Thursday, 18 January 2018

Telugu Murli 09/01/18

09-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు మీరు ఈ పాఠశాలకు వచ్చారు. మీరు నిరాకార తండ్రి ద్వారా చదువుకొని రాజాధి రాజులుగా తయారవ్వాలి '' 

ప్రశ్న :- చాలామంది పిల్లలు భాగ్యశాలీ పిల్లలే, కాని వారు దౌర్భాగ్యశాలురుగా ఎలా అవుతారు?
జవాబు :- ఎవరికైతే ఏ కర్మ బంధనాలూ లేవో అనగా కర్మ బంధనముక్తులుగా ఉన్నారో, ఆ పిల్లలు భాగ్యశాలురు. అయినా వారు చదువు పై గమనమివ్వకుంటే బుద్ధి అటు - ఇటు భ్రమిస్తూ ఉంటే ఏ తండ్రి నుండి ఇంత గొప్ప వారసత్వము లభిస్తుందో, వారిని స్మృతి చేయకుంటే భాగ్యశాలురుగా ఉండినా వారిని దౌర్భాగ్యశాలురనే అంటారు.

ప్రశ్న :- శ్రీమతములో ఏ ఏ రసాలు నిండి ఉన్నాయి?
జవాబు :- ఎందులో అయితే మాత-పిత-తండ్రి-టీచరు-గురువు అందరి మతము కలిసి ఒక్కటిగా ఉంటుందో, అదే శ్రీమతము. శ్రీమతము చాలా మధురమైన శ్యాక్రీన్‌ వంటిది. అందులో ఈ రహస్యాలన్నీ నిండి ఉన్నాయి. 

పాట :- నేను భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ,..........( తక్‌దీర్‌ జగాకర్‌ ఆయీ హూ,........) 
ఓంశాంతి. శివభగవానువాచ - మనుష్యులు గీతను వినిపించినప్పుడు కృష్ణుని పేరును చెప్తూ వినిపిస్తారు. అయితే ఇచ్చట ఏదైతే వినిపిస్తారో, దానిని ' శివభగవానువాచ! అని అంటారు. శివభగవానువాచ అని స్వయం మీరు కూడా అనవచ్చు. ఎందుకంటే స్వయం శివబాబాయే మాట్లాడ్తారు. ఇరువురూ కలిసి కూడా మాట్లాడగలరు. పిల్లలు వారిరువురికీ పిల్లలుగానే అవుతారు. కుమారులు, కుమారీలు ఇరువురూ కూర్చుని ఉన్నారు. కావున పిల్లలైన మిమ్ములను ఎవరు చదివిస్తున్నారో అర్థమయ్యిందా? బాప్‌దాదా చదివిస్తున్నారని అంటారు. పెద్దవారిని 'తండ్రి' అని, చిన్నవారిని 'దాదా' అని అనగా అన్నను 'దాదా' అని అంటారు. అందువలన ఇరువురినీ కలిపి బాప్‌దాదా అని అంటారు. ఇప్పుడు పిల్లలకు కూడా మేము విద్యార్థులమని తెలుసు. పాఠశాలలో విద్యార్థులు తమ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకే కూర్చుని ఉన్నారు. మేము చదువుకొని ఫలానా పరీక్ష పాస్‌ అవుతామని భావిస్తారు. ఆ దేహ సంబంధమైన పరీక్షలైతే చాలా ఉంటాయి. ఇచ్చట పిల్లలైన మీ హృదయంలో మమ్ములను అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్మ చదివిస్తున్నారని ఉంది. ఈ బ్రహ్మను తండ్రి అని అనరు. నిరాకార తండ్రి అర్థం చేయిస్తున్నారు - తండ్రి నుండి రాజయోగము నేర్చుకొని రాజాధి రాజులుగా తయారవుతామని మీకు తెలుసు. సాధారణ రాజులూ ఉంటారు. రాజాధి రాజులు అనగా చక్రవర్తులు కూడా ఉంటారు. ఎవరైతే రాజాధి రాజులుగా ఉంటారో, వారిని రాజులు కూడా పూజిస్తారు. ఈ ఆచారము భారత ఖండములోనే ఉంది. పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - చాలా