Thursday, 18 January 2018

Telugu Murli 16/01/18

16-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - బాబాను స్మృతి చేసేందుకు బాగా శ్రమ చేయండి ఎందుకంటే మీరు స్వచ్ఛమైన బంగారముగా తయారవ్వాలి'' 

ప్రశ్న :- మంచి పురుషార్థుల లక్షణాలు ఏవి ?
జవాబు :- ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారు అడుగడుగునా శ్రీమతమును అనుసరిస్తారు. సదా శ్రీమతమును అనుసరించువారే ఉన్నత పదవిని పొందుతారు. బాబా పిల్లలను సదా శ్రీమతమును అనుసరించమని ఎందుకు చెప్తారు? ఎందుకంటే వారొక్కరే సత్య-సత్యమైన ప్రియుడు. మిగిలిన వారంతా వారి ప్రేయసులు. 

ఓంశాంతి. ఓంశాంతి అర్థమునైతే కొత్త పిల్లలు, పాత పిల్లలు అందరూ అర్థం చేసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని సంతానమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. పరమాత్మ అత్యంత ఉన్నతులు, సర్వులకు అత్యంత ప్రియమైన ప్రియతముడు. పిల్లలకు జ్ఞానము, భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. జ్ఞానము అనగా పగలు - సత్య, త్రేతా యుగాలు. భక్తి అనగా రాత్రి - ద్వాపర కలియుగాలు. ఇది భారతదేశ విషయమే. ఇతర ధర్మాలతో మీకు ఎక్కువగా సంబంధము లేదు. 84 జన్మలు కూడా మీరే అనుభవిస్తారు. మొట్టమొదట భారతవాసులైన మీరే వచ్చారు. 84 జన్మల చక్రము భారతవాసులైన మీ కొరకే. ఇస్లాం మతము వారు, బౌద్ధులు మొదలైనవారు 84 జన్మలు తీసుకుంటారని ఎవ్వరూ అనరు. భారతవాసులే తీసుకుంటారు. భారతదేశమే అవినాశి ఖండము, ఇది ఎప్పుడూ వినాశనము అవ్వదు. ఇతర ఖండాలన్నీ వినాశనమైపోతాయి. భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతమైనది, అవినాశి ఖండము. భారత ఖండమే స్వర్గంగా తయారౌతుంది. ఇతర ఏ ఖండమూ స్వర్గంగా అవ్వదు. నూతన ప్రపంచమైన సత్యయుగములో భారతదేశమే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించబడింది. భారతదేశమే స్వర్గముగా పిలువబడ్తుంది. వారే మళ్లీ 84 జన్మలు తీసుకుంటారు. చివరికి నరకవాసులుగా అవుతారు. మళ్లీ ఆ భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయములో అందరూ నరకవాసులుగానే ఉన్నారు. మిగిలిన ఖండాలన్నీ వినాశనమౌతాయి. ఒక్క భారతదేశము మాత్రమే మిగులుతుంది. భారతదేశ ఖండ మహిమ అపరం అపారమైనది. అలాగే పరమపిత పరమాత్ముని మహిమ, గీతా మహిమ కూడా అపారమైనది. కాని ఆ మహిమ సత్యమైన గీతదే. అసత్యమైన గీతను వింటూ వింటూ, చదువుతూ చదువుతూ క్రిందికి దిగుతూనే వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీతా పురుషోత్తమ సంగమ యుగము. భారతదేశమే మళ్లీ పురుషోత్తమంగా అవ్వనున్నది. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేదు, ఆ రాజ్యము కూడా లేదు, కనుక ఆ యుగము కూడా లేదు. గీతలో మళ్లీ కృష్ణుని పేరు వేసేశారు. ఈ తప్పు కూడా డ్రామాలో ఉందని తండ్రి అర్థం చేయించారు. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు మొట్టమొదట గీతయే ఉంటుంది. ఇప్పుడు ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ సమాప్తమవ్వనున్నవి. కేవలం దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉంటుంది. అలాగని దాని జతలో గీత, భాగవతము మొదలైనవి కూడా ఉంటాయని కాదు. ప్రాలబ్ధము లభించింది, సద్గతి కలిగింది. కనుక ఇక ఏ శాస్త్రాలు మొదలైనవాటి అవసరమే ఉండదు. సత్యయుగములో ఏ గురువులూ, శాస్త్రాలు మొదలైనవి ఉండవు. ఈ సమయములో అయితే భక్తిని నేర్పించే గురువులు అనేకమంది ఉన్నారు. సద్గతినిచ్చేది ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే. వారి మహిమ అపారమైనది. వారిని '' వరల్డ్‌ ఆల్‌మైటి అథారిటి (సర్వ శక్తివంతుడు) అని అంటారు. వారు అంతర్యామి అని, వారికి