Sunday, 21 January 2018

Telugu Murli 21/01/18

21-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 21-04-1983 మధువనము 

''సంగమయుగ మర్యాదలలో నడవడమే పురుషోత్తములుగా అవ్వడం''
ఈ రోజు బాప్‌దాదా మర్యాదా పురుషోత్తములైన పిల్లలందరినీ చూస్తున్నారు. సంగమ యుగ మర్యాదలే పురుషోత్తములుగా తయారుచేస్తాయి. అందువల్లనే మర్యాదా పురుషోత్తములని అంటారు. ఈ తమోగుణీ మనుష్యాత్మలు, తమోగుణీ ప్రకృతి యొక్క వాయుమండలం నుండి, వైబ్రేషన్ల (ప్రకంపనలు) నుండి రక్షించుకునేందుకు సహజ సాధనం ఈ మర్యాదలే. మర్యాదల లోపల ఉండేవారు శ్రమ నుండి సదా రక్షింపబడ్తారు. మర్యాదల రేఖ నుండి సంకల్పాలు, మాటలు మరియు కర్మల ద్వారా బయటకు వచ్చినప్పుడు శ్రమ చేయవలసి వస్తుంది. ప్రతి అడుగు కోసం బాప్‌దాదా ద్వారా మర్యాదలు లభించాయి. దాని అనుసారంగా ప్రతి అడుగు వేయడం ద్వారా స్వతహాగా మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు. అమృతవేళ నుండి రాత్రి వరకు గల మర్యాదా పూర్వకమైన జీవితాన్ని గురించి మీకు బాగా తెలుసు. దాని అనుసారంగా నడవడమే పురుషోత్తములుగా అవ్వడం. మీ పేరే పురుషోత్తములు అనగా సర్వ సాధారణ పురుషులలో ఉత్తములు. కావున శ్రేష్ఠ ఆత్మలైన ''మా మొదటి ముఖ్య విషయమైన స్మృతి ఉత్తమంగా ఉందా? '' అని పరిశీలించుకోండి. స్మృతి ఉత్తమంగా ఉంటే సృష్టి, వృత్తి మరియు స్థితి స్వతహాగా శ్రేష్ఠంగానే ఉంటాయి. స్మృతి చేసే మర్యాదా రేఖ గురించి తెలుసా? 'నేను శ్రేష్ఠమైన ఆత్మనే, అందరూ ఒక్క శ్రేష్ఠమైన తండ్రి సంతానమైన ఆత్మలే. వెరైటీ(రకరకాల) ఆత్మలు వెరైటీ పాత్రలను అభినయిస్తున్నారు.' ఈ మొదటి పాఠం సహజ రూపంలో స్మృతి స్వరూపంలో ఉండాలి. దేహాన్ని చూస్తున్నా ఆత్మనే చూడాలి. ఈ సమర్థ స్మృతి ప్రతి సెకను మీ స్వరూపంలోకి రావాలి (స్వరూపంలో ఉండాలి). స్మృతి స్వరూపులుగా అయిపోవాలి. కేవలం నేను ఆత్మను, వీరు ఆత్మ అని స్మరించడం కాదు. నేను ఆత్మనే, వీరు కూడా ఆత్మయే అన్న ఈ మొదటి స్మృతి యొక్క మర్యాద స్వయాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. అంతేకాక ఇతరులకు కూడా ఈ శ్రేష్ఠ స్మృతి యొక్క సమర్థ వైబ్రేషన్లను(ప్రకంపనాలను) వ్యాపింపజేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. దీని ద్వారా ఇంకా నిర్విఘ్నంగా అయిపోతారు.

పాండవ సైన్యం మిలనం జరుపుకోవడానికైతే వచ్చారు కాని మిలనంతో పాటు మొదటి మర్యాదా రేఖకు పునాది అయిన 'స్మృతి భవ' అను వరదానాన్ని కూడా సదా వెంట తీసుకు వెళ్ళండి. స్మృతి భవయే ' సమర్థ భవ ' అవుతుంది. ఏదైతే విన్నారో దాని సారం ఏమి తీసుకొని వెళ్తారు? దాని సారం స్మృతి భవ. ఇదే వరదానాన్ని సదా అమృతవేళ రివైజ్‌(పునరావృతం) చేయండి. ప్రతి కార్యం చేసే ముందు ఈ వరదానాన్ని సమర్థ స్థితి అనే ఆసనం పైన కూర్చొని ఇది వ్యర్థమా లేక సమర్థమా అని నిర్ణయించిన తర్వాత కర్మలోకి రావాలి. కర్మ చేసిన తర్వాత కర్మ యొక్క ఆదికాలం నుండి అంత్యకాలం వరకు సమర్థంగా ఉన్నానా? అని మళ్ళీ పరిశీలించుకోండి. లేకుంటే చాలామంది పిల్లలు కర్మ యొక్క ఆదికాలంలో సమర్థ స్వరూపంలో కర్మ చేయడం ప్రారంభిస్తారు కానీ మధ్యలో వ్యర్థమైన లేక సాధారణ కర్మలుగా ఎలా అయిపోతాయో సమర్థానికి బదులుగా వ్యర్థం లైనులోకి ఏ సమయంలో ఎలా వెళ్ళి పోయారో కూడా తెలియదు. మళ్ళీ అంతములో ఎలా చెయ్యాలో అలా చెయ్యలేదని అనుకుంటారు. కాని ఫలితం ఏమయ్యింది! చేసిన తర్వాత ఆలోచంచడం త్రికాలదర్శీ ఆత్మల లక్షణం కాదు. అందువలన మూడు కాలాలలో 'స్మృతి భవ' లేక 'సమర్థ భవ'. ఏమి తీసుకొని వెళ్ళాలో అర్థమయ్యిందా? సమర్థ స్థితి అనే ఆసనాన్ని ఎప్పుడూ వదలరాదు. ఈ ఆసనమే హంస ఆసనం. హంస యొక్క విశేషత నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి ద్వారా సదా మర్యాదా పురుషోత్తమ స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు. 'ఆసనం' అనే వరదానం మరియు ఈశ్వరీయ టైటిల్‌(బిరుదు) 'మర్యాదా పురుషోత్తములు' ఈ రెండింటినీ జతలో ఉంచుకోండి. మంచిది. ఈ రోజు కేవలం శుభాకాంక్షలు తెలిపే రోజు. సేవ కోసం వెళ్తున్నారు, కొంగల మధ్యలోకి కూడా వెళ్తున్నారు, కానీ సేవార్థం వెళ్తున్నారు. కర్మ సంబంధంగా భావించి వెళ్ళకండి, కాని సేవా సంబంధమని భావించి వెళ్ళండి. కర్మ సంబంధాన్ని సమాప్తం చేసుకునేందుకు కూర్చోలేదు. సేవా సంబంధాన్ని నిభాయించేందుకు కూర్చున్నారు. కర్మ బంధనం కాదు, సేవా బంధనం. మంచిది.

సదా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థ స్థితి అనే హంస ఆసనం పై స్థితులై ఉండేవారికి, ప్రతి కర్మను త్రికాలదర్శి శక్తితో మూడు కాలాలను సమర్థంగా తయారు చేసుకునే వారికి, సదా స్వతహాగా ఆత్మిక స్థితిలో స్థితులయ్యే మర్యాదా పురుషోత్తములైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక :- సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యశాలురుగా అనుభవం చేస్తున్నారా? ఎవరి తండ్రి అయితే భాగ్యవిధాతగా ఉన్నారో, వారెంత భాగ్యశాలురుగా ఉంటారు! తండ్రే భాగ్యవిధాతగా ఉన్నప్పుడు వారసత్వంగా ఏమిస్తారు? తప్పకుండా శ్రేష్ఠ భాగ్యమే ఇస్తారు కదా! సదా భాగ్యవిధాత అయిన తండ్రి మరియు భాగ్యం రెండూ గుర్తుండాలి. ఎప్పుడైతే మీ శ్రేష్ఠ భాగ్యము స్మృతిలో ఉంటుందో అప్పుడు ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారు చేసే ఉమంగ-ఉత్సాహాలు ఉంటాయి. ఎందుకంటే దాత పిల్లలుగా ఉన్నారు, భాగ్యవిధాత అయిన తండ్రి బ్రహ్మాబాబా ద్వారా భాగ్యాన్ని పంచారు కావున బ్రాహ్మణులైన మీరు కూడా ఏమి చేస్తారు? బ్రహ్మ కార్యం ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల కార్యం కావున మీరు అటువంటి భాగ్యాన్ని పంచేవారు. వారైతే బట్టలు పంచుతారు, ధాన్యం పంచుతారు, నీరు పంచుతారు. కానీ శ్రేష్ఠ భాగ్యాన్ని అయితే భాగ్యవిధాత పిల్లలే పంచగలరు. కనుక మీరు భాగ్యాన్ని పంచే శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు. ఎవరికైతే భాగ్యం ప్రాప్తించిందో వారికి సర్వస్వం లభించింది. ఒకవేళ ఈ రోజు ఎవరికైనా వస్త్రాలను ఇచ్చినట్లయితే, రేపు ధాన్యం కొరత ఉంటుంది. అలాగే రేపు ధాన్యాన్ని ఇచ్చినట్లయితే నీటి కొరత ఉంటుంది. ఒక్కొక్క వస్తువును ఎంతవరకు పంచుతారు! దానితో తృప్తిగా అవ్వజాలరు. భాగ్యాన్ని కనుక పంచినట్లయితే, ఎక్కడ భాగ్యముంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ప్రాప్తించినట్లయితే వాహ్‌ నా భాగ్యము! అని అంటారు. ఎక్కడ భాగ్యముంటుందో అక్కడ అన్నీ పాప్తిస్తాయి. కావున మీరందరూ శ్రేష్ఠ భాగ్యాన్ని దానం చేసేవారు. ఇలాంటి మహాదానుల, శ్రేష్ఠ భాగ్యవంతుల ఇదే స్మృతి సదా ఎగిరేకళలోకి తీసుకెళ్తుంది. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్య స్మృతి ఉంటుందో, అక్కడ సర్వ ప్రాప్తుల స్మృతి ఉంటుంది. ఈ భాగ్యాన్ని పంచడంలో విశాల హృదయులుగా అవ్వండి. ఇది తరగనిది. పదార్థము కొద్దిగా ఉంటే పిసినారితనపు భావన రావచ్చు, కాని ఇది తరగనిది. కనుక పంచుతూ ఉండండి, సదా ఇస్తూ ఉండండి. ఒక్క రోజు కూడా దానం ఇవ్వకుండా ఉండరాదు. సదా దానం చేసేవారు ప్రతీ సమయంలో తమ ఖజానాలను తెరిచి ఉంచుతారు. ఒక గంట కూడా దానాన్ని ఆపరు. బ్రాహ్మణుల కర్తవ్యమే సదా విద్యను తీసుకోవడం, విద్యాదానం చేయడం. కావున ఈ కార్యంలో సదా తత్పరులై ఉండండి.

2. సదా స్వయాన్ని సంగమయుగ వజ్ర సమానమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మీరందరూ సత్యమైన వజ్రాలుగా ఉన్నారు కదా! వజ్రానికి విలువ చాలా ఉంటుంది. మీ బ్రాహ్మణ జీవితానికి ఎంత విలువ ఉంది? అందుకే బ్రాహ్మణులను సదా శిఖరం(పిలక) స్థానంలో చూపిస్తారు. పిలక అనగా ఉన్నతమైన స్థానం. వాస్తవానికి ఉన్నతమైనవారు దేవతలు. కాని దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు ఉన్నతమైనవారు - ఇటువంటి నషా ఉంటుందా? నేను తండ్రి వాడిని, తండ్రి నా వారు. ఈ జ్ఞానముంది కదా! ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సదా మనసులో, 'పొందవలసినందంతా పొందేశాను(జో పానా థా వహ్‌ పాలియా).' అన్న ఈ పాటయే మ్రోగుతూ ఉండాలి. నోటి ద్వారా ఒక గంటసేపు పాడితే అలసిపోతారు కానీ మనసుతో పాట పాడడంలో అలసట రాదు. తండ్రివారిగా అవ్వడం వలన నృత్యం చేసేవారిగా కూడా, పాట పాడేవారిగా కూడా, చిత్రకారులుగా కూడా అన్ని రకాలవారిగా అయిపోతారు. ప్రాక్టికల్‌గా మీ ఫరిస్తా చిత్రాన్ని తయారు చేసుకుంటున్నారు. కావున ఏమనుకుంటే అవన్నీ అవుతారు. చాలా గొప్ప బిజినెస్‌ మాన్‌గా(వ్యాపారవేత్తగా) కూడా ఉన్నారు. మిల్లుల యజమానిగా కూడా ఉన్నారు. కావున తమ కర్తవ్యాన్ని సదా నిశ్చితితో ఉంచుకోండి. ఒకసారి గనుల యజమానిగా అయిపోండి. ఒకసారి ఆర్టిస్ట్‌(కళకారునిగా) అయిపోండి, ఒకసారి నృత్యం చేసేవారిగా అయిపోండి..... ఇది చాలా రమణీకమైన జ్ఞానం. రసం లేనిది కాదు. రోజూ ఇదే ఆత్మ-పరమాత్మ జ్ఞానాన్ని వింటూ ఉండాలా అని కొందరంటూ ఉంటారు. కాని ఇది ఆత్మ-పరమాత్మల రసం లేని జ్ఞానం కాదు. చాలా రమణీకమైన జ్ఞానం. కేవలం రోజూ మీ క్రొత్త - క్రొత్త టైటిల్స్‌(బిరుదులు) గుర్తుంచుకోండి. నేను ఆత్మనే కానీ ఎటువంటి ఆత్మను? ఒకసారి ఆర్టిస్టు(కళాకారుడు) ఆత్మను, ఒకసారి బిజినెస్‌(వ్యాపారస్థుడు) ఆత్మను. కావున ఇలా రమణీకతతో ముందుకు వెళ్తూ ఉండండి. తండ్రి రమణీకమైనవారు కదా! చూడండి, ఒకసారి చాకలిగా అయిపోతారు, ఒకసారి విశ్వరచయితగా, ఒకసారి విధేయుడైన సేవకుడిగా..... అయిపోతారు. కావున తండ్రి ఎలాంటివారో, పిల్లలు కూడా అలాంటివారే..... ఈ విధంగా రమణీకమైన జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండండి.

వర్తమాన సమయ ప్రమాణంగా స్వయం మరియు సేవ రెండిటి వేగాల బ్యాలెన్స్‌(సమతుల్యం) ఉండాలి. ఎంత సేవ తీసుకున్నానో అంతగా రిటర్న్‌(బదులు) ఇస్తున్నానా? అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడిది సేవ చేసే సమయం. ఎంతగా ముందుకు వెళ్ళాలో అంతగా సేవకు యోగ్యమైన సమయమవుతూ పోతుంది. కాని ఆ సమయంలో అనేక పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితులలో సేవ చేసేందుకు ఇప్పటి నుండే సేవ చేసే అభ్యాసముండాలి. రావడం, వెళ్ళడం కూడా కష్టమవుతుంది. ముందుకు వెళ్ళేందుకు మనసు ద్వారానే సేవ చేయవలసి ఉంటుంది. ఇది ఇచ్చే సమయంగా అయ్యింది. స్వయంలో నింపుకునే సమయం కాదు. అందువలన మొదటి నుండే సర్వ శక్తుల స్టాకు నింపుకున్నామా? అని మీ స్టాకును పరిశీలించుకోండి. సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ జ్ఞాన ఖజానాలు స్మృతి శక్తితో సదా నిండుగా ఉండాలి. దేనికీ లోటు ఉండరాదు.

28వ తేది అమృతవేళలో బాప్‌దాదా సద్గురువారపు అభినందనలు తెలియచేశారు---- వృక్షపతి దినాన అభినందనలు. వృక్షపతి రోజున సదాకాలానికి బృహస్పతి దశ స్థిరంగా ఉండాలి. సదా ఇదే స్మృతి స్వరూపంలో ఉండాలి. ఇప్పుడైతే అందరూ ప్రతిజ్ఞను పక్కాగా చేశారు కదా! కుమారుల గ్రూపు తయారైపోయినట్లయితే ధ్వని బిగ్గరగా వస్తుంది. ప్రభుత్వం వరకు వ్యాపిస్తుంది. కాని అవినాశీగా ఉంటేనే...! గడబిడ చేయకండి. ఉమంగ-ఉత్సాహాలు, ధైర్యం బాగున్నాయి. ఎక్కడ ధైర్యముందో అక్కడ సహాయము ఉండనే ఉంది. శక్తులు ఏమి ఆలోచిస్తున్నారు? శక్తులు లేకుంటే శివుడు కూడా లేడు. తండ్రి కూడా భుజాలు లేకుండా ఏమి చేయగలరు? కావున మొదటి భుజాలు ఎవరు? వాహ్‌ నేనే! మంచిది.

పరమాత్మ ప్రేమలో సదా లీనమై ఉండండి. (వ్యక్తిగత అవ్యక్త మహావాక్యాలు)

పరమాత్మ ప్రేమను అనుభవించిన అనుభవజ్ఞులుగా అయినట్లయితే, తన అనుభవము ద్వారా సహజయోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనము. ఎగిరే వారెప్పుడూ భూమ్యాకర్షణలోకి రాలేరు. మాయ రూపము ఎంతగా ఆకర్షించినా, ఆ ఆకర్షణ ఎగిరేకళలో ఉన్న వారి వద్దకు చేరుకోజాలదు. ఈ పరమాత్మ ప్రేమ అనే దారము దూరం-దూరం నుండి ఆకర్షించి తీసుకొస్తుంది. ఇది ఎటువంటి సుఖాన్నిచ్చే ప్రేమ అంటే ఎవరైతే ఈ ప్రేమలో ఒక్క సెకను అయినా మునిగిపోతారో, వారు వారి అనేక దు:ఖాలను మర్చిపోతారు. అంతేకాక సదా కొరకు సుఖమనే ఊయలలో ఊగడం ప్రారంభిస్తారు. జీవితంలో ఏది కావాలో అది ఎవరైనా ఇచ్చినట్లయితే అదే ప్రేమకు గుర్తుగా అవుతుంది. కావున తండ్రికి పిల్లల పైన ఎంత ప్రేమ ఉందంటే జీవితంలోని సుఖం-శాంతి మొదలైన కామనలన్నింటినీ పూర్తి చేస్తారు. తండ్రి సుఖమే ఇవ్వడం లేదు, సుఖ భండారానికి యజమానిగా చేస్తారు. ఇందుకు తోడు-తోడుగా శ్రేష్ఠ భాగ్యరేఖను గీసుకునే కలము కూడా ఇస్తారు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. ఇదే పరమాత్మ ప్రేమ. ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లీనమై మునిగిపోయి ఉంటారో వారి మెరుపు మరియు నషా అనుభూతుల కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏ సమస్యా సమీపంగా రాలేదు సరి కదా కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎన్నడూ ఏ విధమైన శ్రమా ఉండజాలదు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే అమృతవేళ నుండే పిల్లల పాలన చేస్తూ ఉంటారు. రోజు ప్రారంభమే ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! స్వయం భగవంతుడే మిలనం చేసేందుకు పిలుస్తారు. ఆత్మిక సంభాషణ చేస్తారు. శక్తులు నింపుతారు. తండ్రి పాడే ప్రేమ పాట మిమ్మల్ని నిద్ర లేపుతుంది(మేల్కొల్పుతుంది). మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ! రండి,..... అని ఎంతో ప్రేమతో పిలుస్తారు, నిద్ర లేపుతారు. కావున ఈ ప్రేమతో కూడిన పాలనకు ప్రాక్టికల్‌ స్వరూపం ''సహజయోగీ జీవితం''. ఎవరి పై ప్రేమ ఉంటుందో, వారికి ఏది బాగుంటుందో అదే చేయడం జరుగుతుంది. కావున తండ్రికి పిల్లలు నిరుత్సాహంగా ఉండడం(అప్‌సెట్‌ అవ్వడం) బాగుండదు. అందువలన ఎప్పుడు ఏమి చేయాలి, విషయమే అలా ఉంది, అందువలన అప్‌సెట్‌ అయ్యామని అనకండి. ఒకవేళ నిరుత్సాహపడే విషయం వచ్చినా మీరు నిరుత్సాహ స్థితిలోకి రాకండి. బాప్‌దాదాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే ప్రతి పుత్రుడు నా కన్నా ముందు ఉండాలని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుందో, వారిని తమ కంటే ముందుకు తీసుకెళ్తారు. ఇదే ప్రేమకు గుర్తు. కావున బాప్‌దాదా కూడా నా పిల్లల్లో ఇప్పుడు ఏ విధమైన లోపం, బలహీనత ఉండరాదు. అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలని అంటారు.