పెద్ద ఆస్తి కలిగిన వారిని మహారాజులని అంటారు. రాజులు చిన్నవారిగా కూడా ఉంటారు. ఈ రోజుల్లో అయితే కొంతమంది రాజులకు మహారాజుల కంటే ఎక్కువ ఆస్తి ఉంటుంది. కొంతమంది ధనవంతులకు రాజుల కంటే ఎక్కువ ఆస్తులు ఉంటాయి. అక్కడ(స్వర్గంలో) ఇటువంటి నిమయ విరుద్ధము ఉండదు. అచ్చట అన్నీ నియమానుసారంగానే ఉంటాయి. పెద్ద మహారాజుల వద్ద పెద్ద ఆస్తులుంటాయి. ఇప్పుడు మనలను అనంతమైన తండ్రి కూర్చుని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ మనలను రాజాధి రాజులుగా, స్వర్గాధిపతులుగా చేయించలేరు. స్వర్గ రచయిత ఒక్క నిరాకారుడైన తండ్రియే. వారిని ' హెవెన్లీ గాడ్‌ ఫాదర్‌ (స్వర్గ రచయిత)' అని కూడా మహిమ చేస్తారు. నేను పిల్లలైన మీకు మళ్లీ స్వరాజ్యమునిచ్చి రాజాధి రాజులుగా తయారు చేస్తానని తండ్రి నేరుగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనము భాగ్యమును తయారు చేసుకొని ఇచ్చటకు వచ్చామని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ద్వారా రాజాధి రాజులుగా అయ్యేందుకు వచ్చాము. ఇది ఎంత సంతోషించవలసిన విషయము! ఇది చాలా పెద్ద పరీక్ష. బాబా చెప్తున్నారు - శ్రీమతమును అనుసరించండి. ఇందులో మాత-పిత-శిక్షకుడు-గురువు మొదలైనవారందరి మతము కలిసి ఉంది. అన్నిటి శ్యాక్రిన్‌ తయారై ఉంది. అందరి రసాలు ఈ ఒక్కరిలో నిండి ఉన్నాయి. అందరి ప్రియుడు ఒక్కరే. పతితులను పావనంగా చేసేవారు ఆ ఒక్క తండ్రియే కదా. గురునానక్‌ కూడా వారిని మహిమ చేశాడు. కావున వారిని తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది. మొదట వారు మనలను తమ వద్దకు తీసుకెళ్తారు. తర్వాత పవిత్ర ప్రపంచములోకి పంపుతారు. ఎవరైనా వస్తే ' ఇది గాడ్‌లీ కాలేజ్‌(ఈశ్వరీయ కళాశాల) ' అని వారికి అర్థం చేయించాలి. ఇచ్చట 'భగవానువాచ' అని చెప్తారు. మిగిలిన పాఠశాలలో ఎప్పుడూ 'భగవానువాచ' అని అనరు. భగవంతుడనగా నిరాకార జ్ఞానసాగరుడు, మానవ సృష్టికి బీజరూపుడు. ఇప్పుడు కూర్చుని పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నాను. ఇది ఈశ్వరీయ జ్ఞానము. సరస్వతిని 'జ్ఞాన దేవత లేక చదవుల తల్లి(విద్యా దేవి)' అని అంటారు. అందువలన ఈశ్వరీయ జ్ఞానము ద్వారా తప్పకుండా దేవీ దేవతలుగానే తయారౌతారు కదా. బ్యారిస్టరు జ్ఞానము ద్వారా బ్యారిస్టరుగానే అవుతారు. ఇది ఈశ్వరీయ జ్ఞానము. సరస్వతికి భగవంతుడు జ్ఞానమునిచ్చారు. కావున ఎలాగైతే సరస్వతి జ్ఞాన దేవిగా అయ్యిందో అలా పిల్లలైన మీరు కూడా జ్ఞాన దేవతలుగా అవుతారు. సరస్వతికి చాలామంది పిల్లలున్నారు కదా. అయితే ప్రతి ఒక్కరూ జ్ఞాన దేవత అనిపించుకోవడం సాధ్యము కాదు. ఈ సమయములో స్వయాన్ని 'దేవత' అని పిలుచుకోలేరు. అచ్చట కూడా దేవీ దేవతలనే