర్గము౦దని అ౦టారు. మంచిది. అప్పుడు వారి కొరకు తండ్రి చెప్తారు - మంచిది. మీరు మీదైన స్వర్గములోనే(ఈ లోకములోనే) ఆనందముగా ఉ౦డండి అని బాబా అ౦టారు. నేను మీకె౦దుకిస్తాను. పేదవారికే దానమివ్వడం జరుగుతు౦ది. పెద్దవారు ఇక్కడ నేల పై కూర్చునేందుకు కూడా ఇష్టపడరు. అలా౦టివారి కొరకు బాబా ఏమంటారంటే, భలే మీరు మీ మహల్‌లోనే ఉ౦డండి. నా వద్దకు బాగా చదువుకునే పేదవారు వస్తే చాలు. ఒకవేళ ఇతరులకు వినిపి౦చలేకుంటే వారు చిన్న చెఱువు కూడా కానట్లే. మీరు పెద్ద నదులుగా అవ్వాలి. మమ్మా, బాబాలను అనుసరి౦చాలి. కానీ ఇ౦ట్లో కూడా వినిపి౦చలేకున్నారంటే దోసిలంత నీరుగా కూడా కానట్లే. జ్ఞాన గంగల ఎదుట బాబాకు మజా వస్తు౦ది. కొ౦దరు బాబా ఎదురుగా కూర్చొని వి౦టున్నప్పుడు చాలా సంతోషిస్తారు. కానీ ఇక్కడి ను౦డి మెట్లు దిగి క్రిందికి పోయారంటే నషా కూడా దిగిపోతు౦ది. ఇక ఇ౦టికి వెళ్ళిపోతే మళ్లీ అవే వ్యర్థమైన వార్తాలాపన చేస్తు౦టారు లేక పరచింతన మొదలవుతుంది. నడవడిక ద్వారా బాబాకు అ౦తా అర్థమవుతుంది. మిలనము చేసేందుకు వస్తారు. కానీ నా పతి, నా పిల్లలు.......... అని అ౦టూ ఉ౦టారు. అరే! మీకు పతి ఎక్కడ ను౦డి వచ్చాడు? వచ్చి౦దేమో స్వర్గములోకి వెళ్ళే౦దుకు, కానీ నా వారు - నా వారు అనే దానిలోనే చిక్కుకొని ఉన్నారు. మంచిది. అచ్ఛా, ఈ డోసు సరిపోతు౦ది. సులభంగా ఎ౦త జీర్ణము చేసుకోగలరో అ౦తే ఇవ్వాలి. బాబా క్లుప్తంగా వివరి౦చారు. యోగము ద్వారా మీరు స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇకపోతే చక్రవర్తి పదవి కొరకు జ్ఞానము అవసరము. రె౦డు సబ్జెక్టులు ఉన్నాయి. ఈ బాబా కూడా యోగములో ఉ౦డేందుకు పురుషార్థము చేస్తారు. అప్పుడే కదా! మర్చిపోరాదు, స్మృతి చేయకు౦డా ఉ౦డరాదు అని చెప్పగలిగేది. మంచిది. (మర్చిపోకుంటే గుర్తుంచుకునేందుకు కష్టపడే అవసరము లేదు).

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా సన్యసించాలి. పవిత్రత, యోగము - ఈ రెండు సబ్జక్టులలో ఫస్టు నంబరు తీసుకోవాలి.
2. జ్ఞాన గంగలై పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. మమ్మా - బాబాలను అనుసరించి పెద్ద నదులుగా అవ్వండి.

వరదానము:- ''సమయము యొక్క జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకొని ప్రశ్నలన్నిటిని సమాప్తము చేసే స్వదర్శన చక్రధారీ భవ''
ఎవరైతే స్వదర్శన చక్రధారీ పిల్లలుగా ఉంటారో, స్వయాన్ని దర్శించుకుంటారో వారికి సృష్టిచక్రము స్వతహాగా దర్శనమైపోతుంది(కనిపిస్తుంది). డ్రామా రహస్యాన్ని తెలుసుకున్నవారు సదా సంతోషంగా ఉంటారు. వారికి ఎప్పుడు? ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు రాజాలవు. ఎందుకంటే డ్రామా స్వయమూ కళ్యాణకారే, సమయం కూడా కళ్యాణకారియే. ఎవరైతే స్వయాన్ని చూస్తారో, స్వదర్శన చక్రధారులుగా అవుతారో వారు సులభంగా ముందుకు వెళ్తూ ఉంటారు.
స్లోగన్‌:- ''అనేక మంది ఆత్మలకు సత్యమైన సేవ చేయాలంటే, శుభ చింతకులుగా అవ్వండి''