03-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ఏ దేహధారులను స్మృతి చేసినా మీకు ముక్తి -జీవన్ముక్తులు
లభించజాలవు. తండ్రి ఒక్కరు మాత్రమే మీకు డైరెక్టుగా (నేరుగా/ప్రత్యక్షముగా)
ఈ వారసత్వమును ఇస్తారు''
ప్రశ్న:- తండ్రివారైన పిదప కూడా మాయ ఏ పిల్లలను తన వైపుకు ఈడ్చుకుపోతుంది?
ఉత్తరం:- ఎవరి
బుద్ధి యోగము పాత సంబంధాలలో తిరుగుతూ ఉంటుందో, సంపూర్ణ జ్ఞానము ఎవరికి
ఉండదో లేక ఏవైనా పాత అలవాట్లుంటాయో అటువ౦టి పిల్లలను మాయ తనవైపుకు
లాక్కొనిపోతుంది. బయటి ప్రపంచ సాంగత్యము కూడా చాలా అశుద్ధంగా ఉంది. అది
అంతము చేసేస్తుంది. సాంగత్య ప్రభావము చాలా త్వరగా పడ్తుంది. అందువలన బాబా
అంటున్నారు - పిల్లలూ, ఒక్క తండ్రితో మాత్రమే మీ బుద్ధియోగమును ఉంచుకోండి.
ఒక్క తండ్రిని మాత్రమే అనుసరించండి(ఫాలో చేయండి). ఏ దేహధారుల పై ప్రీతిని
ఉంచకండి.
పాట:- మిమ్ములను పొంది మేము ప్రప౦చమునే పొందుకున్నాము...... (తుమ్ హె పాకె హమ్‌నే జహాన్ పాలియా,......) 
ఓంశాంతి. మధురాతి
మధురమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తోందని
తెలుసు. ఇది చాలా అర్థము చేసుకునే విషయము. పరమపిత పరమాత్మ తమ తమ ధర్మాలను
స్థాపన చేసేందుకు ధర్మస్థాపకులందరినీ పంపిస్తారనే మాట వాడుకలో ఉంది. కనుక
వారు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. అంతేకాని వారు ఎవ్వరికీ
వారసత్వమునిస్తారని కాదు. ఇవ్వరు. వారసత్వపు ప్రస్తావనే రాదు.
వారసత్వమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఏసుక్రీస్తు ఆత్మ అందరికీ
వారసత్వమునిచ్చే తండ్రి కాదు. క్రైస్తవులకు కూడా వారసత్వమునిచ్చే తండ్రి
ఏసుక్రీస్తు కాదు. ఇచ్చినారనుకోండి, ఏ వారసత్వమునిస్తారు? అనే ప్రశ్న
తలెత్తుతుంది. వారసత్వాన్ని ఎవరికిస్తారు? అతడు ధర్మస్థాపన చేసేందుకే
వస్తాడు. అతని వెనుక క్రైస్తవ ధర్మానికి చెందిన ఇతర ఆత్మలు వస్తూ ఉంటారు.
వారసత్వము మాటే లేదు. వారసత్వము తండ్రి నుండే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇబ్రహీమ్, బుద్ధుడు, ఏసుక్రీస్తు మొదలైన వారు వచ్చారనుకోండి, వారేం
చేశారు? వారసత్వము ఎవరికిచ్చారు? ఎవ్వరికీ ఇవ్వలేదు. వారసత్వమిచ్చు
కర్తవ్యము తండ్రిదే. వారైతే స్వయంగా వస్తారు. ఆత్మలు వస్తూ ఉంటాయి. జనాభా
వృద్ధి చెందుతూ ఉంటుంది. వారసత్వము ఎల్లప్పుడూ సృష్టికర్త
(రచయిత/క్రియేటర్) ద్వారానే లభిస్తుంది. క్రియేటర్ ఒకరేమో లౌకిక తండ్రి,
రెండవ వారు పారలౌకిక తండ్రి. ఇది ధారణ చేయవలసిన విషయము. ధారణ కూడా ఇతరులకు
దానము చేసేవారికే జరుగుతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలందరికీ
వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. అనంతమైన తండ్రియే పిల్లలకు అనంతమైన
వారసత్వమునిస్తారు. క్రైస్తవులు, ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారందరి తండ్రి
ఒక్కరే. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. ఏసుక్రీస్తు కూడా గాడ్
ఫాదర్ అని అన్నాడు. తండ్రిని ఎప్పుడూ మర్చిపోరు. గాడ్‌ఫాదర్ అని ఒక్క
నిరాకారుని మాత్రమే అంటారు. నిరాకార ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. ధర్మ