పరమాత్మ ప్రేమ ఆనందకరమైన ఊయల. ఈ సుఖాన్నిచ్చే ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ పరిస్థితి లేక మాయ ద్వారా అలజడి రాజాలదు. పరమాత్మ ప్రేమ తరగనిది, చలించనిది. సర్వులకు ప్రాప్తి అవ్వజాలదు. సదా అనంతమైన ప్రాప్తులలో మగ్నమై ఉంటారు. వారి నుండి ఆత్మీయతా సుగంధం వస్తూ ఉంటుంది. ప్రేమకు గుర్తు - ఎవరి పై ప్రేమ ఉంటుందో వారికి తమ సర్వస్వం సమర్పితం చేసేస్తారు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే రోజూ బాబా మీ ప్రేమకు బదులు(రెస్పాండ్‌) ఇవ్వడానికి ఇంత పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు. ప్రియమైన పిల్లలకు ఇస్తారు. అంతేకాక సహచరునిగా అయ్యి సదా తోడు నిభాయిస్తారు. కావున ఈ ప్రేమలో తమ బలహీనతలన్నీ బలిహారం చెయ్యండి. పిల్లలంటే తండ్రికి ప్రేమ ఉంది. అందువలన పిల్లలూ! మీరు ఎలా ఉన్నా నా వారే అని సదా అంటారు. అదే విధంగా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి. బాబా! ఎలా ఉన్నా గానీ అందరూ మీవారిగానే ఉన్నామని హృదయపూర్వకంగా చెప్పండి. ఎప్పుడూ ఆ అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. ఎవరైతే ప్రియంగా ఉన్నారో వారిని స్మృతి చేయనవసరం లేదు. వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలం హృదయ పూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యంగా మరియు నిస్వార్థంగా ఉండాలి. ఎప్పుడైతే ' మేరా బాబా(నా తండ్రి), ప్యారా బాబా(ప్రియమైన తండ్రి) ' అని అంటున్నారో ప్రియమైన వారు ఎప్పుడూ మర్చిపోజాలరు. నిస్వార్థ ప్రేమ తండ్రి నుండి తప్ప ఏ ఇతర ఆత్మ నుండి లభించజాలదు. అందువలన ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చేయకండి. నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండండి.

ఆదికాలం అమృతవేళ తమ హృదయంలో పరమాత్మ ప్రేమను 83 జన్మలు సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ మనసులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం వింటూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవ్వరి వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్ళజాలదు. ఈ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మలు లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. ఇప్పుడే పరమాత్మ ప్రేమ లభిస్తుంది. ఆ ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడ్తుంది. కానీ పరమాత్మ ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. కావున ఈ ప్రేమ అనుభూతులలో ఇమిడిపోయి ఉండండి. తండ్రి పట్ల సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ప్రేమకు గుర్తు - సమానంగా, కర్మాతీతంగా అవ్వండి. చేయించేవారిగా అయ్యి కర్మలు చేయండి, చేయించండి. కర్మేంద్రియాలు మీ చేత చేయించరాదు. మీరు కర్మేంద్రియాలతో చేయించండి. ఎప్పుడూ మనసు-బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మనూ చేయకండి. మంచిది.
వరదానము :- ''చేయించేవారి స్మృతి ద్వారా అతి పెద్ద కార్యాన్ని సహజంగా చేసే నిమిత్త కరన్‌హార్‌ భవ (చేసేవారిగా అవ్వండి)''
బాప్‌దాదా(స్వర్గ) స్థాపన చేసే అతి పెద్ద కార్యాన్ని స్వయం చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా చేసే పిల్లల ద్వారా చేయిస్తున్నారు. చేసి-చేయించేవారు అన్న ఈ పదంలో తండ్రి మరియు పిల్లలు ఇరువురూ కంబైండుగా(సంయుక్తంగా) ఉన్నారు. చేతులు పిల్లలవి, కార్యం తండ్రిది. సహయోగమునిచ్చే గోల్డెన్‌ ఛాన్స్‌(బంగారు అవకాశం) పిల్లలకే లభించింది. కానీ చేయించేవారు చేయిస్తున్నారు. నిమిత్తంగా తయారు చేసి నడిపిస్తున్నారనే అనుభవాన్నే చేస్తారు. ప్రతి కర్మలో చేయించేవారి రూపంలో తోడుగా ఉన్నారు. 

స్లోగన్‌ :- ''అర్జీ చేసేందుకు బదులు సదా రాజీగా ఉండువారే జ్ఞాన యుక్త ఆత్మలు''
 

Friday, 19 January 2018

Telugu Murli 20/01/18

20-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఒక్క మన్మనాభవ అను మహామంత్రము ద్వారా మీరు వివేకవంతులుగా అవుతారు, ఈ మంత్రమే అన్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తుంది.'' 

ప్రశ్న :- పూర్తి జ్ఞానమంతటి సారమేది? మన్మనాభవగా ఉండేవారి గుర్తులు ఏవి?
జవాబు :- పూర్తి జ్ఞాన సారమేమంటే - ఇప్పుడు మనము వాపసు ఇంటికి వెళ్లాలి. ఇది ఛీ - ఛీ (పాడైపోయిన) ప్రపంచము. దీనిని వదలి మనము మన ఇంటికి వెళ్లాలి. ఇది గుర్తున్నా మన్మనాభవగా ఉన్నట్లే. మన్మనాభవగా ఉండే పిల్లలు సదా జ్ఞానాన్ని విచార సాగర మథనము చేస్తూ ఉంటారు. వారు బాబాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తారు.

ప్రశ్న :- ఏ అలవాటుకు వశీభూతమైన ఆత్మ తండ్రి స్మృతిలో ఉండలేదు ?

జవాబు :- అశుద్ధమైన చిత్రాలను చూసే అలవాటు ఉన్నా, అశుద్ధమైన సమాచారము చదివే అలవాటు ఉన్నా తండ్రి స్మృతి ఉండదు. సినిమా నరకానికి ద్వారము. అది మానసిక వృత్తులను పాడు చేస్తుంది.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తక్కువ తెలివి ఉన్నవారికే అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు చాలా తెలివి గలవారిగా అయ్యారు. వీరు మా అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. విద్యార్థుల బుద్ధిలో జ్ఞానముండాలి కదా. తర్వాత మళ్లీ తండ్రి తన జతలో కూడా తప్పకుండా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది పాడైపోయిన పాత ప్రపంచమని తండ్రికి తెలుసు. ఈ పాత ప్రపంచము నుండి నేను పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇచ్చట కూర్చుంటూ కూర్చుంటూ పిల్లల మనసులలో తప్పకుండా ఇలా వస్తూ ఉంటుంది - ఓహో! వీరు మా అనంతమైన తండ్రే కాక మాకు చాలా శ్రేష్ఠమైన శిక్షణ కూడా ఇస్తారు. మొత్తము రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇవన్నీ స్మృతి చేయడం కూడా మన్మనాభవయే. ఇది కూడా మీ చార్టులోకి రాగలదు. ఇది చాలా సులభము. ఇంకేమీ చేయకపోయినా కూర్చుంటూ - లేస్తూ - నడుస్తూ - తిరుగుతూ బుద్ధిలో ఇది గుర్తుండాలి. అద్భుతమైన వస్తువును స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినందున తండ్రి చెప్పిన చదువు చదువుకున్నందున మనము మళ్లీ విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. మీరు బస్సు, రైలు మొదలైనవాటిలో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నా బుద్ధిలో స్మృతి ఉండాలి. మొట్టమొదట పిల్లలకు తండ్రి కావాలి. ఆత్మలైన మనకు, వారు సర్వాత్మల ఆత్మిక అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. సులభంగా గుర్తు వచ్చేందుకు బాబా యుక్తులను తెలిపిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు అర్ధకల్పము నుండి చేసిన వికర్మలన్నీ యోగాగ్ని ద్వారా భస్మమైపోతాయి. జన్మ-జన్మాంతరాలుగా యజ్ఞ, జపతపాదులు అనేకము చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో భక్తిమార్గము వారికి తెలియదు. వీటి ద్వారా ఏ ప్రాప్తి జరుగుతుందో కూడా వారికి తెలియదు. మందిరాలకు వెళ్తారు. ఎంతో భక్తి చేస్తారు. ఇవన్నీ పరంపర నుండి కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. శాస్త్రాలు కూడా పరంపర నుండి వస్తున్నాయని అంటారు. స్వర్గములో శాస్త్రాలు ఉండనే ఉండవని మనుష్యులకు తెలియదు. సృష్టి ప్రారంభము నుండే ఇవన్నీ కొనసాగుతూ వస్తున్నాయని వారు భావిస్తారు. అనంతమైన తండ్రి ఎవరో కూడా వారు ఎవ్వరికీ చెప్పలేరు. ఇచ్చట హద్దు తండ్రి గాని, హద్దు టీచరు గాని లేరు. హద్దు టీచరు ద్వారా అయితే మీరందరూ చదువుకున్నారు. చదువుకున్న తర్వాతనే ఉద్యోగము మొదలైనవి చేస్తారు, సంపాదిస్తారు. మన అందరి అనంతమైన తండి ఎవరైతే ఉన్నారో వారికి తండి లేరని, వారు మనకు అనంతమైన టీచరు కూడా అయినారని పిల్లలైన మీకు తెలుసు, వీరికి టీచరు కూడా ఎవ్వరూ లేరు. ఈ దేవతలను ఎవరు చదివించారో వారు తప్పకుండా గుర్తు రావాలి కదా! ఇది కూడా మన్మనాభవయే. ఈ చదువును ఎక్కడ నుండీ చదవలేదు. ఎందుకంటే తండ్రే స్వయంగా జ్ఞానసాగరులు. వీరిని ఎవరైనా చదివించారా? మానవ సృష్టికి వారు బీజరూపులు, చైతన్యమైనవారు, జ్ఞానసాగరులు. చైతన్యమైనందున మానవ సృష్టి రూపి వృక్ష రహస్యమును ఆది నుండి అంత్యము వరకు వినిపిస్తారు. చివరి సమయములో వచ్చి ఆది సమయపు జ్ఞానము వినిపిస్తారు. వారంటున్నారు ఓ పిల్లలారా! నేను ఏ శరీరములో విరాజమానమై ఉన్నానో, ఇతని ద్వారా నేను ఆది నుండి ఈ సమయము వరకు సర్వమూ వినిపిస్తాను. అంతము గురించి అయితే తర్వాత వినిపిస్తాను. పోను పోను ఇది అంతిమ సమయమని మీరు అర్థము చేసుకుంటారు, ఎందుకంటే ఆ సమయానికి మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారు. అంతేకాక ఈ పాత ఛీ - ఛీ ప్రపంచము వినాశనము అవ్వనే అవుతుందని సూచనలు కూడా చూస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు చూశారు. ఇక మీదట కూడా చూస్తూ ఉంటారు. కల్పక్రితము రాజ్యము తీసుకున్నారు. మళ్లీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. బాబా మనలను చదివిస్తారు. మనమే విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని తర్వాత 84 జన్మలు తీసుకున్నామని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ విశ్వానికి అధిపతులుగా తయారు చేసేందుకు బాబా అదే జ్ఞానాన్ని ఇస్తున్నారని బాబా టీచరు కూడా అని మీరు లోలోపల అర్థము చేసుకున్నారు. అచ్ఛా ఒకవేళ తండ్రి గుర్తుకు రాకుంటే టీచరును స్మృతి చేయండి. టీచరును ఎప్పుడైనా మర్చిపోతారా? టీచరు ద్వారా చదువుకుంటూ ఉంటారు. అయితే మాయ ఏమారుస్తుంది. అది మీకు తెలియనే తెలియదు. మాయ ఒక్కసారిగా కళ్లలో దుమ్ము చల్లుతుంది. దాని వలన భగవంతుడు మనలను చదివిస్తున్నారని పూర్తిగా మర్చిపోతారు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా వివరిస్తారు. ఇది అనంతమైన జ్ఞానము, వారిది హద్దు జ్ఞానము. ఈ బేహద్‌ జ్ఞానాన్ని బాబా కల్ప-కల్పము పిల్లలైన మీకు ఇస్తారు. అచ్ఛా. ఎక్కువగా చదవలేకపోతే భలే వారిని తండ్రి రూపములో స్మృతి చేయండి. వారికి ఏ తండ్రీ లేరు ఎందుకంటే వారే సర్వులకు తండ్రి. అందరూ వారి పిల్లలే. శివబాబా ఎవరి కొడుకో ఎవరైనా చెప్పగలరా? వారు అనంతమైన తండ్రి, మేము అనంతమైన తండ్రివారిగా అయ్యామని పిల్లలకు అర్థము చేసుకున్నారు. మన ఈ చదువు కూడా అద్భుతమైనది. బ్రాహ్మణులైన మనము మాత్రమే ఈ చదువును చదువుకుంటాము. దేవతలు లేక క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ చదువును చదవలేరు. తండ్రి తెలిపే ఈ జ్ఞానము పూర్తిగా భిన్నమైనది. మీరు తప్ప ఇతరులెవరూ అర్థము చేసుకోలేరు. పిల్లలైన మీ ఖుషీ పాదరసము మీటరు పైకి ఎక్కాలి. ఎందుకంటే మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యాము. ఇప్పుడు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చాలా బాగా చేయాలి. అంతేకాని స్వర్గములోకి అయితే అందరూ వస్తారు కదా అని అనుకోరాదు. జ్ఞాన-యోగాలు ధారణ జరగకుంటే ఉన్నతమైన పదవి లభించదు.

బాబా అంటున్నారు - 16 కళా సంపూర్ణంగా అవ్వడంలో స్మృతి చేయు శ్రమ ఉంది. ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనము సుఖదాత పిల్లలము. అందరికీ సుఖమునే ఇవ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. ఈ సమయములో ఎవరైతే చదువుకుంటారో, వారు సుగంధ భరిత పుష్పాలుగా అవుతారు. మీ వెంట వచ్చేది ఈ సంపాదనే. ఇందులో ఏ పుస్తకాలు మొదలైనవి చదవవలసిన అవసరమే లేదు. ఆ చదువులో ఎన్నో పుస్తకాలు మొదలైనవి చదవవలసి వస్తుంది. బాబా చెప్పిన ఈ జ్ఞానము అన్నిటికంటే భిన్నమైనది. అంతేకాక సులభమైనది కూడా. కాని ఇదంతా గుప్తము. మీరు ఏం చదువుతున్నారో మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది అద్భుతమైన చదువు. తండ్రి అంటున్నారు - ఎప్పుడూ ఆబ్సెంటు అవ్వరాదు. చదువును ఎప్పుడూ వదలరాదు. బాబా వద్ద అందరి రిజిస్టరు ఉంటుంది. ఆ రిజిస్ట్టరు ద్వారా ఇతడు పది మాసాలు ఆబ్సెంటు, ఇతడు ఆరు మాసాలు ఆబ్సెంటు అని బాబా తెలుసుకుంటారు. కొంతమంది నడుస్తూ - నడుస్తూ చదువు కూడా వదిలేస్తారు. ఇది చాలా అద్భుతమైనది. ఇటువంటి అద్భుతమైన వస్తువు మరొకటేదీ ఉండదు. కల్ప-కల్పము పిల్లలైన మిమ్ములను ఇటువంటి తండ్రి వచ్చి కలుసుకుంటారు. ఈ సాకార బాబా అయితే పునర్జన్మలోకి వస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇతడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాడు. తతత్వమ్‌(మీరు కూడా అలాగే తిరుగుతారు) ఇది ఆట కదా. ఆటను ఎప్పుడూ మర్చిపోరు. ఆట సదా గుర్తుంటుంది.