అంటారు. భగవంతుడు తప్పకుండా జ్ఞానమునిస్తారు. చాలా పెద్ద పదవినిచ్చే విధంగా పాఠాలను ధారణ చేయిస్తారు. మిగిలిన దేవతలు గాడ్‌, గాడెజ్‌(భగవాన్‌, భగవతీలు)గా అవ్వలేరు. ఈ మాతా-పితలైతే గాడ్‌ - గాడెజ్‌ వలె అవుతారు. కాని ఇప్పుడైతే అలా లేరు కదా. నిరాకార తండ్రిని 'గాడ్‌ ఫాదర్‌ ' అని అంటారు. ఈ సాకారాన్ని 'గాడ్‌' అని అనరు. ఇవన్నీ చాలా రహస్యమైన విషయాలు. ఆత్మ - పరమాత్మల రూపము, వారి మధ్య గల సంబంధము. ఇవన్నీ ఎంత గుహ్యమైన విషయాలు! ఆ శారీరిక సంబంధాలు చిన్నాన్న, పెద్దనాన్న, మామ మొదలైనవి సాధారణ సంబంధాలు. కాని ఇవి ఆత్మిక సంబంధాలు. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. మాత-పితలనే పదాలను మహిమ చేస్తారు. కనుక తప్పకుండా ఏదో గొప్ప అర్థము ఉంది కదా. ఆ పదాలు అవినాశిగా అయిపోతాయి. భక్తిమార్గములో కూడా కొనసాగుతాయి.

పిల్లలైన మీరు పాఠశాలలో కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. చదివించేవారు జ్ఞానసాగరుడు. ఇతని(బ్రహ్మ) ఆత్మ కూడా చదువుకుంటుంది. ఈ ఆత్మకు తండ్రి ఆ పరమాత్మయే. వారు(శివబాబా) అందరికీ తండ్రి. ఇప్పుడు వారే చదివిస్తున్నారు. వారు ఎప్పుడూ గర్భములో ప్రవేశించరు. అయితే జ్ఞానమునెలా చదివిస్తారు? వారు బ్రహ్మ శరీరములో వస్తారు. కాని వారు మళ్లీ బ్రహ్మకు బదులు కృష్ణుని పేరు వేసేశారు. ఇది కూడా డ్రామలో ఉంది. ఏదైనా తప్పు జరిగినప్పుడే కదా తండ్రి వచ్చి ఆ తప్పును కరెక్టు చేసి తప్పు లేనివారిగా తయారు చేస్తారు. నిరాకారుడైన తండ్రిని గురించి తెలియని కారణంగానే తికమక పడిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను మీ అనంతమైన తండ్రిని. మీకు అనంతమైన ఆస్తినిచ్చేవాడిని. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఎవరో అటువంటి కర్మలు వారికి నేర్పించి ఉంటారు కదా. వారికి ఇంత ఉన్నతపదవిని ప్రాప్తి చేయించినవారు తప్పకుండా పెద్దవారై ఉంటారు. మనుష్యులకు ఇవన్నీ కొంచెము కూడా తెలియదు. తండ్రి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. వారు ఎంత గొప్ప అథారిటీ! ప్రపంచమంతటినీ పతితుల నుండి పావనంగా తయారు చేసే మాలికులు. 'ఇది తయారైన డ్రామా' అని అర్థం చేయిస్తున్నారు. మీరు చక్రములో తిరగవలసి వస్తుంది. దీని నిర్మాణము (రచన) గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాలో మనము ఏ విధమైన పాత్రధారులము? ఈ చక్రము ఎలా తిరుగుతూ ఉందో, దు:ఖధామము నుండి సుఖధామంగా ఎవరు తయారు చేస్తారో, ఇవన్నీ మీకు తెలుసు. మిమ్ములను సుఖదామము కొరకు చదివిస్తాను. 