స్థాపకులకు కూడా ఆ నిరాకారుడు ఒక్కరే తండ్రి. వారి ద్వారానే వారసత్వము
లభిస్తుంది. వారిని అందరూ గాడ్‌ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. ఒక భారతదేశములో
మాత్రమే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. భారతదేశము నుండే మిగిలినవారందరూ
సర్వవ్యాపి అనే మాట నేర్చుకున్నారు. ఒక్కవేళ ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే
అందరూ ఈశ్వరుని ఎందుకు స్మృతి చేస్తారు? సాధుసత్పురుషులు సాధన లేక ప్రార్థన
ఎవరిని చేస్తారు? తండ్రి అడుగుతారు కదా. సర్వుల సృష్టికర్త ఒక్కరే. వారే
పతితపావనులు. సత్యయుగములో అందరూ పావనంగానే ఉంటారు. మళ్లీ పతితులుగా ఎలా
అవుతారు? దేవతలే వామమార్గములోకి వెళ్తారని వ్రాశారు. ఇప్పుడు మళ్లీ పావన
ప్రపంచము తయారౌతూ ఉంది. ద్వాపర యుగము ఆది నుండి పతిత ప్రపంచము
ప్రారంభమౌతుంది. ఈశ్వరీయ రాజ్యము, ఆసురీ రాజ్యము చెరి సగముగా ఉన్నాయి. ఇది
భారతదేశపు విషయము మాత్రమే. రావణుని భారతదేశములోనే తగులబెడ్తారు. అందువలన
బాబా అర్థం చేయించారు - ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరికీ వారసత్వమును ఇవ్వరు.
పోతే ధర్మస్థాపన మాత్రం చేస్తారు. అందుకే వారిని స్మృతి చేస్తారు. కాని
ఏసుక్రీస్తును, బ్రహ్మను, విష్ణువును లేక శంకరుని స్మృతి చేసినా లేక వారిని
ప్రార్థన చేసినా, వారు ఏమీ ఇవ్వలేరు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు
సన్ముఖములో రావలసి వస్తుంది. కృష్ణునిలో పరమాత్ముడు వస్తారని అంటే ఎవ్వరూ
అంగీకరించరు. తండ్రి అంటున్నారు - నేను ఆత్మలైన మీకు వారసత్వమునిచ్చేందుకు
కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తాను. వారసత్వమును తండ్రి పిల్లలకు ఇస్తారు.
తండ్రి అని ఇరువురిని మాత్రమే అంటారు - ఒకరేమో శరీరానికి తండ్రి, రెండవ
వారు ఆత్మలకు తండ్రి. వీరిరువురు తప్ప ఇతరులెవ్వరూ తండ్రి అవ్వలేరు. మీకు ఈ
బాబా అనగా ప్రజాపిత బ్రహ్మ ద్వారా వారసత్వము లభించదు. వారసత్వము ఒక్క
శివబాబా నుండి మాత్రమే లభిస్తుంది. బ్రహ్మ కూడా వారి నుండే వారసత్వము
తీసుకుంటారు. వారు సర్వుల సద్గతిదాత. సర్వుల ముక్తి-జీవన్ముక్తి దాత కూడా
వారే. అందువలన మొట్టమొదట ఎవ్వరికైనా త౦డ్రి పరిచయమునివ్వాల్సి ఉంటుంది.
సాధారణంగా ఏ పెద్దవారినైనా బాబా అని లేక పితాజీ అని అంటారు. కాని వారు
నిజమైన తండ్రి కారు. ఒకరేమో లౌకిక తండ్రి, రెండవవారేమో పారలౌకిక తండ్రి. ఈ
బ్రహ్మ కూడా శారీరిక తండ్రి మాత్రమే. పిల్లలైన మిమ్ములను దత్తత
చేసుకుంటారు. భలే మీరు బ్రహ్మను బాబా అని అంటారు కాని వారసత్వమైతే లభించేది
శివబాబా నుండే కదా. ఏ వారసత్వము? సద్గతి, దుర్గతి మరియు జీవన బంధనము నుండి
అయితే అందరూ విడుదల అవుతారు. ఈ సమయములో ముఖ్యంగా భారతదేశము జనరల్‌గా
మొత్తము ప్రపంచము, రావణుని బంధనములో ఉన్నారు. మొట్టమొదట వచ్చే ఆత్మలు ఏవైతే
ఉన్నాయో మొదట జీవన్ముక్తులుగా తర్వాత జీవన బంధనములోకి వస్తారు. మొదట
సుఖాన్ని తర్వాత దు:ఖాన్ని అనుభవిస్తారు. ఇది బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి.