సర్వుల ఆంతర్యము తెలుసునని భారతవాసులు చాలా పొరపాటు చేశారు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, నాకు ఎవరి ఆంతర్యాలు(మనసులోని మర్మము) తెలియదు. పతితులను పావనంగా చేయడమే నా కర్తవ్యము. నేను అంతర్యామిని కాదు. ఇది భక్తిమార్గములోని ఉల్టా(తప్పు) మహిమ. నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేయవలసినప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇప్పుడున్న ఈ ప్రపంచమే కొత్తది నుండి పాతదిగా, పాత దాని నుండి కొత్తదిగా ఎప్పుడు అవుతుందో మనుష్యులకు తెలియదు. ప్రతి వస్తువు తప్పనిసరిగా రజో, తమోలలోకి వస్తుంది. మనుష్యులు కూడా ఒకేలాగే ఉంటారు. బాలకులు మొదట సతోప్రధానంగా ఉంటారు, తర్వాత యువకులుగా, వృద్ధులుగా అవుతారు అనగా రజో, తమోలలోకి వస్తారు. శరీరము ముదుసలిగా అయినప్పుడు దానిని వదిలి వెళ్లి పసి పిల్లలుగా అవుతారు. ప్రపంచము కూడా కొత్తది పాతదిగా అవుతుంది. కొత్త ప్రపంచములో భారతదేశము ఎంత ఉన్నతంగా ఉండేదో పిల్లలకు తెలుసు. భారతదేశ మహిమ అపరం అపారమైనది. ఇంత ధనవంతంగా, సుఖంగా, పవిత్రంగా ఇతర ఏ ఖండమూ లేదు. ఇప్పుడు సతోప్రధాన ప్రపంచము స్థాపన అవుతూ ఉంది. త్రిమూర్తులలో కూడా బ్రహ్మ, విష్ణు, శంకరులను చూపించారు. కాని దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని చెప్పాలి, త్రిమూర్తి బ్రహ్మ అని కాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టించిన వారెవరు?,........ ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా. బ్రహ్మ దేవతాయ నమ:, విష్ణు దేవతాయ నమ:, శంకర దేవతాయ నమ:, శివ పరమాత్మాయ నమ: అని అంటారు. కనుక వారు అత్యంత ఉన్నతమైన వారయ్యారు కదా. వారు రచయిత. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన చేస్తారని మహిమ కూడా చేస్తారు. మళ్లీ పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వము కూడా లభిస్తుంది. మళ్లీ వారు స్వయంగా కూర్చొని బ్రాహ్మణులను చదివిస్తారు. ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు, సుప్రీమ్‌ టీచరు కూడా అయ్యారు. విశ్వ చరిత్ర, భూగోళాలు ఎలా రిపీట్‌ అవుతాయో వారు కూర్చొని అర్థం చేయిస్తారు. వారు జ్ఞాన సాగరులు అంతేకాని వారు సర్వము తెలిసినవారు(జానీ జానన్‌హార్‌) కాదు. ఇది కూడా పొరపాటే. భక్తిమార్గములో ఎవ్వరికీ వారి జీవితచరిత్రను గురించి, కర్తవ్యాల గురించి తెలియదు. కనుక ఇది బొమ్మల పూజ వలె అవుతుంది. కలకత్తాలో బొమ్మల పూజ ఎంత ఎక్కువగా జరుగుతుంది! వారికి పూజ చేసి తినిపించి-త్రాగించి సముద్రములో ముంచేస్తారు. శివబాబా అత్యంత ప్రియమైనవారు. తండ్రి అంటారు - నా లింగాన్ని కూడా మట్టితో తయారు చేసి పూజ చేసి మళ్లీ పగులగొడ్తారు. ఉదయము తయారు చేస్తారు, సాయంకాలము కూల్చేస్తారు. ఇదంతా భక్తిమార్గము, అంధ విశ్వాసముతో చేసే పూజ. మీరే పూజ్యులు, మీరే పూజారులని మనుష్యులు గాయనము కూడా చేస్తారు. తండ్రి చెప్తారు - నేనైతే సదా పూజ్యుడను. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను. 21 జన్మలకు రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. భక్తిలో అల్పకాల సుఖముంటుంది. దీనిని సన్యాసులు కాకిరెట్టకు సమానమైన సుఖమని అంటారు. సన్యాసులు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు. అది హద్దులోని సన్యాసము. హఠయోగులు కదా. భగవంతుని గురించి తెలియనే తెలియదు. బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వమైతే భగవంతుడు కాదు. భగవంతుడైతే ఒకే ఒక నిరాకారి శివుడు, వారే సర్వాత్మలకు తండ్రి. బ్రహ్మతత్వము ఆత్మలైన మన నివాస స్థానము. అది బ్రహ్మాండము, మధురమైన ఇల్లు. అక్కడ నుండి ఆత్మలమైన