బాబా అర్థం చేయిస్తున్నారు - ఒకటేమో ఈ ప్రపంచము నరకంగా ఉంది. దానిలోనూ ముఖ్యంగా సినిమాలు నరక కూపాలు. అక్కడకు వెళ్లి సినిమాలు చూచినందున వృత్తులు(భావాలు) ఎంతో పాడైపోతాయి. వార్తాపత్రికలలో కూడా ఎవైనా మంచి-మంచి అందమైన చిత్రాలు చూస్తే అందులోకిి కూడా బుద్ధి పోతుంది - వీరు అందముగా ఉన్నారు, వీరికి బహుమతి లభించాలి. ఇటువంటి ఆలోచనలు నడుస్తాయి. అటువంటి చిత్రాలు అసలు ఎందుకు చూడాలి? ఈ మొత్తం ప్రపంచమే సమాప్తము అవ్వనున్నదని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇటువంటి వస్తువులను చూడకండి. వాటిని గురించి ఆలోచించకండి. ఇవి పాత ప్రపంచములోని ఛీ-ఛీ(మురికి) శరీరాలు, వాటి వైపు చూసే పని ఏముంది? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి. బాబా అంటున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! గమ్యము చాలా ఉన్నతమైనది. మాయ తక్కువైనదేమీ కాదు. మాయ ఆడంబరాలు, అట్టహాసము ఎంతగా ఉందో చూడండి. ఆ వైపు సైన్సు, ఇటువైపు మీ సైలెన్సు ఉంది. వారు ముక్తిని పొందాలనుకుంటారు. ఇచ్చట మీ లక్ష్యము జీవన్ముక్తిని పొందుకోవడం. జీవన్ముక్తి పొందు దారిని ఎవ్వరూ తెలపలేరు. సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఈ జ్ఞానమునివ్వలేరు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండమని వారు ఎవ్వరికీ అర్థము చేయించలేరు. ఇలా అర్థము చేయించేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. భక్తి మార్గములో సమయము వృథా అవుతూనే వచ్చింది. ఎన్ని తప్పులు(భూలే) చేస్తూ ఉంటారు! తప్పులు చేస్తూ చేస్తూ భోలాగా(అమాయకంగా) అయిపోయారు. ఈ చివరి జన్మ నూరు శాతము తప్పుల తడికగా ఉంది. కొద్దిగా కూడా బుద్ధి పని చేయదు. ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తున్నారు, అందుకే మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకున్నారు. కావున ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. సంతోష పాదరస మట్టము కూడా మీకే పైకి ఎక్కుతుంది. ఇది అద్భుతము కదా - ఈ తండ్రికి తన తండ్రి అంటూ ఎవ్వరూ లేదు. శిక్షకులు కూడా ఎవ్వరూ లేరు. అయితే వీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. తప్పకుండా వారికి ఎవరో గురువు ఉంటారని చాలామంది భావిస్తారు. ఒకవేళ వీరు కూడా గురువు నుండి నేర్చుకొని ఉంటే ఆ గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉండాలి కదా. కేవలం ఈ ఒక్క శిష్యుడు మాత్రమే ఉండడు. గురువుకైతే శిష్యులు చాలామంది ఉంటారు. ఆగాఖాన్‌కు ఎంతమంది శిష్యులో చూడండి. వారు గురువును ఎంత గౌరవిస్తారో చూడండి. వారిని వజ్రాలతో తులాభారము చేశారు. మీరు దేనితో తూకము వేస్తారు? వీరేమో అందరికంటే సుప్రీమ్‌(అత్యంత ఉన్నతమైనవారు). వీరి బరువు ఎంత ఉంటుంది? మీరు ఏమి చేస్తారు! తూకము వేస్తే ఎంత బరువు ఉంటాడు? ఏదైనా వస్తువు వీరిని తూచగలదా? శివబాబా ఏమో బిందువు కదా. ఈ రోజులలో అలా చాలా మందిని తూచుతూ ఉంటారు. కొందరు బంగారముతో, కొందరు వెండితో, కొందరు ప్లాటినమ్‌తో కూడా తూచుతారు. ప్లాటినమ్‌ బంగారు కంటే ఖరీదైనది. ఆ దేహ సంబంధమైన గురువులు మీకు సద్గతిని ఇవ్వలేరని తండ్రి అర్థం చేయిస్తారు. సద్గతిలోకి తీసుకెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే అని అర్థం చేయిస్తున్నారు. మరి వారిని దేనితో తులాభారము చేస్తారు? మనుష్యులైతే కేవలం భగవంతుడా, భగవంతుడా! అని అంటూ ఉంటారు. కానీ ఆ తండ్రి శిక్షకుడు కూడా అని వారికి తెలియదు. వారు ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో చూడండి. పిల్లల ముఖాన్ని చూచేందుకు కొంచెము పైన కూర్చుంటారు. సహాయకారులైన పిల్లలు లేకుండా నేను స్థాపన ఎలా చేయగలను? ఎవరు ఎక్కువగా సహాయము చేస్తారో వారిని బాబా తప్పకుండా ప్రేమిస్తారు. లౌకికములో కూడా ఒక కొడుకు 2 వేలు సంపాదిస్తాడు. మరొకరు వేయి రూపాయలే సంపాదించవచ్చు. మరి ఆ తండ్రికి ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాని ఈ రోజులలో అసలు పిల్లలు తండ్రిని ఎక్కడ లెక్కపెడ్తున్నారు? అనంతమైన తండ్రి కూడా ఫలానా - ఫలానా పిల్లలు చాలా మంచి సహాయకులని గమనిస్తారు. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా హర్షితమౌతారు. ఆత్మ సంతోషిస్తుంది. నేను కల్ప-కల్పము వస్తాను. పిల్లలను చూచి చాలా సంతోషిస్తాను. కల్ప-కల్పము ఈ పిల్లలు నాకు సహాయకారులుగా అవుతారని తెలుసు. ఈ బాబా ప్రేమ కల్ప-కల్పానికి నిశ్చయమైపోతుంది. ఎక్కడ కూర్చొని ఉన్నా బుద్ధిలో ఇలా ఆలోచించండి - ఈ తండ్రి మాకు తండ్రే కాక టీచరు కూడా అయ్యారు, గురువు కూడా అయ్యారు. స్వయం వారే మాకు సర్వస్వము, అందుకే అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యయుగములో ఎవ్వరూ స్మృతి చేయరు. ఎందుకంటే బాబా 21 జన్మలకు నావను ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ విధంగా స్మరిస్తూ స్మరిస్తూ పిల్లలు హర్షితమవ్వాలి. మేము ఇటువంటి తండ్రి సేవను చేయాలని సంతోషము కలగాలి. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. వీరు అనంతమైన తండ్రి, ఈ తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు. మనందరినీ తన వెంట కూడా తీసుకెళ్తారు. ఈ విధంగా అర్థము చేయిస్తే సర్వవ్యాపి అని అనలేరు. '' వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి '' అని తండ్రి చెప్పారు. వారందరూ సమాప్తమైపోతారు. పోతే మిగిలిన మీరు విజయము పొందుతారు. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలు మీరు అందరికీ వినిపించాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము సుఖదాత పిల్లలము, అందరికీ సుఖమునివ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు.
2. చదువు మరియు చదివించేవారు ఇరువురూ అద్భుతమైనవారు. ఇటువంటి అద్భుతమైన చదువును ఎప్పుడూ మిస్‌ చేయరాదు. గైర్హాజరు(ఆబ్స్‌౦టు) అవ్వరాదు. 

వరదానము :- '' జతలో ఉంటాము, జతలో జీవిస్తాము..... ఈ ప్రతిజ్ఞను స్మృతిలో ఉంచుకొనుట ద్వారా కంబైండుగా (సంయుక్తంగా) ఉండే సహజయోగీ భవ ''
పిల్లలైన మీరు జతలో ఉంటాము, జతలో జీవిస్తాము, జతలో నడుస్తాము......... ఈ ప్రతిజ్ఞను స్మృతిలో ఉంచుకొని బాప్‌ ఔర్‌ ఆప్‌(తండ్రి మరియు మీరు) కంబైండు రూపంలో ఉండండి. ఈ స్వరూపాన్ని సహజయోగి అని అంటారు. యోగము జోడించేవారు కాదు, సదా కంబైండుగా అనగా జతలో ఉండేవారు, ఈ విధంగా జతలో ఉండేవారే నిరంతర యోగులు. సదా సహయోగులు ఎగిరే కళలో వెళ్లే ఫరిస్తాలుగా అవుతారు. 

స్లోగన్‌ :- ''ప్రశ్నార్థక (ప్రశ్నించే) వంకర మార్గాన్ని తీసుకునేందుకు బదులు కళ్యాణము చేసే బిందువును ఉంచడమే కళ్యాణకారులుగా అవ్వడం.''
 

Thursday, 18 January 2018

Telugu Murli 19/01/18

19-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - పారసబుద్ధిగల వారిగా అయ్యేందుకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని మంచిరీతిగా అర్థము చేసుకోవాలి, స్వయంలో ధారణ చేసుకొని ఇతరులతో చేయించాలి''

ప్రశ్న :- ఏ ఒక్క రహస్యము చాలా గుహ్యమైనది, గోపనీయమైనది, అర్థము చేసుకోవలసినది?
జవాబు :- నిరాకార తండ్రి సర్వులకు మాతా-పితగా ఎలా అవుతారో, వారు సృష్టిని ఏ విధంగా రచిస్తారో, ఈ విషయము చాలా గుహ్యమైన, గోపనీయ రహస్యము. నిరాకార తండ్రి తల్లి లేకుండా సృష్టిని రచించలేరు. వారు శరీర ధారణ ఎలా చేస్తారో, అందులో ప్రవేశించి అతని నోటి ద్వారా పిల్లలను ఎలా దత్తత చేసుకుంటారో, ఈ బ్రహ్మ తండ్రే కాక తల్లిగా కూడా ఎలా అవుతారో - ఈ విషయాలు బాగా అర్థము చేసుకొని స్మరించవలసిన లేక స్మృతిలో ఉంచుకోవలసిన విషయము. 

పాట:- తల్లివి నీవే, తండ్రివి నీవే.......... (తుమ్‌హీ హో మాతా............)
ఓంశాంతి. ఎవరినైతే తల్లివి నీవే, తండ్రివి నీవే అని అంటారో, వారిలో తప్పకుండా తండ్రియే ఆజ్ఞను ఇస్తారు కదా. ఇక్కడ తల్లి-తండ్రి సంయుక్తము(కంబైండ్‌)గా ఉన్నారు. ఈ విషయాన్ని మనుష్యులు అర్థము చేసుకునేందుకు చాలా కష్టము. అయితే అర్థము చేసుకోవలసిన ముఖ్యమైన విషయము కూడా ఇదే. నిరాకారులైన పరమపిత పరమాత్మ ఎవరినైతే తండ్రి అని అంటారో, వారిని తల్లి అని కూడా అంటారు. ఇది అద్భుతమైన విషయము. పరమపిత పరమాత్మ మానవ సృష్టిని రచిస్తారు. కనుక రచించేందుకు తప్పకుండా తల్లి కావాలి. ఈ విషయము చాలా రహస్యమైనది. ఇతరులెవ్వరి బుద్ధిలోకి ఎప్పుడూ రాజాలదు. వారు అందరికి తండ్రి. మరి తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. ఆ తండ్రి నిరాకారులు. అయితే తల్లిగా ఎవరిని ఉంచాలి? వివాహమైతే చేసుకొని ఉండరు కదా. ఇవి చాలా గుహ్యమైన గోపనీయమైన అర్థము చేసుకోవలసిన విషయాలు. కొత్త కొత్తగా వచ్చిన వారైతే అర్థము చేసుకోలేరు. పాతవారు కూడా కష్టంగా అర్థము చేసుకొని ఆ స్మృతిలో ఉంటారు. పిల్లలే మాతా-పితల స్మృతిలో ఉంటారు కదా. భారతదేశములో లక్ష్మీనారాయణులను కూడా మీరే మాతా-పితలు,....... అని అంటారు. అలాగే రాధా-కృష్ణుల ముందుకు వెళ్లి కూడా మీరే తల్లిదండ్రులు అని అంటారు. అయితే వాస్తవానికి వారు రాకుమార-రాకుమార్తెలు(యువరాజు-యువరాణి) కావున ఏ బుద్ధిహీనుడు కూడా వారిని తల్లి - తండ్రి అని అనరు. మనుష్యులకైతే అలా అనడం అలవాటైపోయింది. అయితే ఈ విషయమే అతిభిన్నమైనది. లక్ష్మీనారాయణులనైతే వారి పిల్లలు మాత్రమే తల్లి-తండ్రి అని పిలుస్తారు. ఎవరి వద్ద చాలా ధనముంటుందో, మిద్దెలు-మహళ్లు ఉంటాయో వారు స్వర్గములో ఉన్నారని మనుష్యులు భావిస్తారు. వారి పిల్లలు మా తల్లిదండ్రుల వద్ద చాలా సుఖముందని అంటారు. తప్పకుండా వారు పూర్వ జన్మలో కొన్ని మంచి కర్మలు చేసి ఉంటారు. అచ్ఛా! నీవే తల్లివి, నీవే తండ్రివి........ అని ఎవరిని మహిమ చేస్తారో ఆ పరమపిత పరమాత్మ ఒక్కరే రచయిత. మనమంతా ఎవరి పిల్లలమో, వారు కూడా నిరాకారులే, ఆత్మలమైన మనము కూడా నిరాకారులమే. అయితే నిరాకారుడు సృష్టిని ఎలా రచిస్తారు? తల్లి లేకుండా సృష్టి రచింపబడజాలదు. ఈ సృష్టి రచన చాలా అద్భుతమైనది. ఒకటేమో పరమాత్మ నూతన ప్రపంచానికి రచయిత. పాత ప్రపంచములోకి వచ్చి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. అయితే ఎలా రచిస్తారు? ఇది చాలా రహస్యమైన విషయము. ఆ నిరాకారుని మనము మాతా - పిత అని అంటున్నాము. నేను పిల్లలను దత్తత చేసుకుంటానని తండ్రే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. గర్భము నుండి పిల్లలకు జన్మనిచ్చే విషయమే లేదు. ఇంత లెక్క లేనంత మంది పిల్లలు గర్భము నుండి ఎలా జన్మిస్తారు? కావున నేను ఈ శరీరాన్ని ధరించి ఇతని (బ్రహ్మ) నోటి ద్వారా పిల్లలను దత్తత చేసుకుంటాను. ఈ బ్రహ్మ మానవ సృష్టిని రచించే తండ్రే కాక తల్లి కూడా అవుతాడు. అతని నోటి ద్వారా పిల్లలను దత్తత చేసుకుంటాను. ఈ విధంగా పిల్లలను దత్తు తీసుకోవడం కేవలం ఒక్క తండ్రి కర్తవ్యము మాత్రమే. సన్యాసులు ఆ పని చేయలేరు. వారికి జిజ్ఞాసువులు, శిష్యులు, అనుచరులు ఉంటారు. ఇక్కడైతే ఇది రచనను గురించిన విషయము. అందువలన బాబా ఇతనిలో ప్రవేశిస్తారు. మీరంతా ముఖవంశావళివారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అని అంటారు. అందువలన మాత కూడా ఇతడే అని నిరూపించబడ్తుంది. ఆ తండ్రి ఇతనిలో ప్రవేశించి రచిస్తారు. ఈ వృద్ధుడు ప్రజాపిత అవ్వడమే కాక వృద్ధ మాత కూడా అవుతాడు. వృద్ధ తండ్రికి వృద్ధురాలే కావాలి కదా. ఇప్పుడు పిల్లలు మాతా - పితలను స్మృతి చేయవలసి వస్తుంది. ఇతనికి ఆస్తి ఏమీ లేదు. మీరు వారసులుగా అవుతారు. అందుకే వీరిని బాప్‌దాదా అని అంటారు. మీరు ప్రజాపిత బ్రహ్మ నుండి ఆస్తిని తీసుకోరు. ఈ దాదా(బ్రహ్మ) కూడా వారి నుండే తీసుకుంటాడు. ఇతడిని దాదా (అన్న) అని, మాతా అని కూడా పిలుస్తారు లేకుంటే మాతా-పితలని ఎలా నిరూపించబడ్తుంది. మాతా-పితలు లేకుండా పిల్లలెలా జన్మిస్తారు - ఇవన్నీ అర్థము చేసుకొని స్మరించే చాలా రహస్యమైన విషయాలు. బాబా మీరు తండ్రి ఈ మాత ద్వారా మేము జన్మ తీసుకున్నామని అంటారు. మాతా- పిత అన్నప్పుడు వారసత్వము కూడా తప్పకుండా గుర్తు వస్తుంది, ఆ తండ్రిని స్మృతి చేయాలి. ఈ పతిత ప్రపంచములోకి తండ్రి ఎలా వస్తారో జ్ఞానము వలన మీరు అర్థము చేసుకోగలరు. బాబా అంటున్నారు - నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడు నాకు కుమారుడే కాక మీకు తండ్రి కూడా అయ్యాడు. అంతేకాక మీ తల్లి కూడా అయ్యాడు. మీరంతా పిల్లలు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినందున వారసత్వము లభిస్తుంది. తల్లిని స్మృతి చేసినందున వారసత్వము లభించదు. నిరంతరము ఆ నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. ఇవన్నీ అర్థము చేసుకునే జ్ఞాన విషయాలు.