ఏ దేహధారిని స్మృతి చేసినా ముక్తి - జీవన్ముక్తులు లభించజాలవు. సందేశకులు
కూడా వారసత్వమును ఎవ్వరికీ ఇవ్వరు. ముక్తి-జీవన్ముక్తుల వారసత్వము తండ్రే
స్వయంగా వచ్చి ఇస్తారు. కాని కొంతమందికి డైరెక్టు (నేరు)గా, కొంతమందికి
ఇన్‌డైరెక్టు(పరోక్షముగా) ఇస్తారు. పిల్లలైన మీ సన్ముఖములోనే తండ్రి
ఉంటారు. రోజులు గడిచిన కొలది బాబా మధువనము నుండి బయటకు ఎక్కడికీ వెళ్లరు. ఈ
పాత ప్రపంచములో ఆశించతగింది ఇంకా ఏముంది? శివబాబా అంటున్నారు - నాకు
స్వర్గములోకి వెళ్లడం గానీ లేక కనీసము స్వర్గమును చూచేందుకు కూడా
ఇష్టముండదు, ఖుషీ ఉండదు. అటువంటప్పుడు ఈ పాత ప్రపంచములో నేను ఎచ్చటికి
వెళ్తాను? నా పాత్రనే పాత ప్రపంచములో వచ్చే పాత్ర. ప్రపంచములో 7 అద్బుతాలు
ఉన్నాయని అంటారు కాని అందులో స్వర్గము పేరు చెప్పరు. స్వర్గమైతే తర్వాత
వస్తుంది. నేను పతిత ప్రపంచములో, పతిత శరీరములో, పరాయి రాజ్యములో రావలసి
వస్తుంది. దూరదేశములో ఉండేవారు పరాయిదేశములోకి వచ్చారని పాడ్తారు కదా.....
పిల్లలైన మీరు మాత్రమే దీనిని అర్థము చేసుకోగలరు. ఇప్పుడు మనము పురుషార్థము
చేస్తున్నాము, మళ్లీ మన రాజ్యములోకి, మన దేశములోకి వస్తాము. ద్వాపరము
తర్వాత ఏ ఆత్మలైతే వస్తాయో అవి పరాయి రాజ్యములో అనగా రావణ రాజ్యములో
వస్తాయి. వారు పావన రాజ్యములో అయితే రారు. వారికి కొద్దిగా సుఖము, కొద్దిగా
దు:ఖాల పాత్ర ఉంది. మీరు సత్యయుగము నుండి సంపూర్ణ సుఖమును చూస్తారు. ప్రతి
ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. తండ్రి పిల్లలైన మీ ముందు కూర్చుని
తాను ఏ విధంగా దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారో, ఆ రహస్యాన్ని
తెలుపుచున్నారు. అందులో సుఖమే సుఖముంటుంది. దానిలోకి వచ్చేందుకు మిమ్ములను
అర్హులుగా చేస్తాను. మనము స్వర్గానికి యజమానులుగా ఉండినామని తర్వాత మాయ
పూర్తిగా అనర్హులుగా చేసిందని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు
మీరు ఎంతో తెలివిహీనులుగా అయ్యారు. నారదుని కథ ఉంది కదా. తంబూరాను వాయించే
భక్తుడైన నారదుడు లక్ష్మీని ఎలా వరించగలడు? రాజయోగము నేర్చుకుని పవిత్రంగా
అవ్వనంతవరకు లక్ష్మిని వరించలేరని మీరు అర్థం చేసుకున్నారు. శరీరాలేమో
అందరివీ భ్రష్టాచారమైనవే. ఎందుకంటే భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు.