మనము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. భారతవాసులకే 84 జన్మలు ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో, వారే జ్ఞానము కూడా ఎక్కువగా తీసుకుంటారు. తండ్రి చెప్తారు - పిల్లలారా! భలే గృహస్థ వ్యవహారములో ఉండండి కాని శ్రీమతమును అనుసరించండి. ఆత్మలైన మీరంతా ప్రియతముడైన ఒక్క పరమాత్ముని ప్రేయసులు. ద్వాపరము నుండి మీరు స్మృతి చేస్తూ వచ్చారు. దు:ఖములో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. ఇది అయితే దు:ఖధామము. ఆత్మలు వాస్తవానికి శాంతిధామ నివాసులు. తర్వాత సుఖధామములోకి వస్తారు. మళ్లీ మనము 84 జన్మలు తీసుకున్నాము. '' హమ్‌ సో, సో హమ్‌ '' అర్థము కూడా అర్థం చేయించబడింది. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని వారు అనేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మయే పరమాత్మ ఎలా అవ్వగలదు ? పరమాత్మ అయితే ఒక్కరే. మిగిలిన వారందరూ వారి పిల్లలు. సాధు-సత్పురుషులు మొదలైనవారు కూడా హమ్‌ సో యొక్క అర్థాన్ని తప్పుగా చెప్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - హమ్‌ సో అర్థము - నేను ఆత్మ సత్యయుగములో దేవీ దేవతగా ఉండినాను, మళ్లీ(హమ్‌ సో) నేనే క్షత్రియునిగా, నేనే వైశ్యునిగా, నేనే శూద్రునిగా అయ్యాను. ఇప్పుడు మళ్లీ (హమ్‌ సో) నేనే దేవతగా అయ్యేందుకు బ్రాహ్మణునిగా అయ్యాను. ఇదే యదార్థమైన అర్థము. అది పూర్తిగా తప్పు. తండ్రి చెప్తున్నారు - మనుష్యులు రావణుని మతమును అనుసరిస్తూ ఎంత అసత్యంగా అయిపోయారు! కనుకనే అసత్యపు మాయ, అసత్యపు కాయ.........(ఝూఠీ మాయా, ఝూఠీ కాయా,...) అనే సామెత ఉంది. సత్యయుగములో ఇలా అనరు. అది సత్య ఖండము. అక్కడ అసత్యానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఇక్కడ సత్యానికి నామ-రూపాలు లేవు. అయినా పిండిలో ఉప్పు ఉన్నంత సత్యమని అంటారు. సత్యయుగములో దైవీగుణాలు కలిగిన మనుష్యులు ఉంటారు. వారిది దేవతా ధర్మము. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. కనుక ద్వైతము ఏర్పడింది. ద్వాపరము నుండి ఆసురీ రావణ రాజ్యము ప్రారంభమైపోతుంది. సత్యయుగములో రావణ రాజ్యము కూడా ఉండదు కనుక 5 వికారాలు కూడా ఉండవు. వారు(లక్ష్మి నారాయణులు) సంపూర్ణ నిర్వికారులు, సీతా-రాములను 14 కళా సంపూర్ణులని అంటారు. రామునికి బాణాలను ఎందుకు ఇచ్చారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అక్కడ హింస మాటే లేదు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. వారు తండ్రి కూడా అయ్యారు. మీరు విద్యార్థులు కావున వారు టీచరు కూడా అయ్యారు. మళ్లీ పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు కనుక సద్గురువు కూడా అయ్యారు. తండి, టీచరు, గురువు ముగ్గురూ వారే అయ్యారు. వారికి మీరు సంతానంగా అయ్యారు కావున మీకు ఎంత ఖుషీ ఉండాలి! ఇప్పుడిది రావణ రాజ్యమని పిల్లలైన మీకు తెలుసు. రావణుడు భారతదేశానికి అందరికన్నా పెద్ద శత్రువు. ఈ జ్ఞానము కూడా పిల్లలైన మీకు జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా లభించింది. ఆ తండ్రియే జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. జ్ఞానసాగరుని నుండి జ్ఞాన మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని వెళ్లి జ్ఞానాన్ని వర్షిస్తారు. జ్ఞాన గంగలు మీరే. మీకే మహిమ ఉంది. అంతేగాని నీటి గంగలో స్నానము చేయడం వలన ఎవ్వరూ పావనంగా అవ్వనే అవ్వరు. మలినమైన మురికి నీటిలో స్నానము చేసి కూడా మేము పావనమైపోతామని భావిస్తారు. జలపాతాల నీటికి కూడా చాలా మహత్వాన్ని ఇస్తారు. ఇదంతా భక్తి మార్గము. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము.