తండ్రి పాత ప్రపంచములోకి వచ్చి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. పాతదానిని సమాప్తము చేసేస్తారు. లేకపోతే ఎవరు సమాప్తము చేయగలరు? శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము అని గాయనము కూడా ఉంది. ఇది డ్రామాలో నిశ్చయమై ఉంది. అందువలన గాయనములో కూడా వస్తుంది. మన కొరకు నూతన రాజధాని తయారౌతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనానికి ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. మీరు ఇంతమంది ఉన్నారు అందరూ రాజ్యపదవిని పొందుకుంటున్నారు. ఏదో గుడ్డినమ్మకాలతో నమ్మేశారని కాదు. ఎవరో రాముని సీత దొంగలించబడిందని అంటే సత్యం సత్యమని అనేశారు. ఏదైనా విషయము అర్థము కాకుంటే అర్థము చేసుకునేందుకు ప్రయత్నించండి. లేకుంటే బుద్ధిహీనులు బుద్ధిహీనులుగానే ఉండిపోతారు. భక్తి మార్గములో అయితే అల్పకాలిక సుఖము లభిస్తుంది. దాని ఫలితము అదే జన్మలో లేక మరుసటి జన్మలో అల్పకాలము కొరకు లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొంత సమయము మాత్రమే పవిత్రంగా ఉంటారు. పాపాలు చేయరు. దాన-పుణ్యాలు కూడా చేస్తారు. వీటి వల్ల లభించే సుఖమును కాకిరెట్టకు సమానమని అంటారు. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు ఎందుకంటే మీరు బందర్‌(కోతి) నుండి పరివర్తనై మందిరానికి అర్హులుగా అయ్యారు. సత్యయుగములో మీరు పారసబుద్ధి గలవారిగా ఉండేవారు ఎందుకంటే అప్పుడు పారసనాథుడు, పారసనాథినీల రాజ్యముండేది. బంగారు మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే అన్నీ రాళ్ళే. పారసబుద్ధి గలవారి నుండి పత్తర్‌(రాతి) బుద్ధి గలవారిగా ఎవరు తయారు చేస్తారు? 5 వికారాలనే రావణుడు అని అంటారు. అందరూ రాతిబుద్ధి గలవారిగా అయినప్పుడే పారసబుద్ధిగా తయారు చేయు తండ్రి ఇచ్చటకు వస్తారు. ఎంత సులభంగా అర్థము చేసుకొని అర్థము చేయించగలరు! ఇది బీజము మరియు వృక్షము. మిగిలిన విస్తారమైన విషయాలు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక మీదట కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. క్లుప్తంగా ఒక్క మాటలో ''తండ్రిని స్మృతి చేయండి'' వారి నుండి వారసత్వము లభిస్తుందని అంటున్నారు. తల్లిని స్మృతి చేసే అవసరము లేదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేయండి. అంటే తప్పకుండా తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకే తల్లి నుండి జన్మ తీసుకొని ఉంటారు. అందువలన ఈ తల్లిని కూడా వదిలేయండి. దేహధారులందరినీ వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఆత్మలమైన మేము ఆత్మిక తండ్రి పిల్లలమని, మళ్లీ శారీరిక మాతా - పితలకు కూడా పిల్లలుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఈ అనంతమైన తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. భారతదేశము స్వర్గముగా ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు లేరు. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ప్రతి జన్మలో హద్దు వారసత్వము తీసుకుంటూ వచ్చారు. నరకములో ఉండేదే హద్దు వారసత్వము. స్వర్గములోని వారసత్వాన్ని హద్దు వారసత్వమని అనరు. అది అనంతమైన వారసత్వము ఎందుకంటే అనంతము అనగా మొత్తము సృష్టికి యజమానులుగా ఉంటారు. అప్పుడు ఏ ఇతర ధర్మమూ ఉండదు. హద్దు(పరిమిత) వారసత్వము ద్వాపరము నుండి ప్రారంభమౌతుంది. సత్యయుగములో బేహద్‌(అనంతమైన) వారసత్వముంటుంది. మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అచ్చట మీకు అనంతమైన సామ్రాజ్యముంటుంది. యథా రాజా రాణి తథా ప్రజా. ప్రజలు కూడా మేము ఈ సృష్టి అంతటికి యజమానులమని అంటారు. ఇప్పుడు ప్రజలు అలా మేము ఈ సృష్టికంతటికీ అధిపతులమని అనరు. ఇప్పుడు అనేక హద్దులు ఏర్పడ్డాయి. మా నీటిలోనికి మీరు రారాదు. ఈ తుంట(భాగము) మాది అని వారంటారు. అచ్చట ప్రజలు కూడా మేము విశ్వానికి అధిపతులమని అంటారు. మా మహారాజు, మా మహారాణి అయిన లక్ష్మీనారాయణులు కూడా విశ్వమంతటికి యజమానులు అని అంటారు. అచ్చట ఒకే రాజ్యముండేదని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము. అది అనంతమైన సామ్రాజ్యము. భారతదేశము ఎలా ఉండేదో ఎవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోండి అని ఇప్పుడు శిక్షణ లభిస్తున్నది. నేను కూడా(బ్రహ్మ) చెప్తున్నానంటే మనము తప్పకుండా తీసుకుంటున్నాము. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. 21 తరాల రాజ్యభాగ్యమని గాయనము కూడా ఉంది. తరము అని ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ ముసలివారైన తర్వాతనే మరణిస్తారు. అచ్చట అకాలమృత్యువు ఉండదు. మాతలు ఎప్పుడూ విధవలుగా అవ్వరు. ఏడ్చే పని, బాదుకునే పని ఉండదు. ఇచ్చటైతే ఎంతగానో ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఏడ్వవలసిన అవసరముండదు. ఇక్కడైతే పిల్లల నోరు పెద్దదిగా అవ్వాలని ఏడిపిస్తూ ఉంటారు. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. మేము ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి కల్పక్రితము వలె వారసత్వము తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాపసు వెళ్లాలి. నిరంతరము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనమౌతాయి. మన్మనాభవ అర్థము ఎంతో సులభమైనది. గీత భలే అసత్యమైనది, కాని అందులో ఎంతో కొంత సత్యము కూడా ఉంది కదా. తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఈ విధంగా కృష్ణుడైతే నన్ను స్మృతి చేయండి, మీరు నా వద్దకు రావాలని అనజాలడు కదా. పరమాత్మ ఇప్పుడు సర్వ ఆత్మలకు చెప్తున్నాడు - ఆత్మలైన మీరంతా దోమల వలె రావాలి. కావున తప్పకుండా ఆత్మ పరమాత్మ అయిన తండ్రినే అనుసరిస్తుంది. కృష్ణుడైతే దేహధారి అయిపోయాడు. అతడు ఈ విధంగా చెప్పలేడు. ఆత్మనైన నన్ను స్మృతి చేయమని అతడు చెప్పలేడు. అతని పేరే కృష్ణుడు. ఏ ఆత్మ కూడా ఇలా చెప్పలేదు. ఆత్మలంతా భాయి-భాయి. తండ్రి అంటున్నారు - నేను నిరాకారుడను, పరమాత్మ అయిన నా పేరు శివుడు. అలా కృష్ణుడు ఎలా అంటాడు? అతడికైతే తన శరీరముంది. శివబాబాకు తమ స్వంత శరీరము లేనే లేదు. శివబాబా అంటున్నారు - పిల్లలూ! మీకు కూడా మొదట మీ శరీరము లేదు. ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు. ఆ తర్వాత శరీరము తీసుకున్నారు. ఇప్పుడు మీకు డ్రామా ఆదిమధ్యాంతాల స్మృతి కలిగింది. తండ్రి ఈ సృష్టిని ఎలా, ఎప్పుడు, ఎందుకు రచిస్తారు? సృష్టి అయితే ఉంది కదా. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచించారనే గాయనము కూడా ఉంది. అందువలన తప్పకుండా పాత సృష్టి నుండే నూతన సృష్టిని రచించి ఉంటారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేశారని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - ఈ చదువు ద్వారా నేను మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. పూజ్య దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్లీ పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో మనుష్యులకు అర్థము కాదు. అందరూ 84 జన్మలు ఎలా తీసుకుంటారా? సృష్టి వృద్ధిని పొందుతూ ఉంటుంది. మరి అందరూ 84 జన్మలు ఎలా తీసుకుంటారు? తప్పకుండా వెనుక వచ్చేవారి జన్మలు తక్కువగా ఉంటాయి. 25-50 సంవత్సరాలలో 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఇది స్వదర్శన చక్రము. అయితే వారు స్వదర్శన చక్రాన్ని ఒక మారణాయుధము రూపములో తయారు చేశారు. ఇప్పుడు ఆత్మలైన మీకు 84 జన్మలు ఫలానా-ఫలానా విధంగా అనుభవించామని స్మృతి కలిగింది. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. మళ్లీ డ్రామా రిపీట్‌ అవుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మము తప్పకుండా ఉండాలి. అది ఇప్పుడు ప్రాయ: లోపమైపోయింది.

ఓ గాడ్‌ ఫాదర్‌!....... దయ చూపమని మనుష్యులు అంటారు. అందువలన తండ్రి అంటారు - అచ్ఛా మిమ్ములను దు:ఖము నుండి ముక్తులుగా చేసి సుఖీలుగా తయారు చేస్తాను. అందరినీ సుఖవంతంగా చేయడమే తండ్రి కర్తవ్యము. అందువలన నేను కల్ప-కల్పము వస్తాను. వచ్చి భారతదేశాన్ని వజ్ర తుల్యముగా తయారు చేస్తాను. చాలా సుఖవంతముగా తయారు చేస్తాను. మిగిలిన వారందరినీ ముక్తిధామములోకి పంపేస్తాను. భక్తులు భగవంతుని కలవాలని కోరుకుంటారు. ఎందుకంటే సన్యాసులు ఈ సుఖము కాకిరెట్టకు సమానమని అన్నారు. ఇంకా కొంతమంది ఈ డ్రామాలో మళ్లీ రానే రాకూడదని కూడా అంటారు. అందువలన మోక్షము పొందుకోండి అని చెప్తారు. కాని మోక్షము లభించనే లభించదు. ఇది తయారైన డ్రామా. ఈ సృష్టి చరిత్ర-భూగోళమంతా పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈ చక్రములో ఎలా తిరుగుతారో కూడా తెలుసుకున్నారు. దానినే స్వదర్శన చక్రమని అంటారు. స్వదర్శన చక్రముతో అందరి శిరస్సులను ఖండించినట్లు చూపిస్తారు. కంసవధ నాటకములో కూడా ఏది చూపిస్తారో వాస్తవానికి అటువంటిదేమీ లేదు. ఇచ్చట హింస అనే మాటే లేదు. ఈ చదువు చదువుకోవాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ఎవరినైనా హతమారుస్తారా? అది హద్దులోని వారసత్వము. ఇది అనంతమైన తండ్రి నుండి బేహద్‌ వారసత్వము తీసుకోవడం. గీతలో యుద్ధము మొదలైన వాటి విషయాలు అనేకము వ్రాసేశారు. నిజానికి అవేవీ జరగలేదు. పాండవులు ఎవరితోనూ యుద్ధము చేయరు. అలా జరగదు. ఇక్కడ యోగబలము ద్వారా అనంతమైన తండ్రి నుండి పిల్లలైన మీరు నూతన ప్రపంచము కొరకు వారసత్వము తీసుకుంటున్నారు. ఇందులో యుద్ధము మాటే లేదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి 21 తరాలకు వారసత్వము తీసుకునేందుకు నిరంతరము తండ్రిని, వారి వారసత్వాన్ని స్మృతి చేసే పురుషార్థము చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయరాదు.
2. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. మనము పూజ్యులుగా ఉండేవారము తర్వాత మళ్లీ పూజారులుగా అయ్యాము, 84 చక్రాన్ని పూర్తి చేశాము. మళ్లీ డ్రామా రిపీట్‌ అవ్వనున్నది. మనము పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి అనే స్మృతియే స్వదర్శన చక్రము. 

వరదానము :- ''సదా స్నేహ సహయోగాల ద్వారా అవినాశి రత్నాలనే బిరుదును ప్రాప్తి చేసుకునే అమర భవ''
ఎవరైతే స్థాపనా కార్యంలో సదా స్నేహీలుగా, సహయోగులుగా ఉంటారో వారికి అవినాశీ రత్నాలనే టైటిల్‌(బిరుదు) లభిస్తుంది. ఇటువంటి అవినాశీ రత్నాలను ఎప్పుడూ ఎవ్వరూ కదిలించలేరు. ఏ ఆటంకమూ ఆపలేదు. అటువంటి అవినాశీ రత్నాలే అమర భవ అనే వరదానులు. వారు రియల్‌ గోల్డ్‌గా(నిజమైన ప్యూర్‌బంగారుగా), తండ్రికి సాథీలుగా(సహయోగులుగా, స్నేహితులుగా) ఉంటారు. వారు తండ్రి కార్యాన్ని తమ స్వంత కార్యముగా భావిస్తారు. సదా జతలో ఉంటారు. అందువలన వారు అవినాశిగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''పవిత్రతను యథార్థంగా ధారణ చేస్తే, ప్రతీ కర్మ యథార్థంగా యుక్తి యుక్తంగా జరుగుతుంది''
 


Telugu Murli 18/01/18

18-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

పితాశ్రీ వారి పుణ్య స్మృతి దినమున క్లాసులో వినిపించే౦దుకు బాప్‌దాదా మధుర మహావాక్యాలు
''మధురమైన పిల్లలారా - మీ స్వభావాన్ని చాలా మధురంగా, చాలా శాంతిగా చేసుకోండి, మీ మాటలు, నడవడికలు ఎలా ఉండాలంటే, అందరూ '' వీరు దేవతల వలె ఉన్నారు '' అని అనాలి '' 

ప్రశ్న :- హృదయాన్ని శుద్ధంగా తయారు చేసుకునేందుకు ఏ ఆసక్తి ఉండాలి ?
జవాబు :- హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు స్వయాన్ని యోగులుగా చేసుకొని, ఇతరులను యోగులుగా తయారు చేయాలనే ఆసక్తి ఉండాలి. యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. ఒకవేళ దేహము పై మోహముంటే, దేహ అభిమానముంటే మా స్థితి చాలా కచ్ఛాగా (అపరిపక్వము)గా ఉందని అర్థము చేసుకోండి. దేహీ-అభిమానులుగా ఉండు పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. అందువలన దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము వీలైనంత ఎక్కువగా చేయండి, తండ్రిని స్మృతి చేయండి.  

ఓంశాంతి. ఇప్పుడు భగవంతుడు సన్ముఖములో కూర్చొని మనకు జ్ఞాన గీతాలు వినిపిస్తారని లేక జ్ఞాన డ్యాన్స్‌ చేయిస్తారని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞాన డాన్స్‌ వలన మీరు దేవతల వలె సదా సుఖంగా, హర్షితంగా ఉంటారు. అనంతమైన తండ్రి అని, విశ్వ రచయిత అని భగవంతుడినే అంటారు. మన కొరకు బాబా స్వర్గాన్ని బహుమతిగా తెచ్చారని ఆత్మకు తెలుసు. వారే రచయిత. స్వర్గానికి అధికారిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రిని, విశ్వాధికారాన్ని స్మృతి చేయమని చెప్తారు. తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన గొప్ప ప్రపంచాన్నే రచిస్తారు. పిల్లలైన మీకు విశ్వమంతా ఇల్లే అనగా పాత్రను అభినయించే స్థానము. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు, అదే స్వర్గము. అటువంటి తండ్రికి పిల్లలు ఎన్ని కృతజ్ఞతలు తెలపాలి! విశ్వ రచయిత అయిన తండ్రి నేరుగా చెప్తున్నారు - నేను మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చాను కనుక మీ స్వభావము చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలంటే అందరూ '' వీరు దేవతల వలె ఉన్నారు '' అని అనాలి. దేవతలు ప్రసిద్ధి చెందినవారు. వీరి స్వభావము పూర్తి దేవతల వలె ఉంది, మిక్కిలి మధురమైన శాంత స్వభావము గలవారని అంటారు. ఇటువంటి పిల్లలను చూచి తండ్రి కూడా సంతోషిస్తారు. బాబా స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వస్తారు. కనుక మీరు ఎంత సహాయకారులుగా అవ్వాలి. సేవలో మీ అంతకు మీరే లగ్నమైపోవాలి. నేను అలసిపోయాను, ఫుర్సత్తు(తీరిక) లేదు అని అనరాదు. సమయానికి అందరూ పని చేయడంలో కళ్యాణముంది. యజ్ఞ సేవ చేస్తే ఫలితము శివబాబా ఇస్తారు. పిల్లల దైవీ నడవడికను చూచి బలిహారమౌతారు.
మధురమైన పిల్లలూ, మనలను చదివించేవారెవరో మీకు తెలుసు. ఈ చైతన్య డబ్బీలో చైతన్యమైన వజ్రమై కూర్చొని ఉన్నారు. వారే సత్‌-చిత్‌-ఆనంద స్వరూపులు. సత్యమైన తండ్రి మీకు సత్య-సత్యమైన శ్రీమతమునిస్తారు. తండ్రి వారైనారంటే అడుగడుగునా శ్రీమతమును అనుసరించాలి. నిశ్శబ్ధముగా(మౌనంగా) ఉండి చదువుకోవాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. పదే పదే ఈ బ్యాడ్జిని చూస్తూ ఉంటే తండ్రి మరియు వారసత్వము గుర్తుకొస్తుంది. స్మృతి ద్వారానే మీరు మొత్తం విశ్వమంతటికీ శాంతిని దానము చేస్తారు. ప్రతి పుత్రుడు తన ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. ఏ మురళినీ మిస్‌ చేయరాదు. బాబా చాలా ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, మీ పై మీరు దయ చూపుకోండి, ఏ ఆజ్ఞనూ పాటించకుండా ఉండరాదు(అవజ్ఞ చేయరాదు).
తండ్రి హృదయములో పిల్లలందరినీ సదా సుఖంగా తయారు చేయాలనే ఫస్ట్‌ క్లాస్‌ ఆశ ఉంటుంది - పిల్లలు అర్హులై స్వర్గానికి అధికారులుగా అవ్వాలనే ఆశ ఉంటుంది. ఎవరైతే సుగంధభరిత పుష్పాలుగా ఉంటారో, వారు ఆకర్షిస్తారు. ఎవరు ఎటువంటివారుగా ఉంటారో అటువంటి సర్చ్‌లైట్‌ తీసుకునేందుకు ఆకర్షిస్తారు. సుగంధ భరితమైన, గుణవంతులైన పిల్లలను చూచి ప్రేమతో, సంతోషముతో కనులు చెమ్మగిల్లుతాయి. వారికేమైనా కష్టము కలుగుతే బాబా వారికి సర్చ్‌లైట్‌ ఇస్తారు.
బాబా అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, మీరు ఈ పాత ప్రపంచములో ఎలాంటి ఆశలూ ఉంచుకోరాదు. ఇప్పుడిక సుఖధామానికి వెళ్లాలనే ఒకే ఒక శ్రేష్ఠమైన ఆశ ఉంచుకోవాలి. ఇంకెక్కడా నిలబడరాదు, చూడరాదు, ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకేవైపు చూస్తూ ఉండండి. అప్పుడే చలించని, స్థిరమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమవ్వనే అవుతుంది. దీని స్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఈ సమయములో ప్రకృతికి అందరికంటే ఎక్కువ కోపము ప్రకృతికి వస్తుంది. అందువలన అన్నీ సమాప్తము చేసేస్తుంది. ఇప్పుడీ ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుందని మీకు తెలుసు. మొత్తం పాత ప్రపంచాన్నంతా ముంచేస్తుంది. భూకంపములో ఇండ్లు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి. అనేక విధాలుగా మృత్యువు సంభవిస్తుంది. ఇదంతా డ్రామా ప్లానులో తయారై ఉంది. ఇందులో ఎవ్వరి దోషమూ లేదు. వినాశనమైతే జరిగే తీరాలి. అందువలన మీరు ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. మీరేమో మీ సర్వస్వము ఇన్‌ష్యూర్‌ చేసేశారు కనుక మీకు ఎలాంటి చింతా లేదు. మీ సర్వస్వమూ సఫలమౌతూ ఉంది.
ఇప్పుడు మీరు ''వాహ్‌! సద్గురూ వాహ్‌!'' అని అంటారు. ఆ సద్గురువు మనకు ఈ దారి తెలిపించారు. ''వాహ్‌! నా భాగ్యము వాహ్‌!'' ''వాహ్‌! డ్రామా వాహ్‌!''. మీ హృదయము నుండి - ''థాంక్స్‌(ధన్యవాదాలు) బాబా, మీరు మా నుండి పిడికెడు అటుకులు తీసుకొని మాకు భద్రంగా భవిష్యత్తులో నూరు రెట్లు రిటర్న్‌ ఇస్తారు అయితే ఇందులో కూడా పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. పిల్లలకు అపారమైన జ్ఞాన ధన ఖజానా లభిస్తూ ఉంటే అపారమైన ఖుషీ ఉండాలి కదా. వారి హృదయము ఎంత శుద్ధంగా ఉంటుందో, ఇతరులను కూడా అంత శుద్ధంగా చేస్తారు. యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యి యోగులుగా చేసే ఆసక్తి ఉండాలి. ఒకవేళ దేహములో మోహము, దేహాభిమానము ఉంటే మా స్థితి చాలా కచ్ఛాగా ఉందని అర్థము చేసుకోండి. దేహి-అభిమానులుగా ఉన్న పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. అందువలన ఎంత ఎక్కువగా వీలైతే అంత దేహి-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బాబా అనే పదము అన్నిటికంటే ఎక్కువ మధురమైనది. తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పల పై కూర్చోబెట్టుకొని(క్షేమంగా) వెంట తీసుకెళ్తారు. ఇటువంటి తండ్రి స్మృతి అను నషాలో చూర్ణమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంతోషములో మునిగిపోవాలి. తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారము చేస్తారో - అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. సుఖదాతలుగా అవ్వండి.
పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా ఎంత గొప్ప సంపాదన చేస్తారు! మీరు పదమాపతులుగా అవుతారు. బాబా మిమ్ములను ఎంత ధనవంతులుగా చేస్తారు! తండ్రి మిమ్ములను ఎంత తరగని ఖజానాలతో తూచుతారంటే 21 జన్మలు ఆ ఖజానాలు మీ వెంటనే ఉంటాయి. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. ఎప్పుడూ అకాలమృత్యువు పాలు కారు. మృత్యువుతో ఎప్పుడూ భయపడరు. ఇక్కడ ఎంతగానో భయపడ్తారు, ఏడుస్తారు. ఈ పాత శరీరాన్ని వదిలేసి వెళ్లి కొత్త ప్రపంచములో రాకుమారులుగా అవుతామని మీకు సంతోషముంది. మీరు ఈ పాత ప్రపంచము పై మమకారాన్ని తొలగిస్తూ ఈ దేహమును కూడా మర్చిపోతూ వెళ్లండి. మేము ఆత్మలము, స్వతంత్రులము. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. జీవించి ఉండే మరణించిన స్థితిలో ఉండాలి. ఈ ప్రపంచము నుండి మరణించారు. మీరు మరణిస్తే ప్రపంచము మరణించిందని అంటారు కదా(ఆప్‌ ముయే మర్‌ గయీ దునియా). శరీర భావమును తొలగిస్తూ ఉండండి. ''బాబా ఇక చాలు, ఇప్పుడు మేము మీ ఒడిలోకి వచ్చేస్తాము'' అని ఏకాంతముగా కూర్చొని అభ్యాసము చేయండి. ఒక్కరి స్మృతిలోనే శరీరము అంతమవ్వాలి - దీనినే ఏకాంతము అని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా రహస్యము కూడా తెలుసు. తండ్రి మిమ్ములను నిరాకార, ఆకార, సాకార ప్రపంచాల సమాచారమంతా వినిపిస్తారు. ఆత్మ చెప్తుంది - '' ఇప్పుడు మేము నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నాము.'' స్వర్గములోకి వెళ్లేందుకు తప్పకుండా అర్హులుగా అవుతాము. మా కళ్యాణము, ఇతరుల కళ్యాణమును చేస్తాము. అచ్ఛా - తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - తండ్రి దు:ఖహర్త - సుఖకర్త కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమునివ్వాలి. తండ్రికి కుడి భుజముగా(రైట్‌ హ్యాండ్‌గా) అవ్వాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు. శుభకార్యములో కుడిచేతినే ఉపయోగిస్తారు. కనుక తండ్రి చెప్తున్నారు - ప్రతి కార్యములో న్యాయయుక్తముగా అవ్వండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే అంతమతి సో గతి అయిపోతుంది. ఈ పాత ప్రపంచము పై మమకారాన్ని తొలగించండి. ఇది శ్మశానమైపోయింది. వృత్తి, వ్యాపారాలు, పిల్లలు మొదలైనవాటి చింతలో మరణిస్తే అనవసరంగా స్వయం మీరే నష్టపోతారు. శివబాబాను స్మృతి చేస్తే మీరు చాలా లాభపడ్తారు. దేహాభిమానము వలన చాలా నష్టము వాటిల్లుతుంది. దేహీ-అభిమానులుగా అవుతే లాభపడ్తారు. ధనము పై కూడా ఎక్కువ ఆశ ఉంచుకోరాదు. అదే చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు. సర్వమూ తండ్రికి సమర్పించి శ్రీమతమును ఎంతగా అనుసరిస్తున్నారో శివబాబా చూస్తారు. ప్రారంభములో తండ్రి(బ్రహ్మాబాబా) కూడా ట్రస్టీగా ఉండి చూపించారు కదా. సర్వమూ ఈశ్వరార్పణ చేసి స్వయం ట్రస్టీగా అయిపోయాడు. ఈశ్వరుని కార్యములోనే ఉపయోగించాలి. విఘ్నాలకు ఎప్పుడూ భయపడరాదు. వీలైనంత వరకు సేవలో మీ సర్వస్వము సఫలము చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. అచ్ఛా. 