మీరేమో ముఖవంశావళి వారు. ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. రచయిత-రచనల
జ్ఞానాన్ని స్వయంగా తండ్రే వచ్చి ఇస్తారు. అన్ని పాయింట్లు ఎవ్వరూ అర్థము
కూడా చేసుకోలేరు. ఇచ్చట నుండి బయటికి వెళ్తూనే ఎవరి సాంగత్యమైనా లభిస్తూనే
సమాప్తమైపోతుంది. మంచి సాంగత్యము తేలుస్తుందని, చెడు సాంగత్యము
ముంచుతుందని......కూడా అంటారు. భలే ఇచ్చట కూర్చుని ఉన్నా బుద్ధి యోగము
పూర్తిగా ఇచ్చట లేదు. జ్ఞానము లేకుంటే సాంగత్య దోషములో క్రిందకు పడిపోతారు.
ఎవరికైనా, ఏదైనా అలవాటుంటే వారి సాంగత్యములోకి వెళ్లినందున వారి ప్రభావము
వెంటనే పడ్తుంది. ఇచ్చట ఉండేది బాబా సాంగత్యము. ఎవరైతే మళ్లీ తండ్రిని ఫాలో
చేస్తారో, వారు ఇతరులను కూడా ఉద్ధరిస్తారు. వారే ఉన్నత పదవిని పొందుతారు.
చాలామంది క్రొత్త క్రొత్త పిల్లలు బాబా మేము ఉద్యోగము మొదలైనవి వదిలి ఈ
సేవలో లగ్నమవ్వమంటారా? అని అడుగుతారు. బాబా అంటున్నారు - పోను పోను మాయ
ముక్కును ఎలా పట్టుకుంటుందంటే, ఆ మాటే అడగవద్దు (చాలా గట్టిగా, ఊపిరి
ఆడకుండా పట్టుకుంటుంది). ఈ విధంగా చాలామంది వదిలి వెళ్ళిపోయారని అనుభవము
చెప్తుంది. ఈశ్వరీయ జన్మ అయితే తీసుకుంటారు కాని మాయ తన వైపుకు
ఈడ్చుకుపోయింది. చాలా మంచి మంచి పిల్లలకు మాయ ఒక ఘూసా ఇచ్చి మూర్ఛితులుగా
(ముష్ఠి ఘాతముతో) చేస్తుంది. ఎవరి బుద్ధియోగము బయట తిరుగుతూ ఉంటుందో, పాత
సంబంధాలు మొదలైనవాటిలోకి పోతూ ఉంటుందో వారిని మూర్ఛితులుగా చేస్తుంది.
అందువలన దేహధారులతో బుద్ధియోగమును ఎక్కువగా ఉంచుకోకండి అని బాబా
అంటున్నారు. ఈ బాబా పై కూడా మీకు ఎంత ప్రేమ ఉండినా, ఇతనితో బుద్ధియోగమును
జోడించకండి. తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమవ్వవు. ఏ శరీరధారి
పైనా ప్రీతిని ఉంచకండి. సత్సంగాలలో వినిపించే వారందరూ శరీరధారులే. ఏదో ఒక
మహాత్ముని పేరు చెప్తుంటారు. పరమపిత పరమాత్మ శివుడు మనలను చదివిస్తున్నారని
ఎవ్వరూ చెప్పరు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఈ రచనకు
మరియు ఈ సృష్టికి నేను చైతన్య బీజమును. నాకు మొత్తం ఈ కల్పవృక్ష జ్ఞానమంతా
పూర్తిగా ఉంది. అది జడ బీజము, చైతన్య బీజమైతే వినిపించేది (చెప్తుంది).
బీజమైన నాలో వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా పూర్తిగా ఉంటుంది. ఇది
అనంతమైన విషయము. ఇప్పుడుండేది తమోప్రధాన రాజ్యము. అందువలన దీని ఆడంబరము
తప్పక ఎక్కువగానే ఉంటుంది. జ్ఞానేశ్వరుడు, గంగేశ్వరానందుడు,
నిత్యానందుడు,.......మొదలైన గొప్ప గొప్ప పేర్లుంచుకుంటారు. కాని సత్యమైన
ఆనందము ఎవ్వరికీ లభించజాలదు. సన్యాసులు స్వయంగా సుఖము కాకిరెట్టకు సమానమని
అంటారు. కాని స్వర్గమనే పేరు మాత్రము మర్చిపోరు. ఫలానావారు
స్వర్గస్థులైనారని అంటారు. మళ్లీ వారిని పితృదేవతలని క్రిందికి పిలుస్తారు.