తండ్రి చెప్తారు - పిల్లలారా, నేను ఇప్పుడు మిమ్ములను పావనంగా చేసేందుకు వచ్చాను. ఈ ఒక్క జన్మ నన్ను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి. అప్పుడు మీరు సతోప్రధానంగా అయిపోతారు. పతితపావనుడను నేనే. స్మృతియాత్రను సాధ్యమైనంత వరకు పెంచుకోండి. నోటి ద్వారా శివబాబా, శివబాబా అని అనరాదు. ఎలా ప్రేయసి ప్రియతముని స్మృతి చేస్తుందో, ఒక్కసారి చూస్తే చాలు బుద్ధిలో అతని స్మృతి ఉండిపోతుంది. భక్తిలో ఎవరు ఎవరిని స్మృతి చేస్తారో, ఎవరిని పూజిస్తారో వారి సాక్షాత్కారము జరుగుతుంది కానీ అదంతా అల్పకాలము కొరకు. భక్తి ద్వారా క్రిందికే దిగుతూ వచ్చారు. ఇప్పుడైతే మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది. హాహాకారాల తర్వాతనే జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. భారతదేశములోనే రక్త నదులు ప్రవహించనున్నవి. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి. కాని కల్పక్రితము ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే ఇప్పుడు కూడా అవుతారు. వారే వచ్చి తండ్రి నుండి వారసత్వమును పూర్తిగా తీసుకుంటారు. ఒకవేళ తక్కువ భక్తి చేసి ఉంటే జ్ఞానము కూడా పూర్తిగా తీసుకోరు. తర్వాత మళ్లీ ప్రజలలో నంబరువారుగా పదవిని పొందుతారు. మంచి పురుషార్థులు అడుగడుగునా శ్రీమతమును అనుసరించి మంచి పదవిని పొందుతారు. మంచి గుణాల మర్యాదలు కూడా అవసరము. దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. అవి మళ్లీ 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరిలో ఆసురీ గుణాలున్నాయి ఎందుకంటే ఇది పతిత ప్రపంచము కదా. పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర-భూగోళముల గురించి కూడా అర్థం చేయించబడింది. ఈ సమయములో తండ్రి చెప్తారు - పిల్లలారా, స్మృతి చేసేందుకు బాగా శ్రమ చేసినట్లయితే మీరు సత్యమైన బంగారముగా తయారౌతారు. సత్యయుగమంటే స్వర్ణిమ యుగము, సత్యమైన బంగారము. తర్వాత మళ్లీ త్రేతా యుగములో వెండి కల్తీగా చేరుతుంది కనుక కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు ఒక్క కళా లేదు. అందరూ కళా విహీనంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మీరు పాత్రధారులు కదా. మేము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రధారి ఒకవేళ డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోనట్లయితే వారిని అవివేకులని అంటారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు - అందరూ ఎంత అవివేకులుగా(తెలివి హీనులుగా) అయిపోయారు! ఇప్పుడు నేను మిమ్ములను బుద్ధివంతులుగా, వజ్ర సమానంగా తయారు చేస్తాను. మళ్లీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము జరుగనున్నది. అందరినీ దోమల వలె తీసుకెళ్తాను. మీ ముఖ్య ఉద్ధేశ్యము ఎదురుగా నిలిచి ఉంది. ఇలా (లక్ష్మీ నారాయణులుగా) తయారవ్వాలి. అప్పుడే మీరు స్వర్గ వాసులుగా అవుతారు. బి.కెలైన మీరు ఈ పురుషార్థము చేస్తున్నారు. కాని మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా ఉన్నందున ఇంతమంది బి.కెలు ఉన్నారు కనుక తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉంటారని అర్థం చేసుకోరు. బ్రాహ్మణులు శిఖ సమానమైనవారు. బ్రాహ్మణులుగా ఉన్న మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. వారు చిత్రాలలో బ్రాహ్మణులను, శివుడిని ఇరువురినీ మాయం చేసేశారు. బ్రాహ్మణులు ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేఘాలైన మీరు జ్ఞాన సాగరుని నుండి జ్ఞానాన్ని నింపుకొని అందరి పై జ్ఞాన వర్షాన్ని కురిపించాలి. వీలైనంత ఎక్కువగా స్మృతియాత్రను కూడా పెంచుకోవాలి. స్మృతి ద్వారానే సత్యమైన బంగారముగా తయారవ్వాలి.
2. శ్రీమతమును అనుసరించి మంచి మర్యాదలను మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. సత్య ఖండములోకి వెళ్లేందుకు చాలా చాలా సత్యంగా తయారవ్వాలి. 