సృష్టి పరివర్తనకు ఆధారము - సంఘటిత రూపంలో అందరి సంకల్పమూ ఒక్కటిగానే ఉండాలి
(అవ్యక్త మహావాక్యాలు) - 1975
సంఘటిత రూపముతో బ్రాహ్మణులందరిలో దయా భావన, విశ్వకళ్యాణ భావన, సర్వ ఆత్మలను దు:ఖాల నుండి విడుదల చేసే శుభ కామనలు ఎంతవరకు ప్రతి ఒక్కరి హృదయము నుండి ఉత్పన్నము అవ్వవో అంతవరకు విశ్వపరివర్తన కార్యము ఆగి ఉంటుంది. ఇప్పుడు సంఘటిత రూపంలో ఒక్క సంకల్పాన్ని చేయండి. అనగా దృఢ సంకల్పమనే సహయోగాన్ని అందరూ కలిసి ఇవ్వండి. అప్పుడు ఈ కలియుగ పర్వతాన్ని పరివర్తన చేసి బంగారు ప్రపంచాన్ని తీసుకు రాగలరు.
కనుక మా ఈ సంఘటన ఒకే సంకల్పము గలదిగా ఎంతవరకు తయారయ్యింది అని చెక్‌ చేసుకోండి. శాస్త్రాలలో బ్రహ్మకు సృష్టి రచించాలనే సంకల్పము కలిగినప్పుడు సృష్టి రచింపబడిందని వ్రాయబడింది. ఇక్కడ కేవలం ఒక్క బ్రహ్మ మాట కాదు. బ్రహ్మ సహితంగా బ్రాహ్మణులందరికి ఒకే సంకల్పము కలగాలి - ఇప్పుడు మేమందరమూ ఎవరెడీగా ఉన్నాము, నూతన ప్రపంచము స్థాపనయ్యే తీరాలి లేక అవ్వనే అవుతుంది - ఇటువంటి దృఢ సంకల్పము ఎప్పుడైతే బ్రాహ్మణులందరిలో ఉత్పన్నమవుతుందో అప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది అనగా నూతన సృష్టి రచన ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది. ఇందులో కూడా సంఘటన బలము అవసరము. ఒకరిద్దరు లేక కేవలం ఎనిమిది మందిది కాదు, మొత్తం సంఘటనలో ఒకే సంకల్పము కావాలి. సంకల్పము ద్వారా సృష్టి రచన జరుగుతుంది. దీని రహస్యము ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే అందరిలో సంకల్పము ఉత్పన్నమవుతుందో అప్పుడు ఒక సెకండులో సమాప్తి ఢంకా మ్రోగడం ప్రారంభమైపోతుంది.
ఒకవైపు సమాప్తి ఢంకా, రెండవ వైపు నూతన ప్రపంచ దృశ్యము జత జతలో కనిపిస్తుంది. అక్కడే వినాశనము అతిగా జరుగుతుంది. అక్కడే జలమయము మధ్య నలువైపులా వినాశనములో ఒక భాగము భూమి, మిగిలిన 3 భాగాలు జలము కనిపిస్తుంది. వెనుక వచ్చిన అనేక ధర్మాల కారణంగా అనేక ఖండాలు ఏవైతే తయారయ్యాయో అవన్నీ సమాప్తమైపోతాయి. కొన్ని దేశాలు ఒక విహార స్థలము రూపంలో నీటి మధ్యలో ఒక ద్వీపము వలె అయిపోతాయి. కనుక ఒకవైపు అతి వినాశనము జరిగే ఢంకా మోగుతుంది. రెండవ వైపు మొదటి రాకుమారుడు(శ్రీకృష్ణుడు) జన్మించిన శబ్ధము పెద్దగా వ్యాపిస్తుంది. శ్రీకృష్ణుడు రావి ఆకు పై రాడు. జలమయం తర్వాత ఆకు పైన శ్రీకృష్ణుడు వచ్చాడని చూపిస్తారు కదా. దీని రహస్యము కూడా ఉంది. భారతదేశము ఫరిస్తాన్‌గా అయినప్పుడు 3 భాగాలు జలమయమైన కారణంగా దానిని జలమయంగా చూపించారు. ఇటువంటి జలమయము మధ్య మొదటి ఆకు ఎవరైతే ఫస్ట్‌ ఆత్మగా ఉంటారో, వారి జన్మ స్థలానికి నలువైపులా ఫస్ట్‌ రాకుమారుడు ప్రత్యక్షమైపోయాడు, వారి జన్మ జరిగిందనే శబ్ధము ప్రసిద్ధమైపోతుంది. కనుక అది కూడా అతిగా జరుగుతుంది. అనగా 3 భాగాలు జలమయమైన దృశ్యము కనిపిస్తుంది. ఒక భాగముగా భారతదేశము స్వర్గము రూపంలో ప్రకటితమవుతుంది. దానినే బంగారు ద్వారక నీటి నుండి వెలువడింది అని చూపిస్తారు. కాని నీటి నుండి రాదు. 3 భాగాలు నీరు ఉంటుంది. ఆ నీటి మధ్య బంగారు ద్వారక కనిపిస్తుంది. అందువలన బంగారు ద్వారక నీటి నుండి బయటకు వచ్చిందని చూపిస్తారు. ఆ సమయంలోనే ఫస్టు ఆత్మ జన్మించిన జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇటువంటి దృశ్యము కనిపిస్తోందా? కనుక పాత ప్రపంచ మహావినాశనమయ్యే ఢంకా, కొత్త ఫస్ట్‌ రాకుమారుని జన్మ దృశ్యము జత జతలో కనిపిస్తుంది. ఎలాగైతే ఢంకా మోగించేందుకు ముందు ఢంకాను వేడి చేస్తారు. అప్పుడు శబ్ధము గట్టిగా వ్యాపిస్తుంది. అలాగే ఇది కూడా ఢంకా మోగేందుకు ముందే యోగాగ్ని ద్వారా తయారవ్వాలి. అప్పుడు ఢంకాలోని శబ్ధము గట్టిగా వినిపిస్తుంది. ఈ ఏర్పాటులో లగ్నమై ఉన్నారు కదా. వేచి ఉండేవారిని కూడా ఏర్పాట్లలో ఉపయోగించండి. అప్పుడు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి.
ఎప్పుడైతే శరీరాన్ని నడిపించడం వచ్చేస్తే అప్పుడు రాజ్యాన్ని నడిపించడం కూడా వచ్చేస్తుంది. శరీరాన్ని నడిపించడం అనగా రాజ్యము చేయడం. కనుక రాజ్యము చేసే సంస్కారాన్ని నింపుకోవాలి కదా. నాలెడ్జ్‌ఫుల్‌ అని అంటారు కదా. కనుక ఫుల్‌ నాలెడ్జ్‌ అనగా తనువు, మనసు, ధనము, జనము అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ దాని గురించిన నాలెడ్జ్‌ తక్కువగా ఉండినా నాలెడ్జ్‌ఫుల్‌ అని అనరు. అర్థమయ్యిందా? సదా సఫలతా మూర్తులుగా అయ్యేందుకు ఆధారము కూడా నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండడమే. నాలెడ్జ్‌ లేకుంటే సఫలతా మూర్తులుగా కూడా అవ్వలేరు. సమయానుసారము పురుషార్థ వేగము తీవ్రంగా ఉండాలి. సమయ వేగము ఎక్కువగా ఉండి నడిచేవారి వేగము ఢీలాగా ఉంది. కనుక సమయానికి ఎలా చేరగలరు? ఒకే బలము, ఒకే నమ్మకము - ఇదే ముఖ్యమైన సబ్జక్టు. ప్రతీ సమయంలో ఒక్కరి స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థములో సదా సఫలంగా ఉంటే గమ్యానికి చేరుకుంటారు. ఎవరైతే స్థిరమైన స్నేహంలో ఉంటారో, వారికి సహయోగము కూడా స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. మురళి అనగా లాఠీ వంటిది. దీని ఆధారముతో ఏదైనా లోపముండినా అది పూర్తి అవుతుంది. ఈ ఆధారమే మన ఇంటి వరకు, మన రాజ్యము వరకు చేరుస్తుంది. కాని లక్ష్యముండాలి. నియమానుసారము కాదు, లగ్నముతో మురళి చదవడం లేక వినడం అనగా మురళీధరుని లగ్నములో ఉండడం. మురళీధరునితో స్నేహానికి గుర్తు మురళి. మురళితో ఎంత స్నేహముందో అంత మురళీధరుని పై కూడా స్నేహముందని భావించండి. సత్యమైన బ్రాహ్మణులను మురళితో గుర్తించవచ్చు. మురళి పై లగ్నముంటే వారు సత్యమైన బ్రాహ్మణులని అర్థము. లగ్నము తక్కువగా ఉంటే వారు హాఫ్‌కాస్ట్‌ బ్రాహ్మణులు. 

వరదానము :- ''మస్తకం మధ్యలో సదా తండ్రి స్మృతిని ఎమర్జ్‌గా(ఉత్పన్నంగా) ఉంచుకొను మస్తకమణి భవ''
మస్తకమణి అనగా మస్తకంలో సదా తండ్రి స్మృతి ఉండేవారు. దీనినే ఉన్నతమైన స్థితి అని అంటారు. స్వయాన్ని సదా ఇటువంటి ఉన్నతమై స్థితిలో స్థితమై ఉండే శ్రేష్ఠమైన ఆత్మగా భావించి ముందుకు వెళ్తూ ఉండండి. ఎవరైతే ఈ ఉన్నతమైన స్థితిలో ఉంటారో, వారు క్రింద ఉండే అనేక ప్రకారాలైన విషయాలను సులభంగా దాటుకుంటారు. సమస్యలు క్రింద ఉండిపోతాయి, స్వయం పైన ఉంటారు. మస్తకమణి ఉండే స్థానమే ఉన్నతమైన మస్తకము. అందువలన క్రిందికి రాకండి. సదా పైనే ఉండండి. 

స్లోగన్‌ :- ''చింతలేని చక్రవర్తి స్థితిని అనుభవం చేయాలంటే 'నాది' ని ' నీది ' లోకి పరివర్తన చేయండి''
 

Telugu Murli 17/01/18

17-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు అనంతమైన పక్కా సన్యాసులుగా అవ్వాలి, ఏ వస్తువులోనూ లోభ వృత్తిని ఉంచుకోరాదు'' 

ప్రశ్న :- తండ్రి నుండి శక్తిని ప్రాప్తి చేసుకునేందుకు పిల్లలైన మీరు అన్నిటికంటే ఏ మంచి కర్మను చేస్తారు ?
జవాబు :- తండ్రికి తమ సర్వస్వాన్ని(తనువు, మనసు, ధనము సహితంగా) అర్పణ చేయడమే అన్నిటికన్నా మంచి కర్మ. మీరు మీ సర్వస్వాన్ని అర్పణ చేసినప్పుడు తండ్రి అందుకు ప్రతిఫలంగా విశ్వమంతటి పై సుఖ-శాంతుల స్థిరమైన అఖండ రాజ్యాన్ని పాలన చేయు శక్తిని మీకిస్తారు. 

ప్రశ్న :- ఏ మనుష్యులూ నేర్పించలేని ఏ సేవ తండ్రి తన పిల్లలైన మీకు నేర్పించారు ? 
జవాబు :- ఆత్మిక సేవ. ఆత్మలైన మీరు మనుష్యులను వికారాల జబ్బు నుండి విడిపించేందుకు జ్ఞాన ఇంజక్షన్‌ ఇస్తున్నారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మనుష్యులు దైహిక సేవ చేస్తారు. కాని జ్ఞాన ఇంజక్షన్‌ వేసి ఆత్మను వెలిగే జ్యోతిగా తయారు చేయలేరు. ఈ సేవను ఒక్క తండ్రి మాత్రమే పిల్లలకు నేర్పిస్తారు. 

ఓంశాంతి. భగవానువాచ - మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరాదని అర్థం చేయించబడింది. ఇది మనుష్య సృష్టి. బ్రహ్మ-విష్ణు-శంకరులు సూక్ష్మవతనములో ఉంటారు. శివబాబా ఆత్మల అవినాశి తండ్రి. వినాశి శరీరమునకు తండ్రి కూడా వినాశియే. ఇది అందరికీ తెలుసు. మీ వినాశీ శరీరానికి తండ్రి ఎవరు? ఆత్మకు తండ్రి ఎవరు? అని అడగడం జరుగుతంది. ఆత్మల తండ్రి పరంధామములో ఉంటారని ఆత్మకు తెలుసు. పిల్లలైన మిమ్ములను దేహాభిమానులుగా ఎవరు చేశారు? దేహాన్ని రచించినవారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేస్తారు? ఆత్మల అవినాశి తండ్రి చేస్తారు. అవినాశి అనగా వారికి ఆదిమధ్యాంతాలు లేవు. ఒకవేళ ఆత్మ మరియు పరమాత్మల ఆదిమధ్యాంతాలను చెప్పినట్లయితే తర్వాత రచన ప్రశ్న కూడా తలెత్తుతుంది. వారిని అవినాశి ఆత్మ. అవినాశి పరమాత్మ అని అంటారు. ఆత్మ పేరు ఆత్మయే. తప్పకుండా ఆత్మకు '' నేను ఆత్మను '' అని తెలుసు. నా ఆత్మను దు:ఖపెట్టకండి అని అంటారు. నేను పాపాత్మను అని ఆత్మనే చెప్తుంది. స్వర్గములో ఆత్మలు ఈ మాటలు ఎప్పుడూ చెప్పవు. ఈ సమయములోనే ఆత్మ పతితంగా ఉంది. మళ్లీ అది పావనంగా అవుతుంది. పతిత ఆత్మయే పావన ఆత్మను మహిమ చేస్తుంది. మనుష్యాత్మలు ఎంతమంది ఉన్నారో వారందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇవన్నీ కొత్త విషయాలు. లేస్తూ, కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి,....... అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఇంతకుముందు మీరు పూజారులుగా ఉండేవారు. శివాయ నమ: అని అనేవారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - పూజారులైన మీరు నమ: అని చాలాసార్లు నమస్కరించారు. ఇప్పుడు మిమ్ములను యజమానులుగా, పూజ్యులుగా తయారు చేస్తాను. పూజ్యులకు ఎప్పుడూ నమస్కరించవలసిన అవసరం ఉండదు. పూజారులు నమ: అనగా నమస్తే అని అంటారు. నమస్తే అంటే నమస్కరించడమే. తప్పనిసరిగా భుజాలు కొద్దిగా క్రిందికి వంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు నమస్కరించే అవసరము లేదు. లక్ష్మీ నారాయణ నమ:, విష్ణు దేవతాయ నమ:, శంకర దేవతాయ నమ: అని అనే అవసరము లేదు. ఈ పదాలే పూజారీ స్థితిలోనివి. ఇప్పుడు మీరు పూర్తి సృష్టి పై అధికారులుగా అవ్వాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారు సర్వ సమర్థులని మృత్యువుకే మృత్యువని, అకాలమూర్తి అని, సృష్టి రచయిత అని జ్యోతిర్బిందు స్వరూపుడని కూడా అంటారు. ఇంతకుముందు వారిని చాలా మహిమ చేసేవారు. తర్వాత మళ్లీ సర్వవ్యాపి అని, కుక్కలోనూ, పిల్లిలోనూ ఉన్నారని అనేవారు. దీనితో పూర్తి మహిమ అంతా సమాప్తమైపోతుంది. ఈ సమయములోని మనుష్యులందరూ పాపాత్మలే అయినప్పుడు జంతువులకు మహిమ ఏముంటుంది? విషయమంతా మనుష్యులదే. నేను ఆత్మను. ఇది నా శరీరమని ఆత్మయే చెప్తుంది. ఎలాగైతే ఆత్మ బిందువో, అలా పరమపిత పరమాత్మ కూడా బిందువే. నేను పతితలను పావనంగా చేసేందుకు సాధారణ శరీరములో వస్తాను. వచ్చి పిల్లలకు విధేయుడైన సేవకుడనై సేవ చేస్తాను. నేను ఆత్మిక సమాజ సేవకుడను, పిల్లలైన మీకు కూడా ఆత్మిక సేవ చేయడం నేర్పిస్తానని బాబా చెప్తున్నారు. మిగిలిన వారంతా దేహ సంబంధమైన హద్దులోని భౌతిక సేవ చేయడం నేర్పిస్తారు. మీది ఆత్మిక సేవ అందుకే జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు......... అని చెప్తారు. సత్యమైన సద్గురువు వారొక్కరే. వారే అథారిటి. ఇప్పుడు వారు వచ్చి ఆత్మలందరికీ ఇంజెక్షన్‌ వేస్తారు. ఆత్మలలోనే వికారాల జబ్బు ఉంది. ఈ జ్ఞాన ఇంజెక్షన్‌ వేరెవ్వరి వద్ద ఉండదు. ఇంజెక్షన్‌ వేసేందుకు పతితంగా అయ్యింది ఆత్మయే, శరీరము కాదు. పంచ వికారాల జబ్బు చాలా బలమైన కఠినమైన రోగము. దీనికి అవసరమైన ఇంజెక్షన్‌ జ్ఞానసాగరులైన తండ్రి వద్ద తప్ప ఇంకెవరి వద్దా లేదు. తండ్రి వచ్చి ఆత్మలతో మాట్లాడ్తారు - ఓ ఆత్మలారా! మీరు వెలిగే జ్యోతులుగా ఉండేవారు. తర్వాత మాయ మీ పై తన నీడ వేసింది. అలా నీడను వేస్తూ వేస్తూ మిమ్ములను అంధకార(మంద బుద్ధిగలవారు) బుద్ధి గలవారిగా చేసేసింది. అంతేకాని ఏ యుధిష్టరుడు మరియు దృతరాష్ట్రుల మాట లేదు. ఇది రావణుని విషయము.