ఆత్మ ఎవరిలోనైనా ప్రవేశించి మాట్లాడ్తుంది. కాని ఆత్మ ఎలా వస్తుందో,
ఎవ్వరికీ తెలియదు. శరీరము ఇతరులది, తినేది కూడా వారి ఆత్మనే. వారి
కడుపులోకే పోతుంది. కాని వచ్చిన ఆత్మ వాసనను మాత్రము అనుభవిస్తుంది.
శివబాబా అయితే అభోక్త. ఏమీ భుజించరు. మమ్మా ఆత్మ వస్తే భుజిస్తుంది. అలాగే
పితృలు వచ్చినా, భుజిస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. ఆ ఒక్కరినే
తప్ప ఇతరులెవ్వరినీ బాబా అని అనరు. ఇతని (బ్రహ్మబాబా) ద్వారా వారసత్వమేమి
లభిస్తుంది? ఏమీ లభించజాలదు. ఏసుక్రీస్తు ఏదైనా వారసత్వమిచ్చాడా? వారేమో
యుద్ధము చేసి రాజ్యస్థాపన చేశారు. క్రైస్తవులు యుద్ధము చేశారు. ధన వృద్ధి
జరిగినప్పుడు, ధనము కూడబెట్టుకున్నప్పుడు, రాజ్యపాలన నడుస్తుంది. అంతేగాని
ఏసుక్రీస్తు రాజ్యమిచ్చినారని అనరు. రాజ్యపదవి మీ పురుషార్థానుసారము,
డ్రామా ప్లాను అనుసారము లభిస్తుందని బాబా అంటారు. పోతే మనుష్యులు ఎవ్వరికీ
ఏమీ ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా, ఇది అల్పకాలిక సుఖము. ఇప్పుడంతా తమోప్రధానంగా
ఉంది. మాయ జోరు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు మాయతో యుద్ధము చేయాలి.
మాయను జయిస్తే జగత్‌జీతులుగా అవుతారు. మనుష్యులు శాంతిగా ఉండేందుకు ఎంతగానో
బుర్ర బద్దలు కొట్టుకుంటారు. మనస్సు ఊరికే శాంతిగా ఉండలేదు. వారు ఏదో ఒకటి
నేర్చుకుంటారు. కొంతమంది హిప్నాటిజమ్ (కృత్రిమ నిద్రను కలిగించి వశము
చేసుకోవడం) మొదలైనవి చేసి తెలివి తప్పిపోవునట్లు చేస్తారు. శ్రమ
కలుగుతుంది. కొంతమంది మెదడే చెడిపోతుంది. తండ్రి అంటున్నారు-ఏదైనా
కర్మబంధనములోకి లేక బంధుమిత్రులు మొదలైనవారి పైకి బుద్ధి వెళ్తూ ఉంటే,
వికర్మలు వినాశనమవ్వవు. దేహధారుల నుండి బుద్ధిని తొలగించాలి. అందరినీ
మర్చిపోండి. మీరు మరణిస్తే, మీకు ప్రపంచము మరణిస్తుంది. ప్రపంచాన్ని స్మృతి
చేస్తే, మీకు దండన పడ్తుంది. బాబా, '' మేము మరణించామని'' మీరంటారు. ''మేము
మీ వారిమి.'' మరి బంధు మిత్రులు మొదలైనవారి వైపు బుద్ధి ఎందుకు పోతుంది?
అనగా మీరు మరణించలేదు! తండ్రివారిగా అవ్వలేదని అర్థము. చాలా మందికి
రాత్రింబవళ్లు వారి కర్మ బంధనాల చింతయే ఉంటుంది. స్మృతి చేసేందుకు
కూర్చున్నా వారికి అవే సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఇచ్చట బాబా ఒడిలో
ఉంటున్నారనగా మరణించారు కదా. అందువలన మీ బుద్ధియోగము ఎటూ వెళ్ళరాదు.
సన్యాసులైతే ఇల్లు-వాకిళ్ళు వదిలేస్తారు అనగా మరణించారు. ఒకవేళ ఇంకా స్మృతి
వస్తూ ఉంటే, యోగములో ఎలా ఉంటారు? కొంతమంది మళ్లీ ఇంటికి తిరిగి
వచ్చేస్తారు కూడా. కొంతమంది పక్కాగా అయిపోతారు. వారికి బొత్తిగా గుర్తుకు
రాదు. పిల్లలైన మీ బుద్ధి కూడా బయటకు వెళ్తూ ఉంటే ఉన్నత పదవిని పొందలేరు.