21 జన్మలకు సదా సుఖవంతంగా తయారయ్యేది మీరే. ఇతరులెవ్వరూ అచ్చటికి వెళ్లలేరు. సుఖధామంలో తప్పకుండా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. అర్థము చేయించేందుకు చాలా మంచి పాయింట్లు ఉండాలి. బాబా, మేమ మీ వారమని నోటితో చెప్తారు కాని పూర్తిగా అలా తయారయ్యేందుకు సమయము పడ్తుంది. కొంతమంది కర్మ బంధనాలు వెంటనే వదిలిపోతాయి. కొంతమందికి సమయము పడ్తుంది. కర్మ బంధనాలు తెగిపోయిన భాగ్యశాలురు కూడా చాలా మంది ఉన్నారు. కాని వారు చదువు పై గమనమివ్వకపోతే వారిని 'దుర్భాగ్యశాలురు ' అని అంటారు. పుత్రులు, పౌత్రులు, మునిమనవళ్ళు మొదలైనవారికి పైకి బుద్ధి వెళ్లిపోతుంది. ఇక్కడైతే ఒకే ఒక్కరిని స్మృతి చేయాలి. చాలా గొప్ప వారసత్వము లభిస్తుంది. మనము రాజాధి రాజులుగా అవుతామని మీకు తెలుసు. పతిత రాజులు ఎలా అవుతారు? పావన రాజులకు రాజుగా, స్వర్గానికి అధిపతులుగా ఎలా అవుతారో కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు. నేను స్వయంగా వచ్చి ఈ రాజయోగము ద్వారా రాజాధి రాజులుగా, స్వర్గానికి అధిపతులుగా చేస్తాను. ఆ పతిత రాజులుగా అయితే దానం చేయడం ద్వారా తయారవుతారు. నేను వచ్చి వారిని అలా తయారు చేయను. వారు చాలా దాతలుగా ఉంటారు. దానము చేయడం ద్వారా రాజ కులములో జన్మ తీసుకుంటారు. నేను మీకు 21 జన్మల కొరకు సుఖమునిస్తాను. కాని వారు ఒక్క జన్మ కొరకే అలా అవుతారు. అందులో కూడా పతితులుగా, దు:ఖితులుగా ఉంటారు. నేను వచ్చి పిల్లలను పావనంగా చేస్తాను. కేవలం గంగా స్నానాలు చేయడం ద్వారా పావనంగా అవుతారని మనుష్యులు భావిస్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. గంగా, యమునా మొదలైన వాటి మహిమను ఎంతగానో చేస్తారు. ఇప్పుడు ఇందులో మహిమ చేయు మాటే లేదు. నీరు సాగరము నుండి వస్తుంది. ఇటువంటి నదులైతే అనేకమున్నాయి. విదేశాలలో కూడా భూమిని తవ్వి పెద్ద పెద్ద నదులను తయారు చేస్తారు. ఇందులో పెద్ద విషయమేముంది. జ్ఞాన సాగరులెవరో, జ్ఞాన గంగలెవరో అనే విషయాలు వారికి తెలియనే తెలియవు. శక్తులు ఏమి చేశారో వారికి ఏ మాత్రము తెలియదు. వాస్తవానికి జ్ఞాన గంగ లేక జ్ఞాన సరస్వతి ఎవరంటే ఈ జగదంబయే. మనుష్యులకు ఈ విషయాలు తెలియనే తెలియవు. వారు ఆటవికుల(భిల్లుల) వలె ఉన్నారు. పూర్తిగా మూర్ఖులు, తెలివిలేనివారుగా ఉన్నారు. తండ్రి వచ్చి అవివేకులను ఎంతో వివేకము గలవారిగా తయారు చేస్తారు. వీరిని (లక్ష్మినారాయణులను) రాజాధి రాజులుగా ఎవరు తయారు చేశారో మీరు తెలియజేయవచ్చు. గీతలో కూడా నేను రాజులకు రాజుగా తయారు చేస్తానని ఉంది. మనుష్యులకైతే ఈ విషయాలేవీ తెలియవు. మనకు కూడా ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవు. స్వయం అలా తయారైన ఇతడు(బ్రహ్మ) కూడా ఇప్పుడలా లేడు. అతడికే తెలియనప్పుడు ఇతరులెలా తెలుసుకోగలరు? సర్వవ్యాపి జ్ఞానములో ఏ సారమూ లేదు. యోగము ఎవరితో చేయాలి? ఎవరిని పిలవాలి? స్వయం ఖుదా(భగవంతుడు) అయినప్పుడు ఇక ప్రార్థన ఎవరిని చేస్తారు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి చాలా గౌరవముంటుంది. భక్తుల మాల కూడా ఉంది కదా! జ్ఞాన మాల అనగా రుద్రమాల. ఇది మళ్లీ భక్తి మాల. అదేమో నిరాకారి మాల. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. అందులో కూడా నంబర్‌ వన్‌ ఆత్మ ఎవరిది? ఎవరైతే నంబర్‌ వన్‌లోకి వెళ్తారో, సరస్వతి ఆత్మ లేక బ్రహ్మ ఆత్మ నంబరువన్‌గా చదువుకుంటాయి. ఇది ఆత్మల విషయము. భక్తి మార్గములో అన్నీ దేహ సంబంధమైన విషయాలే ఉంటాయి. ఫలానా భక్తులు ఇలా ఉండినారని, వారి శరీరము పేరునే చెప్తారు. మీరు మనుష్యుల గురించి చెప్పరు. బ్రహ్మ ఆత్మ ఏమవుతుందో మీకు తెలుసు. అది వెళ్లి శరీరాన్ని ధారణ చేసి రాజులకు రాజుగా అవుతుంది. ఆత్మ శరీరములో ప్రవేశించి రాజ్య పాలన చేస్తుంది. ఇప్పుడైతే రాజులెవ్వరూ లేరు. రాజ్యము చేసేది ఆత్మయే కదా. నేను రాజును. నేను ఆత్మను. ఈ శరీరానికి అధిపతిని. అహం ఆత్మను, నారాయణుడు అని పిలువబడే శరీరాన్ని ధరించి మళ్లీ రాజ్యపాలన చేస్తాను. ఆత్మయే వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మలోనే సంస్కారముంటుంది. మనము తండ్రి నుండి శ్రీమతమును అనుసరించుట ద్వారా రాజ్యము తీసుకంటామని ఇప్పుడు మీకు తెలుసు. బాప్‌దాదా ఇరువురూ కలిసి అంటున్నారు - పిల్లలూ! మా ఇరువురికీ మిమ్ములను పిల్లలూ! అని పిలిచే హక్కు ఉంది. ' నిరాకారీ పిల్లలూ! ' తండ్రినైన నన్ను స్మృతి చేయండని ఆత్మల తండ్రి అంటారు. ఇతరులెవ్వరూ ఓ నిరాకార పిల్లలూ, ఓ ఆత్మలారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండని అనలేరు. తండ్రి ఒక్కరు మాత్రమే ఆత్మలతో మాట్లాడ్తారు. అంతేకాని ఓ పరమాత్మా! పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయమని అనరు. ఓ ఆత్మలారా! తండ్రినైన నన్ను స్మృతి చేస్తే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని అంటున్నారు. పోతే గంగా స్నానము వలన ఎప్పుడూ ఏ పాపాత్మా పుణ్యాత్మగా అవ్వలేదు. గంగా స్నానము చేసి ఇంటికి వచ్చి మళ్లీ పాప కార్యాలు చేస్తారు. ఈ వికారాల కారణంగానే పాపాత్మలుగా అవుతారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీకు చాలా కఠినమైన రాహు గ్రహణము పట్టి ఉంది. మొదట గ్రహణము తేలికగా ఉంటుంది. ఇప్పుడు దానమిస్తే గ్రహణము వదిలిపోతుంది. ఇది చాలా గొప్ప ప్రాప్తి. అందువలన పురుషార్థము కూడా అంత గొప్పగా చేయాలి కదా. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను రాజులకు రాజుగా తయారు చేస్తాను. అందువలన నన్ను, నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. మీ 84 జన్మలను స్మృతి చేయండి. అందుకే బాబా, స్వదర్శన చక్రధారి పిల్లలు అని పేరు పెట్టారు. కావున స్వదర్శన చక్ర జ్ఞానము కూడా కావాలి కదా.