తండ్రి అంటున్నారు - నేను సాధారణ రీతిగానే వస్తాను. నన్ను ఎవరో కొందరు మాత్రమే అరుదుగా తెలుసుకోగలరు. శివజయంతి వేరు, కృష్ణ జయంతి వేరు. పరమపిత పరమాత్ముడైన శివుని కృష్ణునితో కలిపేందుకు వీలు లేదు. వారు నిరాకారులు, వీరు సాకారి. తండ్రి చెప్తారు - నేను నిరాకారుడను. ఓ పతితపావనా! వచ్చి ఈ భారతదేశాన్ని మళ్లీ సత్యయుగీ దైవీ రాజస్థానంగా చేయమని నా మహిమను గానము కూడా చేస్తారు. ఏదో సమయములో దైవీ రాజస్థానము ఉండేది. ఇప్పుడది లేదు. మళ్లీ ఎవరు స్థాపన చేస్తారు? పరమపిత పరమాత్మయే బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడిది పతితమైన ప్రజల పై ప్రజా రాజ్యము. దీని పేరే శ్మశానవాటిక. మాయ అలా సమాప్తము చేసేసింది. ఇప్పుడు మీరు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరిచి తండ్రినైన నన్ను స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము భలే కర్మలు కూడా చేయండి. ఏ కొద్దిగా సమయము లభించినా నన్ను స్మృతి చేసే పురుషార్థము చేయండి. మీకు ఈ ఒక్క యుక్తినే తెలిపిస్తాను. మీకు అమృతవేళలో అన్నివేళల కన్నా నా స్మృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది శాంతమైన శుద్ధమైన సమయము. ఆ సమయంలో దొంగలు దొంగతనము చేయరు. ఎవ్వరూ పాపము చేయరు. ఎవ్వరూ వికారాలలోకి వెళ్ళరు. నిద్రించే సమయములోనే ఇవన్నీ ప్రారంభిస్తారు. దానిని ఘోర తమోప్రధానమైన రాత్రి అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలారా! గతము గతించిపోయింది. భక్తి మార్గములోని ఆట పూర్తయ్యింది. ఇది మీ అంతిమ జన్మ అని ఇప్పుడు మీకు అర్థం చేయించబడ్తుంది. సృష్టి ఎలా వృద్ధి అవుతుంది అను ప్రశ్న ఉత్పన్నము కాజాలదు. ఎందుకంటే వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది. ఏ ఆత్మలైతే పైన ఉన్నారో వారు క్రిందికి రావాల్సిందే. అందరూ వచ్చేసినప్పుడు వినాశనము ప్రారంభమౌతుంది. తర్వాత నంబరువారుగా అందరూ వెళ్లాల్సిందే. మార్గదర్శకులు అందరికన్నా ముందు ఉంటారు కదా.

తండ్రిని ముక్తిదాత, పతితపావనుడని అంటారు. స్వర్గమే పావన ప్రపంచము దానిని తండ్రి తప్ప వేరెవ్వరూ తయారు చేయలేరు. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతానుసారము భారతదేశానికి తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేస్తారు. గాంధీగారు కోరుకునేవారు కాని చేయలేకపోయారు. డ్రామా రచనయే అలా ఉండినది. అది గడచిపోయింది. పతిత రాజుల రాజ్యము సమాప్తము కావలసి ఉంది. కనుక వారి పేరు-గుర్తులే సమాప్తమైపోయాయి. వారి సంపదకు కూడా నామ-రూపాలు లేవు. లక్ష్మీ నారాయణులు స్వర్గాధికారులుగా ఉండేవారని స్వయమూ భావించేవారు. కాని వారిని అలా ఎవరు తయారు చేశారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా స్వర్గ రచయిత అయిన తండ్రి నుండియే వారసత్వము లభించి ఉంటుంది. ఇతరులెవ్వరూ ఇంత గొప్ప వారసత్వాన్ని ఇవ్వడానికి సాధ్యము లేదు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. గీతలో ఉంది కాని పేరు మార్చివేశారు. కౌరవులు మరియు పాండవులు ఇరువురికీ రాజ్యాన్ని చూపిస్తారు. కాని ఇక్కడ ఇరువురికీ రాజ్యము లేదు. ఇప్పుడు తండ్రి మళ్లీ స్థాపన చేస్తారు. పిల్లలైన మీలో ఖుషీ స్థాయి పెరగాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. ఇప్పుడు మనము వెళ్తున్నాము. మనము మధురమైన ఇంటిలో ఉండేవారము. ఫలానావారు నిర్వాణులయ్యారు లేక జ్యోతి జ్యోతిలో లీనమైపోయింది లేక మోక్షాన్ని పొందారని వారంటారు. భారతవాసులకు స్వర్గమంటే మధురమనిపిస్తుంది. వారు స్వర్గస్థులయ్యారని అంటారు. మోక్షమునైతే(ముక్తి) ఎవ్వరూ పొందరని తండ్రి అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతిదాత తండ్రి మాత్రమే. వారు తప్పకుండా అందరికీ సుఖమునే ఇస్తారు. ఒకరు నిర్వాణధామములో కూర్చొని, ఒకరు దు:ఖాన్ని అనుభవించడం ఇది తండ్రి సహించలేరు. తండ్రి పతితపావనులు. ఒకటి ముక్తిధామము పావనమైనది. మరొకటి జీవన్ముక్తిధామము పావనమైనదే. మళ్లీ ద్వాపరము తర్వాత అందరూ పతితులుగా అయిపోతారు. పంచ తత్వాలు మొదలైనవన్నీ తమోప్రధానంగా అయిపోతాయి. మళ్లీ తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. మళ్లీ అక్కడ పవిత్ర తత్వాల ద్వారా మీ శరీరము సుందరంగా తయారౌతుంది. సహజ సౌందర్యము ఉంటుంది. వారిలో ఆకర్షణ ఉంటుంది. కృష్ణునిలో ఎంత ఆకర్షణ ఉంది! దాని పేరే స్వర్గము. మరి ఇంకేమిటి? అకాలమూర్తి....... అని పరమాత్మను చాలా మహిమ చేస్తారు. మళ్లీ వారిని రాళ్ళు-రప్పలలో పడేశారు. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు బాబా వస్తారో అప్పుడు వారే అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి కూడా పిల్లలను రచించినప్పుడే తండ్రి జీవితచరిత్ర గురించి వారికి తెలుస్తుంది. తండ్రి లేకుండా పిల్లలకు తండ్రి జీవితచరిత్ర గురించి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తారు - లక్ష్మీ నారాయణులను వరించాలంటే శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా జబర్‌దస్త్‌(గొప్ప) లక్ష్యము. చాలా గొప్ప సంపాదన. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. పవిత్ర రాజస్థానము ఉండేది. అదే ఇప్పుడు అపవిత్రమైపోయింది. అందరూ వికారులుగా అయిపోయారు. ఇది ఆసురీ ప్రపంచము. చాలా అవినీతి(కరప్షన్‌) ఏర్పడి ఉంది. రాజరికములో అయితే శక్తి కావాలి. ఈశ్వరీయ శక్తి అయితే అసలు లేనే లేదు. ప్రజల పై ప్రజా రాజ్యముంది. ఎవరైతే దాన-పుణ్యాలు, మంచి కర్మలు చేస్తారో వారికి రాజ కుటుంబములో జన్మ లభిస్తుంది. ఆ కర్మల శక్తి వారిలో ఉంటుంది. ఇప్పుడైతే మీరు చాలా శ్రేష్ఠమైన కర్మలు చేస్తారు. మీరు మీ సర్వస్వాన్ని(తనువు, మనస్సు, ధనములను) శివబాబాకు అర్పణ చేస్తారు. కనుక శివబాబా కూడా తన సర్వస్వాన్ని పిల్లలకు అర్పణ చేయవలసి వస్తుంది. మీరు వారి నుండి శక్తిని ధారణ చేసి సుఖ-శాంతుల అఖండమైన, స్థిరమైన రాజ్య పాలన చేస్తారు. ప్రజలలో అయితే ఎలాంటి శక్తి లేదు. ధనము దానము చేసినందున ఎమ్‌.ఎల్‌.ఎ మొదలైన పదవి లభించిందని అనరు. ధనాన్ని దానము చేసినందున ధనవంతుల ఇంటిలో జన్మ లభిస్తుంది. ఇప్పుడైతే ఏ రాజరికమూ లేదు. ఇప్పుడు బాబా మీకు ఎంత శక్తినిస్తారు! మేము నారాయణుని వరిస్తాము. మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరంటారు. ఇవన్నీ కొత్త-కొత్త విషయాలు. నారదుని విషయము ఇప్పటిదే. రామాయణము మొదలైనవి కూడా ఈ సమయములోనివే. సత్య-త్రేతా యుగాలలో ఏ శాస్త్రాలూ ఉండవు. అన్ని శాస్త్రాలకు ఈ సమయముతోనే సంబంధము ఉంది. వృక్షాన్ని చూస్తే మఠాలు, మార్గాలన్నీ తర్వాత వస్తాయి. ముఖ్యమైనది బ్రాహ్మణ వర్ణము, దేవతా వర్ణము, క్షత్రియ వర్ణము......... బ్రాహ్మణుల జుట్టు(శిఖ) ప్రసిద్ధమైనది. ఈ బ్రాహ్మణుల వర్ణము సర్వ శ్రేష్ఠమైనది. కాని దీనిని గురించి శాస్త్రాలలో వర్ణించలేదు. విరాట రూపములో కూడా బ్రాహ్మణులను తీసేశారు. డ్రామాలో అలా నిర్ణయించబడింది. భక్తి ద్వారా క్రిందికి దిగజారుతామని ప్రపంచము వారికి అర్థం కాదు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని వారు అంటారు. చాలా పిలుస్తారు. దు:ఖములో స్మరణ చేస్తారు. ఇందులో మీరు అనుభవజ్ఞులు. అక్కడ దు:ఖము మాటే లేదు. ఇక్కడ అందరిలో క్రోధముంది. ఒకరినొకరు నిందించుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారు.

ఇప్పుడు మీరు శివాయ నమ: అని అనరు. శివుడైతే మీ తండ్రి కదా. తండ్రి సర్వవ్యాపి అని అనడం వలన భ్రాతృత్వపు మాటే ఉండదు. హిందూ - చీనీ భాయి-భాయి(సోదరులు), చీనీ- ముస్లిమ్‌ భాయి-భాయి(సోదరులు) అని భారతదేశములో చాలా బాగా అంటూ ఉంటారు. అందరూ సోదరులే కదా. అందరూ ఒక్క తండ్రి సంతానమే. మేము ఒక్క తండ్రి సంతానమేనని ఇప్పుడు మీకు తెలుసు. ఈ బ్రాహ్మణుల వంశము మళ్లీ స్థాపన అవుతోంది. ఈ బ్రాహ్మణ ధర్మము నుండి దేవీ దేవతా ధర్మము వెలువడ్తుంది. దేవీ దేవతా ధర్మము నుండి క్షత్రియ ధర్మము, క్షత్రియ ధర్మము నుండి మళ్లీ ఇస్లామ్‌ ధర్మము...... వెలువడ్తాయి. వంశ వృక్షము కదా. తర్వాత మళ్లీ బౌద్ధులు, క్రైస్తవులు వెలువడ్తారు. ఇలా వృద్ధి అవుతూ అవుతూ ఇంత పెద్ద వృక్షమైపోయింది. ఇది బేహద్‌(అనంతమైన) వంశ వృక్షము. అది హద్దులోనిది. విస్తారమైన ఈ విషయాలు ఎవరికైతే ధారణ చేసుకునేందుకు సాధ్యము కాదో, వారి కొరకు తండ్రి సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు - తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేయండి. అలా చేస్తే స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కాని ఉన్నత పదవిని పొందాలంటే అందుకు పురుషార్థము చేయాలి. శివబాబా కూడా మీకు అర్థం చేయిస్తారు, ఈ బాబా కూడా అర్థం చేయిస్తారని పిల్లలైన మీకు కూడా తెలుసు. అదే మీ బుద్ధిలోనూ, నా బుద్ధిలోనూ ఉంది. భలే మనము శాస్త్రాలు మొదలైనవి చదివాము కాని వీటి ద్వారా భగవంతుడేమీ లభించడని తెలుసు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! శివబాబాను, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. బాబా మీరు చాలా మధురమైనవారు. మీరు ఎంత అద్భుతము చేస్తారు! ఇలా బాబాను మహిమ చేయాలి. పిల్లలైన మీకు ఈశ్వరీయ లాటరీ లభించింది. ఇప్పుడు జ్ఞాన-యోగాల శ్రమ చేయాలి. ఇందులో జబర్‌దస్త్‌(చాలా గొప్ప) బహుమానము లభిస్తుంది. కనుక పురుషార్థము చేయాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అమృతవేళ శుద్ధమైన శాంతియుత సమయములో లేచి తండ్రిని స్మృతి చేయాలి. దేహ సహితంగా అన్నీ మర్చిపోయే అభ్యాసము చేయాలి.
2. గతం గత: అని ఈ అంతిమ జన్మలో తండ్రికి పవిత్రత ద్వారా సహయోగమివ్వాలి. తనువు, మనస్సు, ధనములను భారతదేశాన్ని స్వర్గముగా చేసే సేవలో ఉపయోగించాలి. 

వరదానము :- '' మీ ఆది మరియు అంతిమ స్వరూపాలను ముందుంచుకొని ఖుషీ మరియు నషాలో ఉండే స్మృతి స్వరూప భవ ''
ఎలాగైతే ఆది దేవుడైన బ్రహ్మ, ఆది ఆత్మ అయిన శ్రీకృష్ణుడు - ఇరువురి వ్యత్యాసాన్ని చూపించునప్పుడు కూడా ఇరువురిని జతలో చూపిస్తారో, అలా మీరంతా మీ బ్రాహ్మణ స్వరూపాన్ని, దేవతా స్వరూపాన్ని రెండిటినీ ముందుంచుకొని ఆది నుండి అంతము వరకు మేము ఎంత శ్రేష్ఠ ఆత్మలుగా ఉండినామని చూసుకోండి. అర్ధకల్పము రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు, అర్ధకల్పము మాననీయ(గౌరవింపదగిన), పూజ్యనీయ శ్రేష్ఠమైన ఆత్మలుగా అయ్యారు. ఈ నషా మరియు ఖుషీలో ఉండుట వలన స్మృతి స్వరూపులుగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''అపారమైన జ్ఞాన ధనము ఎవరి వద్ద ఉంటుందో, వారికి సంపన్నత అనుభవమవుతుంది''
 

Telugu Murli 16/01/18

16-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - బాబాను స్మృతి చేసేందుకు బాగా శ్రమ చేయండి ఎందుకంటే మీరు స్వచ్ఛమైన బంగారముగా తయారవ్వాలి'' 

ప్రశ్న :- మంచి పురుషార్థుల లక్షణాలు ఏవి ?
జవాబు :- ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారు అడుగడుగునా శ్రీమతమును అనుసరిస్తారు. సదా శ్రీమతమును అనుసరించువారే ఉన్నత పదవిని పొందుతారు. బాబా పిల్లలను సదా శ్రీమతమును అనుసరించమని ఎందుకు చెప్తారు? ఎందుకంటే వారొక్కరే సత్య-సత్యమైన ప్రియుడు. మిగిలిన వారంతా వారి ప్రేయసులు. 