పిల్లలుగా అయ్యి ఉంటే, తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. మోహము ఏ మాత్రమూ
ఉండరాదు. కాని భాగ్యములో లేకుంటే మరణించి కూడా అటువైపు వెళ్లిపోతారు. 5
శాతము బుద్ధి ఇక్కడ, 95 శాతము అక్కడ ఉంటుంది. తిరుగుతూ, వెతుకుతూ ఉంటుంది.
ఇటు కాకుండా, అటు కాకుండా అయిపోతారు. తండ్రివారుగా అవుతే ఇక ఆ బుద్ధే
సమాప్తమవుతుంది. మీరు మరణించారు. ఈ బేహద్ సన్యాసములో ఎవరో, విశేషమైనవారు
మాత్రమే వస్తారు. అటువంటివారే మాలలోని మణులుగా అవ్వగలరు. ఇది గొప్ప
అదృష్టము. వాస్తవానికి ఇచ్చట వచ్చి ఉండువారికి శ్రమ అనిపించరాదు. కాని
ఇచ్చట వచ్చి ఉండేవారికే శ్రమ ఎక్కువగా ఉన్నట్లు గమనించబడ్తుంది. బయట
ఉండువారు చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవ్వరి పైనా మోహముండదు. ఈ
బంధనాలు తొలగిపోతే సేవలో లగ్నమైపోతామని అనుకుంటారు. జ్ఞానములో పక్కాగా
ఉన్నారా? అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ కచ్ఛాగా ఉండి పతి మరణిస్తే,
పుండు పై ఉప్పు చల్లినట్లౌతుంది. పూర్తిగా మరణించినంతవరకు గాయము పై ఉప్పు
పడ్తూనే ఉంటుంది. ఇచ్చటైతే, బాబా అని అంటే చాలు, బాబావారిగా అయిపోయారు, పాత
సంబంధాలన్నీ వదిలిపోయాయి. వారికి తెలియాలి. వారి కర్మలకు తెలియాలి. మధ్యలో
మనకెందుకు? ఇంత పొంగు ఉత్సాహముండాలి అయితే ఇలాంటివారు చాలా కొద్దిమంది
మాత్రమే ఉన్నారు. తండ్రి లభించారు అంతే చాలు. ఎవరిని గురించిన చింతా లేదు.
ఇంత ధైర్యముండాలి. సత్యమైన హృదయముతో శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉంటే
ఎవ్వరూ ఆపలేరు. పవిత్రంగా అయ్యేందులో ఎవ్వరూ విఘ్నము కలిగించలేరు. మంచిది.
మధురాతి
మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మ బంధనాలను చింతన చేయరాదు. బుద్ధిని దేహధారుల నుండి తొలగించాలి. అనంతమైన సన్యాసము చేయాలి.
2. బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. సత్యమైన హృదయముండాలి. జ్ఞానములో పక్కాగా ధైర్యంగా ఉండాలి.
వరదానము:- ''నాది (మేరాపన్) అనే దోషాన్ని సమాప్తం చేసి నిండుతనాన్ని (సంపన్నతను) అనుభవం చేసే సంపూర్ణ ట్రస్టీ భవ''
ఒకవేళ
తండ్రి శ్రీమతానుసారము నిమిత్తముగా ఉంటే ప్రవృత్తీ మీది కాదు, సెంటరూ మీది
కాదు. ప్రవృత్తిలో ఉండినా ట్రస్టీలే, సెంటరులో ఉండినా అది తండ్రి సెంటరే
గాని మీ సెంటరు కాదు. అందువలన సదా అది శివుని భండారమే, బ్రహ్మబాబా భండారమే -
ఈ స్మృతి ద్వారా సంపన్నతను అనుభవం చేస్తారు. నాది అనేది ఉంటే భండారము
గాని, వంట ఇల్లు గాని వృద్ధి చెందవు. ఏ కార్యములో అయినా ఏదైనా దోషము అనగా
లోపముంటే అందుకు కారణం తండ్రి కాదు. అందుకు బదులు 'నాది (మేరాపన్)' అనే
దోషము అనగా అశుద్ధత మిక్స్ అయి ఉంటుంది.
No comments:
Post a Comment