వరదానము :- ''మాస్టర్‌ నాలెడ్జ్‌ఫుల్‌గా(మాస్టర్‌ జ్ఞానసాగరులుగా) తయారై 5 వేల సంవత్సరాల జన్మపత్రిని(జాతకాన్ని) తెలుసుకునే స్వదర్శన చక్రధారీ భవ''
ఎవరైతే ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతారో, వారే భవిష్యత్తులో చక్రవర్తి రాజుల పదవికి(రాజ్య భాగ్యానికి) అధికారులుగా అవుతారు. స్వదర్శన చక్రధారులనగా మొత్తం చక్రమంతటిలో తమ భిన్న-భిన్న పాత్రలన్నీ తెలిసినవారు. పిల్లలైన మీరు విశేషంగా ఈ సమయంలో 5 వేల సంవత్సరాల జాతకాన్ని తెలుసుకొని మాస్టర్‌ జ్ఞానసాగరులుగా అయిపోయారు. ఈ అంతిమ జన్మలో జీవితాన్ని వజ్ర తుల్యంగా చేసుకోవడం ద్వారా మొత్తం విశ్వమంతటిలో హీరో పాత్రను అభినయించే హీరోలుగా అయిపోతారనే విశేషమైన విషయాన్ని తెలుసుకున్నారు. 

స్లోగన్‌ :- ''మీ సాథీలకు (స్నేహితులకు, జతలో ఉన్నవారికి) కూడా తండ్రి సాంగత్య రంగును వేస్తే (అంటిస్తే) వారి సాంగత్య రంగు మీకు అంటుకోదు.''
 

No comments:

Post a Comment