ఓంశాంతి. ఓంశాంతి అర్థమునైతే కొత్త పిల్లలు, పాత పిల్లలు అందరూ అర్థం చేసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని సంతానమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. పరమాత్మ అత్యంత ఉన్నతులు, సర్వులకు అత్యంత ప్రియమైన ప్రియతముడు. పిల్లలకు జ్ఞానము, భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. జ్ఞానము అనగా పగలు - సత్య, త్రేతా యుగాలు. భక్తి అనగా రాత్రి - ద్వాపర కలియుగాలు. ఇది భారతదేశ విషయమే. ఇతర ధర్మాలతో మీకు ఎక్కువగా సంబంధము లేదు. 84 జన్మలు కూడా మీరే అనుభవిస్తారు. మొట్టమొదట భారతవాసులైన మీరే వచ్చారు. 84 జన్మల చక్రము భారతవాసులైన మీ కొరకే. ఇస్లాం మతము వారు, బౌద్ధులు మొదలైనవారు 84 జన్మలు తీసుకుంటారని ఎవ్వరూ అనరు. భారతవాసులే తీసుకుంటారు. భారతదేశమే అవినాశి ఖండము, ఇది ఎప్పుడూ వినాశనము అవ్వదు. ఇతర ఖండాలన్నీ వినాశనమైపోతాయి. భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతమైనది, అవినాశి ఖండము. భారత ఖండమే స్వర్గంగా తయారౌతుంది. ఇతర ఏ ఖండమూ స్వర్గంగా అవ్వదు. నూతన ప్రపంచమైన సత్యయుగములో భారతదేశమే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించబడింది. భారతదేశమే స్వర్గముగా పిలువబడ్తుంది. వారే మళ్లీ 84 జన్మలు తీసుకుంటారు. చివరికి నరకవాసులుగా అవుతారు. మళ్లీ ఆ భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయములో అందరూ నరకవాసులుగానే ఉన్నారు. మిగిలిన ఖండాలన్నీ వినాశనమౌతాయి. ఒక్క భారతదేశము మాత్రమే మిగులుతుంది. భారతదేశ ఖండ మహిమ అపరం అపారమైనది. అలాగే పరమపిత పరమాత్ముని మహిమ, గీతా మహిమ కూడా అపారమైనది. కాని ఆ మహిమ సత్యమైన గీతదే. అసత్యమైన గీతను వింటూ వింటూ, చదువుతూ చదువుతూ క్రిందికి దిగుతూనే వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీతా పురుషోత్తమ సంగమ యుగము. భారతదేశమే మళ్లీ పురుషోత్తమంగా అవ్వనున్నది. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేదు, ఆ రాజ్యము కూడా లేదు, కనుక ఆ యుగము కూడా లేదు. గీతలో మళ్లీ కృష్ణుని పేరు వేసేశారు. ఈ తప్పు కూడా డ్రామాలో ఉందని తండ్రి అర్థం చేయించారు. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు మొట్టమొదట గీతయే ఉంటుంది. ఇప్పుడు ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ సమాప్తమవ్వనున్నవి. కేవలం దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉంటుంది. అలాగని దాని జతలో గీత, భాగవతము మొదలైనవి కూడా ఉంటాయని కాదు. ప్రాలబ్ధము లభించింది, సద్గతి కలిగింది. కనుక ఇక ఏ శాస్త్రాలు మొదలైనవాటి అవసరమే ఉండదు. సత్యయుగములో ఏ గురువులూ, శాస్త్రాలు మొదలైనవి ఉండవు. ఈ సమయములో అయితే భక్తిని నేర్పించే గురువులు అనేకమంది ఉన్నారు. సద్గతినిచ్చేది ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే. వారి మహిమ అపారమైనది. వారిని '' వరల్డ్‌ ఆల్‌మైటి అథారిటి (సర్వ శక్తివంతుడు) అని అంటారు. వారు అంతర్యామి అని, వారికి సర్వుల ఆంతర్యము తెలుసునని భారతవాసులు చాలా పొరపాటు చేశారు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, నాకు ఎవరి ఆంతర్యాలు(మనసులోని మర్మము) తెలియదు. పతితులను పావనంగా చేయడమే నా కర్తవ్యము. నేను అంతర్యామిని కాదు. ఇది భక్తిమార్గములోని ఉల్టా(తప్పు) మహిమ. నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేయవలసినప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇప్పుడున్న ఈ ప్రపంచమే కొత్తది నుండి పాతదిగా, పాత దాని నుండి కొత్తదిగా ఎప్పుడు అవుతుందో మనుష్యులకు తెలియదు. ప్రతి వస్తువు తప్పనిసరిగా రజో, తమోలలోకి వస్తుంది. మనుష్యులు కూడా ఒకేలాగే ఉంటారు. బాలకులు మొదట సతోప్రధానంగా ఉంటారు, తర్వాత యువకులుగా, వృద్ధులుగా అవుతారు అనగా రజో, తమోలలోకి వస్తారు. శరీరము ముదుసలిగా అయినప్పుడు దానిని వదిలి వెళ్లి పసి పిల్లలుగా అవుతారు. ప్రపంచము కూడా కొత్తది పాతదిగా అవుతుంది. కొత్త ప్రపంచములో భారతదేశము ఎంత ఉన్నతంగా ఉండేదో పిల్లలకు తెలుసు. భారతదేశ మహిమ అపరం అపారమైనది. ఇంత ధనవంతంగా, సుఖంగా, పవిత్రంగా ఇతర ఏ ఖండమూ లేదు. ఇప్పుడు సతోప్రధాన ప్రపంచము స్థాపన అవుతూ ఉంది. త్రిమూర్తులలో కూడా బ్రహ్మ, విష్ణు, శంకరులను చూపించారు. కాని దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని చెప్పాలి, త్రిమూర్తి బ్రహ్మ అని కాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టించిన వారెవరు?,........ ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా. బ్రహ్మ దేవతాయ నమ:, విష్ణు దేవతాయ నమ:, శంకర దేవతాయ నమ:, శివ పరమాత్మాయ నమ: అని అంటారు. కనుక వారు అత్యంత ఉన్నతమైన వారయ్యారు కదా. వారు రచయిత. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన చేస్తారని మహిమ కూడా చేస్తారు. మళ్లీ పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వము కూడా లభిస్తుంది. మళ్లీ వారు స్వయంగా కూర్చొని బ్రాహ్మణులను చదివిస్తారు. ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు, సుప్రీమ్‌ టీచరు కూడా అయ్యారు. విశ్వ చరిత్ర, భూగోళాలు ఎలా రిపీట్‌ అవుతాయో వారు కూర్చొని అర్థం చేయిస్తారు. వారు జ్ఞాన సాగరులు అంతేకాని వారు సర్వము తెలిసినవారు(జానీ జానన్‌హార్‌) కాదు. ఇది కూడా పొరపాటే. భక్తిమార్గములో ఎవ్వరికీ వారి జీవితచరిత్రను గురించి, కర్తవ్యాల గురించి తెలియదు. కనుక ఇది బొమ్మల పూజ వలె అవుతుంది. కలకత్తాలో బొమ్మల పూజ ఎంత ఎక్కువగా జరుగుతుంది! వారికి పూజ చేసి తినిపించి-త్రాగించి సముద్రములో ముంచేస్తారు. శివబాబా అత్యంత ప్రియమైనవారు. తండ్రి అంటారు - నా లింగాన్ని కూడా మట్టితో తయారు చేసి పూజ చేసి మళ్లీ పగులగొడ్తారు. ఉదయము తయారు చేస్తారు, సాయంకాలము కూల్చేస్తారు. ఇదంతా భక్తిమార్గము, అంధ విశ్వాసముతో చేసే పూజ. మీరే పూజ్యులు, మీరే పూజారులని మనుష్యులు గాయనము కూడా చేస్తారు. తండ్రి చెప్తారు - నేనైతే సదా పూజ్యుడను. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను. 21 జన్మలకు రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. భక్తిలో అల్పకాల సుఖముంటుంది. దీనిని సన్యాసులు కాకిరెట్టకు సమానమైన సుఖమని అంటారు. సన్యాసులు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు. అది హద్దులోని సన్యాసము. హఠయోగులు కదా. భగవంతుని గురించి తెలియనే తెలియదు. బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వమైతే భగవంతుడు కాదు. భగవంతుడైతే ఒకే ఒక నిరాకారి శివుడు, వారే సర్వాత్మలకు తండ్రి. బ్రహ్మతత్వము ఆత్మలైన మన నివాస స్థానము. అది బ్రహ్మాండము, మధురమైన ఇల్లు. అక్కడ నుండి ఆత్మలమైన మనము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. భారతవాసులకే 84 జన్మలు ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో, వారే జ్ఞానము కూడా ఎక్కువగా తీసుకుంటారు. తండ్రి చెప్తారు - పిల్లలారా! భలే గృహస్థ వ్యవహారములో ఉండండి కాని శ్రీమతమును అనుసరించండి. ఆత్మలైన మీరంతా ప్రియతముడైన ఒక్క పరమాత్ముని ప్రేయసులు. ద్వాపరము నుండి మీరు స్మృతి చేస్తూ వచ్చారు. దు:ఖములో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. ఇది అయితే దు:ఖధామము. ఆత్మలు వాస్తవానికి శాంతిధామ నివాసులు. తర్వాత సుఖధామములోకి వస్తారు. మళ్లీ మనము 84 జన్మలు తీసుకున్నాము. '' హమ్‌ సో, సో హమ్‌ '' అర్థము కూడా అర్థం చేయించబడింది. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని వారు అనేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మయే పరమాత్మ ఎలా అవ్వగలదు ? పరమాత్మ అయితే ఒక్కరే. మిగిలిన వారందరూ వారి పిల్లలు. సాధు-సత్పురుషులు మొదలైనవారు కూడా హమ్‌ సో యొక్క అర్థాన్ని తప్పుగా చెప్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - హమ్‌ సో అర్థము - నేను ఆత్మ సత్యయుగములో దేవీ దేవతగా ఉండినాను, మళ్లీ(హమ్‌ సో) నేనే క్షత్రియునిగా, నేనే వైశ్యునిగా, నేనే శూద్రునిగా అయ్యాను. ఇప్పుడు మళ్లీ (హమ్‌ సో) నేనే దేవతగా అయ్యేందుకు బ్రాహ్మణునిగా అయ్యాను. ఇదే యదార్థమైన అర్థము. అది పూర్తిగా తప్పు. తండ్రి చెప్తున్నారు - మనుష్యులు రావణుని మతమును అనుసరిస్తూ ఎంత అసత్యంగా అయిపోయారు! కనుకనే అసత్యపు మాయ, అసత్యపు కాయ.........(ఝూఠీ మాయా, ఝూఠీ కాయా,...) అనే సామెత ఉంది. సత్యయుగములో ఇలా అనరు. అది సత్య ఖండము. అక్కడ అసత్యానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఇక్కడ సత్యానికి నామ-రూపాలు లేవు. అయినా పిండిలో ఉప్పు ఉన్నంత సత్యమని అంటారు. సత్యయుగములో దైవీగుణాలు కలిగిన మనుష్యులు ఉంటారు. వారిది దేవతా ధర్మము. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. కనుక ద్వైతము ఏర్పడింది. ద్వాపరము నుండి ఆసురీ రావణ రాజ్యము ప్రారంభమైపోతుంది. సత్యయుగములో రావణ రాజ్యము కూడా ఉండదు కనుక 5 వికారాలు కూడా ఉండవు. వారు(లక్ష్మి నారాయణులు) సంపూర్ణ నిర్వికారులు, సీతా-రాములను 14 కళా సంపూర్ణులని అంటారు. రామునికి బాణాలను ఎందుకు ఇచ్చారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అక్కడ హింస మాటే లేదు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. వారు తండ్రి కూడా అయ్యారు. మీరు విద్యార్థులు కావున వారు టీచరు కూడా అయ్యారు. మళ్లీ పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు కనుక సద్గురువు కూడా అయ్యారు. తండి, టీచరు, గురువు ముగ్గురూ వారే అయ్యారు. వారికి మీరు సంతానంగా అయ్యారు కావున మీకు ఎంత ఖుషీ ఉండాలి! ఇప్పుడిది రావణ రాజ్యమని పిల్లలైన మీకు తెలుసు. రావణుడు భారతదేశానికి అందరికన్నా పెద్ద శత్రువు. ఈ జ్ఞానము కూడా పిల్లలైన మీకు జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా లభించింది. ఆ తండ్రియే జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. జ్ఞానసాగరుని నుండి జ్ఞాన మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని వెళ్లి జ్ఞానాన్ని వర్షిస్తారు. జ్ఞాన గంగలు మీరే. మీకే మహిమ ఉంది. అంతేగాని నీటి గంగలో స్నానము చేయడం వలన ఎవ్వరూ పావనంగా అవ్వనే అవ్వరు. మలినమైన మురికి నీటిలో స్నానము చేసి కూడా మేము పావనమైపోతామని భావిస్తారు. జలపాతాల నీటికి కూడా చాలా మహత్వాన్ని ఇస్తారు. ఇదంతా భక్తి మార్గము. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము.

తండ్రి చెప్తారు - పిల్లలారా, నేను ఇప్పుడు మిమ్ములను పావనంగా చేసేందుకు వచ్చాను. ఈ ఒక్క జన్మ నన్ను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి. అప్పుడు మీరు సతోప్రధానంగా అయిపోతారు. పతితపావనుడను నేనే. స్మృతియాత్రను సాధ్యమైనంత వరకు పెంచుకోండి. నోటి ద్వారా శివబాబా, శివబాబా అని అనరాదు. ఎలా ప్రేయసి ప్రియతముని స్మృతి చేస్తుందో, ఒక్కసారి చూస్తే చాలు బుద్ధిలో అతని స్మృతి ఉండిపోతుంది. భక్తిలో ఎవరు ఎవరిని స్మృతి చేస్తారో, ఎవరిని పూజిస్తారో వారి సాక్షాత్కారము జరుగుతుంది కానీ అదంతా అల్పకాలము కొరకు. భక్తి ద్వారా క్రిందికే దిగుతూ వచ్చారు. ఇప్పుడైతే మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది. హాహాకారాల తర్వాతనే జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. భారతదేశములోనే రక్త నదులు ప్రవహించనున్నవి. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి. కాని కల్పక్రితము ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే ఇప్పుడు కూడా అవుతారు. వారే వచ్చి తండ్రి నుండి వారసత్వమును పూర్తిగా తీసుకుంటారు. ఒకవేళ తక్కువ భక్తి చేసి ఉంటే జ్ఞానము కూడా పూర్తిగా తీసుకోరు. తర్వాత మళ్లీ ప్రజలలో నంబరువారుగా పదవిని పొందుతారు. మంచి పురుషార్థులు అడుగడుగునా శ్రీమతమును అనుసరించి మంచి పదవిని పొందుతారు. మంచి గుణాల మర్యాదలు కూడా అవసరము. దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. అవి మళ్లీ 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరిలో ఆసురీ గుణాలున్నాయి ఎందుకంటే ఇది పతిత ప్రపంచము కదా. పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర-భూగోళముల గురించి కూడా అర్థం చేయించబడింది. ఈ సమయములో తండ్రి చెప్తారు - పిల్లలారా, స్మృతి చేసేందుకు బాగా శ్రమ చేసినట్లయితే మీరు సత్యమైన బంగారముగా తయారౌతారు. సత్యయుగమంటే స్వర్ణిమ యుగము, సత్యమైన బంగారము. తర్వాత మళ్లీ త్రేతా యుగములో వెండి కల్తీగా చేరుతుంది కనుక కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు ఒక్క కళా లేదు. అందరూ కళా విహీనంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మీరు పాత్రధారులు కదా. మేము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రధారి ఒకవేళ డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోనట్లయితే వారిని అవివేకులని అంటారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు - అందరూ ఎంత అవివేకులుగా(తెలివి హీనులుగా) అయిపోయారు! ఇప్పుడు నేను మిమ్ములను బుద్ధివంతులుగా, వజ్ర సమానంగా తయారు చేస్తాను. మళ్లీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము జరుగనున్నది. అందరినీ దోమల వలె తీసుకెళ్తాను. మీ ముఖ్య ఉద్ధేశ్యము ఎదురుగా నిలిచి ఉంది. ఇలా (లక్ష్మీ నారాయణులుగా) తయారవ్వాలి. అప్పుడే మీరు స్వర్గ వాసులుగా అవుతారు. బి.కెలైన మీరు ఈ పురుషార్థము చేస్తున్నారు. కాని మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా ఉన్నందున ఇంతమంది బి.కెలు ఉన్నారు కనుక తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉంటారని అర్థం చేసుకోరు. బ్రాహ్మణులు శిఖ సమానమైనవారు. బ్రాహ్మణులుగా ఉన్న మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. వారు చిత్రాలలో బ్రాహ్మణులను, శివుడిని ఇరువురినీ మాయం చేసేశారు. బ్రాహ్మణులు ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేఘాలైన మీరు జ్ఞాన సాగరుని నుండి జ్ఞానాన్ని నింపుకొని అందరి పై జ్ఞాన వర్షాన్ని కురిపించాలి. వీలైనంత ఎక్కువగా స్మృతియాత్రను కూడా పెంచుకోవాలి. స్మృతి ద్వారానే సత్యమైన బంగారముగా తయారవ్వాలి.
2. శ్రీమతమును అనుసరించి మంచి మర్యాదలను మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. సత్య ఖండములోకి వెళ్లేందుకు చాలా చాలా సత్యంగా తయారవ్వాలి. 

వరదానము :- ''మాస్టర్‌ నాలెడ్జ్‌ఫుల్‌గా(మాస్టర్‌ జ్ఞానసాగరులుగా) తయారై 5 వేల సంవత్సరాల జన్మపత్రిని(జాతకాన్ని) తెలుసుకునే స్వదర్శన చక్రధారీ భవ''
ఎవరైతే ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతారో, వారే భవిష్యత్తులో చక్రవర్తి రాజుల పదవికి(రాజ్య భాగ్యానికి) అధికారులుగా అవుతారు. స్వదర్శన చక్రధారులనగా మొత్తం చక్రమంతటిలో తమ భిన్న-భిన్న పాత్రలన్నీ తెలిసినవారు. పిల్లలైన మీరు విశేషంగా ఈ సమయంలో 5 వేల సంవత్సరాల జాతకాన్ని తెలుసుకొని మాస్టర్‌ జ్ఞానసాగరులుగా అయిపోయారు. ఈ అంతిమ జన్మలో జీవితాన్ని వజ్ర తుల్యంగా చేసుకోవడం ద్వారా మొత్తం విశ్వమంతటిలో హీరో పాత్రను అభినయించే హీరోలుగా అయిపోతారనే విశేషమైన విషయాన్ని తెలుసుకున్నారు. 

స్లోగన్‌ :- ''మీ సాథీలకు (స్నేహితులకు, జతలో ఉన్నవారికి) కూడా తండ్రి సాంగత్య రంగును వేస్తే (అంటిస్తే) వారి సాంగత్య రంగు మీకు అంటుకోదు.''
 

Telugu Murli 15/01/18

15-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఆత్మ-పరమాత్మల మిలనము జరిగే సంగమ యుగము ఇదే. సద్గురువు ఈ ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలకు సత్యమైన జ్ఞానమునిచ్చి సత్యాన్ని చెప్పడం నేర్పిస్తారు.'' 

ప్రశ్న :- ఏ పిల్లల స్థితి చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది ?
జవాబు :- ఏ పిల్లల బుద్ధిలో అయితే ఈ సర్వస్వము బాబాదే అని ఉంటుందో, ప్రతి అడుగులో శ్రీమతము(సలహా)ను తీసుకుంటారో, పూర్తిగా త్యాగము చేస్తారో వారి స్థితి చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది. ఈ యాత్ర చాలా దీర్ఘమైనది. అందువలన శ్రేష్ఠమైన తండ్రి నుండి ఉన్నతమైన మతము (సలహా) తీసుకుంటూ ఉండాలి. 

ప్రశ్న :- మురళి వినే సమయంలో అపారమైన సుఖము ఏ పిల్లలకు అనుభవమౌతుంది ? 
జవాబు :- ఏ పిల్లలైతే మేము శివబాబా మురళి వింటున్నాము, ఈ మురళి శివబాబా, బ్రహ్మ శరీరము ద్వారా వినిపిస్తున్నారు, అత్యంత ప్రియమైన బాబా మమ్ములను సదా సుఖీలుగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు ఈ మురళీ వినిపిస్తున్నారని ఎవరు భావిస్తారో, మురళి వినేటప్పుడు ఎవరికైతే ఈ స్మృతి ఉంటుందో వారికి సుఖము అనుభవమౌతుంది.   


పాట :- ప్రియతమా! వచ్చి కలుసుకో....... (ప్రీతమ్‌ ఆన్‌ మిలో,............)
ఓంశాంతి. ఈ దు:ఖభరిత జీవితము దు:ఖధామములో మాత్రమే ఉంటుంది. సుఖంగా ఉండే జీవాత్మలు సుఖధామంలో ఉంటారు. భక్తులందరి ప్రియతముడు ఒక్కరే. వారినే స్మృతి చేయడం జరుగుతుంది. వారిని ప్రియతముడని అంటారు. దు:ఖము కలిగినప్పుడు స్మృతి చేస్తారు. ఈ విధంగా కూర్చొని ఎవరు అర్థం చేయిస్తున్నారు ? సత్య-సత్యమైన ప్రియతముడు, సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు,............ అందరి ప్రియతముడు వారొక్కరే. అయితే ఆ ప్రియతముడు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రియతముడే స్వయంగా వచ్చి తన భక్తులకు, తన పిల్లలకు నేను కేవలం సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే వస్తాను, నేను వచ్చేందుకు, వెళ్లేందుకు మధ్య గల సమయాన్ని సంగమ సమయమని అంటారు. మిగిలిన ఆత్మలన్నీ అనేకసార్లు జనన - మరణాలలో వస్తాయి. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. సద్గురువు కూడా నేనొక్కరిని మాత్రమే. మిగిలిన గురువులైతే అనేకమంది ఉన్నారు. వారిని సద్గురువు అని అనరు ఎందుకంటే వారెవ్వరూ సత్యాన్ని చెప్పరు. సత్యమైన పరమాత్ముని గురించి వారికి తెలియనే తెలియదు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడ్తారు. ఆ సద్గురువు సత్యమునే మాట్లాడు సద్గురువు. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు స్వయంగా వచ్చి నేను సంగమ యుగములో వస్తానని తెలుపుతున్నారు. ఎంత సమయము నేనుంటానో అదే నా ఆయువు. పతితులను పావనంగా తయారు చేసే వెళ్తాను. నా జన్మ జరిగినప్పటి నుండి నేను సహజ రాజయోగము నేర్పించడం ప్రారంభిస్తాను. ఎప్పుడైతే నేర్పించి పూర్తి చేస్తానో అప్పుడు పతిత ప్రపంచము వినాశనమౌతుంది, నేను వెళ్ళిపోతాను. నేను ఇంత సమయము మాత్రమే వచ్చి ఉంటాను. శాస్త్రాలలో అయితే నా సమయము గురించి వ్రాయనే లేదు. శివబాబా ఎప్పుడు జన్మ తీసుకుంటారో, ఎన్ని రోజులు భారతదేశములో ఉంటారో ఈ విషయాలు తండ్రే స్వయంగా కూర్చొని తెలియజేస్తున్నారు - నేను సంగమ యుగములోనే వస్తాను. సంగమ యుగము యొక్క ఆది, సంగమ యుగము యొక్క అంతిమము అనగా నేను వచ్చేది ఆది సమయము, వెళ్ళిపోయేది అంత్య సమయము. ఇకపోతే మధ్యలో నేను కూర్చొని రాజయోగము నేర్పిస్తాను. తండ్రి స్వయంగా కూర్చొని తెలియజేస్తున్నారు - నేను ఇతనిలోనే ఇతని వానప్రస్థ అవస్థలో వస్తాను. పరాయి దేశములో, పరాయి శరీరములో వస్తాను అనగా నేను అతిథినౌతాను కదా. ఈ రావణ ప్రపంచములో నేను అతిథిని. ఈ సంగమ యుగపు మహిమ చాలా గొప్పది(జబర్‌దస్త్‌). రావణ రాజ్యాన్ని వినాశము చేసి రామరాజ్య స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. శాస్త్రాలలో కట్టుకథలు చాలా వ్రాసేశారు. రావణుని తగులబెడ్తూ వస్తారు. ఈ సమయములో ఈ మొత్తము సృష్టి అంతా లంక వలె ఉంది. సిలోన్‌ను మాత్రమే లంక అని అనరు. ఈ మొత్తము సృష్టి అంతా రావణుడుండే స్థానము లేక శోకవాటిక. అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - నేను దీనిని అశోకవాటిక లేక స్వర్గంగా తయారు చేసేందుకు వస్తాను. స్వర్గములో ఇన్ని ధర్మాలైతే ఉండవు. అచ్చట ఒకే ఒక ధర్మముండేది. ఆ ధర్మము ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్లీ దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. అందరూ ఈ రాజయోగాన్ని నేర్చుకోరు. నేను భారతదేశములో మాత్రమే వస్తాను. భారతదేశములోనే స్వర్గముంటుంది. క్రైస్తవులు కూడా స్వర్గాన్ని అంగీకరిస్తారు. హెవెన్లీ అబోడ్‌(స్వర్గానికి) వెళ్ళిపోయారని, గాడ్‌ఫాదర్‌ వద్దకు వెళ్ళిపోయారని అంటారు. అయితే స్వర్గము గురించి వారికి తెలియదు. హెవెన్‌(స్వర్గము) వేరే వస్తువు. అందువలన నేను ఎప్పుడు ఎలా వస్తానో అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి త్రికాలదర్శులుగా తయారు చేస్తాను. త్రికాలదర్శులు ఇతరులెవ్వరూ ఉండరు. సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కలియుగము వినాశనము అవ్వనున్నది. లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయము అదే సంగమ యుగ సమయము. ఖచ్ఛితమైన సమయము ఇది అని చెప్పలేము కాని రాజధాని అయితే పూర్తిగా స్థాపనవుతుంది. పిల్లలు కర్మాతీత అవస్థను పొందుకుంటే జ్ఞానము సమాప్తమైపోతుంది. యుద్ధము ప్రారంభమైపోతుంది. నేను కూడా పవిత్రంగా చేసే నా పాత్రను పూర్తి చేసి వెళ్ళిపోతాను. దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం నా పాత్రయే. భారత వాసులకు ఇది కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు శివరాత్రి పండుగ జరుపుతారు అనగా శివబాబా తప్పకుండా ఏదో ఒక కార్యము చేసి ఉంటారు. అయితే వారు కృష్ణుని పేరు వేసేశారు. ఇది చూచేందుకు సాధారణ పొరపాటుగా కనిపిస్తుంది. శివపురాణము మొదలైన ఏ శాస్త్రములోనూ శివబాబా వచ్చి రాజయోగము నేర్పిస్తారని లేదు. వాస్తవానికి ప్రతి ధర్మానికి ఒక్కొక్క శాస్త్రముంది. అందువలన దేవీ దేవతా ధర్మానికి కూడా ఒక శాస్త్రముండాలి. కాని దాని రచయిత ఎవరు ? ఇందులోనే తికమక పడ్డారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని తప్పకుండా రచించవలసి వచ్చింది. బ్రహ్మ ముఖవంశావళినీ బ్రహ్మకుమార-కుమారీలని అంటారు. చాలా మంది పేర్లు మార్పు చేశారు. అందులో చాలా మంది పారిపోయారు. స్థానము కూడా మార్చేశారు. పేరు మార్పు వలన ఎలాంటి లాభము లేదని గమనించడం జరిగింది. చివరికి వారు ఆ పేరును కూడా మర్చిపోతారు. వాస్తవానికి మీరు తండ్రితో యోగము జోడించాలి. శరీరానికి పేరు లభిస్తుంది. ఆత్మకైతే పేరే లేదు. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలో నామ, రూప, దేశ, కాలములన్నీ మారిపోతాయి. డ్రామాలో ఏ ఆత్మ అయినా ఒకసారి చేసిన పాత్ర మరలా అదే రూపములో అదే పాత్ర చేయరు. అదే పాత్ర మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత అభినయిస్తుంది. అంతేకాని కృష్ణుడు అదే నామ-రూపాలతో మళ్లీ రాగలడని కాదు. అలా జరగదు. ఆత్మ ఒక శరీరమును వదలి మరొకటి తీసుకుంటుందని తెలుసు. కావున రూపు రేఖలు మొదలైనవి ఒకదానితో ఒకటి కలువవు. 5 తత్వాల అనుసారము రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. ఎన్ని రూపు రేఖలున్నాయి(ఫీచర్స్‌)!! అయితే ఇవన్నీ మొదటి నుండే డ్రామాలో ఫిక్స్‌ అయ్యి ఉన్నాయి. క్రొత్తదేదీ తయారవ్వదు. ఇప్పుడు శివరాత్రి జరుపబడుతుంది. శివుడు తప్పకుండా వచ్చారు. ప్రపంచములోని వారందరికీ వారొక్కరే ప్రియతముడు. లక్ష్మీనారాయణులను గాని, రాధా-కృష్ణులను గాని, బ్రహ్మ-విష్ణువు మొదలైనవారిని గాని ప్రియతముడని అనరు. గాడ్‌ఫాదర్‌ ఒక్కరే ప్రియతముడు. తండ్రి అయితే తప్పకుండా వారసత్వమునిస్తారు. అందువలన తండ్రి చాలా ప్రియమనిపిస్తారు. తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి ఎందుకంటే నా ద్వారా మీరు వారసత్వాన్ని పొందాలి. ఈ చదువు అనుసారము వెళ్లి మేము సూర్యవంశీ దేవతలు లేక చంద్రవంశీ క్షత్రియులుగా అవుతామని పిల్లలకు తెలుసు. వాస్తవానికి భారతవాసులందరి ధర్మము ఒక్కటిగానే ఉండాలి. కాని దేవతా ధర్మము పేరును మార్చి హిందూ ధర్మమని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ దైవీ గుణాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని ధారణ చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరులుగా అవ్వండి అని అంటున్నారు. మీరెవ్వరూ పరమాత్మ కారు. పరమాత్మ అయితే ఒక్క శివుడు మాత్రమే. అందరికీ ప్రియతములైన వారు ఒక్కసారి మాత్రమే సంగమ యుగములో వస్తారు. ఇది చాలా చిన్న యుగము. అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. బ్రాహ్మణ కులము వారు కూడా వాపసు వెళ్తారు. ఎందుకంటే వారు మళ్లీ దైవీ కులములోకి బదిలీ అవ్వాలి. వాస్తవానికి ఇది ఒక చదువు. కేవలం పోలుస్తారు. ఆ విషయ వికారాలు విషము వంటివి. ఈ జ్ఞానము అమృతము వంటిది. ఇది మనుష్యులను దేవతలుగా తయారు చేసే పాఠశాల. ఆత్మలో మలినాలు ఏర్పడ్డాయి. అందుచేత ఆత్మ పూర్తిగా మిశ్రితమై పనికిరాకుండా పోయింది. దానిని తండ్రి వచ్చి వజ్ర సమానంగా తయారు చేస్తారు. శివరాత్రి అని అంటారు. శివుడు రాత్రిలో వచ్చారు. అయితే ఎలా వచ్చాడు? ఎవరి గర్భములో వచ్చాడు? లేక ఎవరి శరీరములో ప్రవేశించాడు? వారు గర్భములో అయితే రారు. వారు శరీరాన్ని లోనుగా(అప్పుగా) తీసుకోవలసి వచ్చింది. వారు తప్పకుండా వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కాని ఎప్పుడు, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలైతే చాలా చదువుతారు. కాని ముక్తి-జీవన్ముక్తి ఎవ్వరికీ లభించదు. ఇంకా తమోప్రధానంగా అయిపోయారు. అందరూ ఆ విధంగా అవ్వాల్సిందే. మనుష్యులందరూ స్టేజి పై తప్పకుండా హాజరయ్యే తీరాలి. తండ్రి వచ్చేది చివరి సమయములోనే. మీ గతి-మతి మీకే తెలియాలని(తుమ్‌హారి గత్‌-మత్‌ తుమ్‌ హీ జానో) అందరూ వారి మహిమనే గానము చేస్తారు. మీలో ఏ జ్ఞానముందో మీరు ఎలా సద్గతినిస్తారో అది మీకే తెలుసు. అందువలన వారు శ్రీమతమును ఇచ్చేందుకు తప్పకుండా వస్తారు కదా. కాని ఎలా వస్తారో, ఏ శరీరములో వస్తారో ఎవ్వరికీ తెలియదు. సాధారణ శరీరములో నేను వస్తానని స్వయంగా చెప్తారు. నేను తప్పకుండా బ్రహ్మ అని పేరు కూడా పెట్టవలసి వచ్చింది లేకుంటే బ్రాహ్మణులు ఎలా జన్మిస్తారు! బ్రహ్మ ఎచ్చటి నుండి వస్తారు? పై నుండి అయితే రారు కదా. అతడు సూక్ష్మవతన వాసి అవ్యక్త సంపూర్ణ బ్రహ్మ. ఇచ్చటైతే తప్పకుండా వ్యక్తములో వచ్చి రచనను రచించవలసి వస్తుంది. ఇంత సమయము వస్తారు, వెళ్తారని మనము అనుభవముతో చెప్పగలము. తండ్రి అంటున్నారు - నేను కూడా డ్రామాలో బంధింపబడ్డాను. నేను రావలసిన పాత్ర కూడా ఒక్కసారి మాత్రమే ఉంది. భలే ప్రపంచములో ఉపద్రవాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయములో ఈశ్వరుని ఎంతగానో పిలుస్తారు. కాని నేనైతే నా సమయములోనే రావాలి. అది కూడా వానప్రస్థ అవస్థలోనే వస్తాను. ఈ జ్ఞానమైతే చాలా సహజము. కాని స్థితిని తయారు చేసుకోవడంలో శ్రమ ఉంది. అందువలన గమ్యము చాలా ఉన్నతమైనదని అంటారు. తండ్రి జ్ఞానసాగరులు కావున వారు తప్పకుండా పిల్లలకు జ్ఞానమునిచ్చారు. అందుకే మీ గతి-మతి మీకే తెలుసు అనే గాయనముంది.

తండ్రి అంటున్నారు - నా వద్ద ఉన్న సుఖ-శాంతుల ఖజానా ఏదైతే ఉందో అది నేను వచ్చి పిల్లలకే ఇస్తాను. మాతల పై జరిగే అత్యాచారాలు మొదలైనవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ డ్రామాలో నిశ్చయమై ఉన్నాయి. అప్పుడే కదా పాప భాండము నిండుతుంది అనగా పాపము పండుతుంది. కల్ప-కల్పము ఇదే విధంగా రిపీట్‌ అవుతుంది. ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు. తర్వాత మళ్లీ మర్చిపోతారు. ఈ జ్ఞానము సత్యయుగములో ఉండదు. ఒకవేళ ఉండి ఉంటే పరంపరగా వచ్చేది. అచ్చటైతే ఇప్పటి పురుషార్థము ద్వారా పొందే ప్రాలబ్ధముంటుంది. ఇచ్చట పురుషార్థము చేసే ఆత్మలే అచ్చట ఉంటారు. ఇతర ఆత్మలు అచ్చట ఉండరు. అక్కడ వారికి జ్ఞానము అవసరముండదు. ఏ కొంతమంది మాత్రమే వెలువడ్తారని కూడా తెలుసు. చాలా బాగుంది, బాగుంది అని కూడా అంటారు. విదేశాల నుండి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వెలువడితే ఈ జ్ఞానము అర్థము చేసుకున్నా భట్టీలో ఎక్కడుంటారు? ఏమి అర్థము చేసుకుంటారు? ఈ విషయమైతే బాగుంది కాని పవిత్రంగా ఉండలేమని అంటారు. అరే! ఇంతమంది పవిత్రంగా ఉంటున్నారు కదా! వివాహము చేసుకొని కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు. కనుక వారికి బహుమానము కూడా చాలా లభిస్తుంది. ఇది కూడా ఒక పరుగు పందెము(రేస్‌). ఆ రేసులో మొదటి నెంబరులో వస్తే 4-5 లక్షలు లభిస్తాయి. ఇచ్చట 21 జన్మల కొరకు పూర్తి రాజ్యపదవి లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా! ఈ మురళి అయితే పిల్లలందరి వద్దకు వెళ్తుంది. టేపులో కూడా వింటారు. శివబాబా బ్రహ్మ శరీరము ద్వారా మురళి వినిపిస్తున్నారని అంటారు లేక పిల్లలు వినిపిస్తే శివబాబా మురళీని వినిపిస్తున్నారని అంటారు. అప్పుడు బుద్ధి ఒక్కసారిగా అచ్చటికి వెళ్ళిపోవాలి. ఆ సుఖము ఆంతరికములో అనుభవమవ్వాలి. అత్యంత ప్రియమైన బాబా మనలను సదా సుఖీలుగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. అందువలన వారి స్మృతి చాలా ఎక్కువగా ఉండాలి. అయితే మాయ స్మృతిని నిలువనివ్వదు. త్యాగము కూడా పూర్తిగా చేయాలి. ఇదంతా బాబాదే - ఈ స్థితి ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. చాలామంది పిల్లలు శ్రీమతము తీసుకుంటూ ఉంటారు. శ్రీమతములో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. మతము కూడా శ్రేష్ఠమైనది. యాత్ర చాలా దీర్ఘమైనది. మళ్లీ మీరు ఈ మృత్యు లోకములోకి రారు. సత్యయుగము అమరలోకము.

అచ్చట మీరు మరణించరని ఆ రోజు బాబా చాలా మంచిరీతిగా అర్థం చేయించారు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. సర్పము ఉదాహరణ మీ కొరకే. భ్రమరము ఉదాహరణ కూడా మీదే, తాబేలు ఉదాహరణ కూడా మీదే. సన్యాసులైతే వాటిని కాపీ చేశారు. భ్రమరము ఉదాహరణ చాలా బాగుంది. అశుద్ధములో ఉండే పురుగులను జ్ఞాన భూ-భూ చేసి వారిని స్వర్గములోని దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు పురుషార్థము చాలా మంచి రీతిగా చేయాలి. ఉన్నత పదవి లేక మంచి నెంబరు తీసుకోవాలంటే శ్రమ కూడా చేయాలి. భలే వృత్తి - వ్యాపారాదులు చేసుకోండి. వాటికి బాగా సమయమిస్తారు. అయినా మీకు చాలా సమయము లభిస్తుంది. మీ యోగ చార్టును చూసుకోవాలి ఎందుకంటే మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది.

బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ! పొరపాటున కూడా ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి లేక ప్రియునికి విడాకులు ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వకండి. అలాంటి మహామూర్ఖులుగా ఎవ్వరూ అవ్వకండి. కాని మాయ మూర్ఖులుగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఎవరు బలిహారి అవుతారో, చాలా మంచి సేవ చేస్తారో వారిని కూడా మాయ ఎటువంటి స్థితికి చేరుస్తుందో పోను పోను మీరు చూస్తారు. ఎందుకంటే వారు శ్రీమతమును వదిలేస్తారు. అందువలన అటువంటి అతిగొప్ప మహామూర్ఖులుగా తయారవ్వరాదని బాబా అంటున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ద్వారా లభించిన సుఖ-శాంతుల ఖజానాను అందరికీ ఇవ్వాలి. జ్ఞానము ద్వారా మీ స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి.
2. దైవీ గుణాలను ధారణ చేసేందుకు దేహ భావాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరులుగా అయి ఒక్క ప్రియతముడినే స్మృతి చేయాలి. 

వరదానము:- ''స్వయాన్ని అనంతమైన స్టేజి పై ఉన్నట్లు భావించి సదా శ్రేష్ఠమైన పాత్రను అభినయించే హీరో పాత్రధారీ భవ''
మీరందరూ విశ్వమనే 'షో కేసులో ' ఉండే 'షో పీసులు. అనంతములోని అనేక ఆత్మల మధ్య అత్యంత పెద్ద స్టేజి పై ఉన్నారు. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మను విశ్వములోని ఆత్మలు మమ్ములను చూస్తున్నారనే స్మృతిలోనే చేయండి. తద్వారా ప్రతి పాత్ర శ్రేష్ఠంగా జరుగుతుంది. మీరు హీరో పాత్రధారులుగా అయిపోతారు. అందరూ నిమిత్త ఆత్మలైన మీ నుండి ప్రాప్తి లభించాలనే భావనను ఉంచుకుంటారు. కనుక సదా దాత పిల్లలైన మీరు ఇస్తూ ఉండండి, అందరి ఆశలను పూర్తి చేస్తూ ఉండండి. 

స్లోగన్‌ :- ''సత్యతా శక్తి దగ్గరుంటే సంతోషము మరియు శక్తి ప్రాప్తి అవుతూ ఉంటాయి''