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. మిమ్ములను నేను నూతన ప్రపంచములోకి తీసుకెళ్తాను. సన్యాసులు కేవలము ఇల్లు - వాకిళ్లను మర్చిపోతారు కాని మీరు ఈ మొత్తము ప్రపంచాన్నంతా మర్చిపోతారు. '' అశరీరులుగా అవ్వండి '' అని ఈ తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. నేను మిమ్ములను నూతన ప్రపంచములోకి తీసుకెళ్తాను. అందువలన పాత ప్రపంచము, పాత శరీరము పై మమకారాన్ని తుంచి వేయండి. మళ్లీ నూతన ప్రపంచములో మీకు నూతన శరీరము లభిస్తుంది. చూడండి కృష్ణుని శ్యామసుందరుడని అంటారు కదా. సత్యయుగములో అతడు తెల్లగా(పవిత్రంగా) ఉండేవాడు. ఇప్పుడు అంతిమ జన్మలో నల్లగా(అపవిత్రంగా) అయిపోయాడు. అందుకే కదా శ్యామంగా ఉన్నవాడే సుందరంగా అవుతాడు. మళ్లీ సుందరంగా ఉన్నవాడే శ్యామంగా అవుతాడని అంటారు. అందుకే శ్యామసుందరుడని పేరు పెట్టారు. నల్లగా తయారు చేసేది పంచ వికారాల రావణుడు. మళ్లీ తెల్లగా తయారు చేసేవారు పరమపిత పరమాత్మ. చిత్రములో కూడా - పాత ప్రపంచాన్ని కాళ్ళతో తన్ని తెల్లగా తయారౌతున్నానని చూపించారు. తెల్లటి ఆత్మ స్వర్గానికి అధికారిగా అవుతుంది. నల్లటి ఆత్మ నరకానికి అధికారిగా అవుతుంది. ఆత్మయే తెల్లగా, నల్లగా తయారవుతుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - మీరు పవిత్రంగా అవ్వాలి. ఆ హఠయోగులు పవిత్రంగా తయారయ్యేందుకు చాలా హఠము చేస్తారు. కాని యోగము చేయకుండా పవిత్రంగా అవ్వలేరు. లేకపోతే శిక్షలు అనుభవించి పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. అందువలన తండ్రిని ఎందుకు స్మృతి చేయరాదు? అంతేకాక 5 వికారాలను కూడా జయించాలి. తండ్రి అంటున్నారు - ఈ కామ వికారమే ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. ఎవరైతే వికారాలను జయించలేరో వారు వైకుంఠానికి రాజులుగా అవ్వలేరు. అందువలన తండ్రి చెప్తున్నారు - నేను మీకు ఎంతో శ్రేష్ఠమైన కర్మలు నేర్పుతాను - తండ్రి-టీచరు-సద్గురువు రూపములో నేర్పిస్తాను. యోగబలము ద్వారా వికర్మలను వినాశనము చేయించి వికర్మాజీత్‌ రాజుగా తయారు చేస్తాను. వాస్తవానికి సత్యయుగములోని దేవీ దేవతలను మాత్రమే వికర్మాజీతులని అంటారు. అచ్చట వికర్మలు ఉండనే ఉండవు. వికర్మాజీత్‌ శకము వేరే. వికర్మల శకము వేరే. వికర్మలు చేసిన రాజు ఒకప్పుడు ఉండి వెళ్లిపోయాడు. వికర్మలను జయించిన రాజు కూడా ఒకప్పుడు ఉండి వెళ్లిపోయాడు. ఇప్పుడు మనము వికర్మలను జయిస్తున్నాము. మళ్లీ ద్వాపరము నుండి నూతనంగా వికర్మలు ప్రారంభమవుతాయి. అందుకే ' రాజా వికర్ముడు ' అని పేరు పెట్టారు. దేవతలు వికర్మాజీతులు. ఇప్పుడు మనము మళ్లీ అలా తయారౌతాము. మళ్లీ ఎప్పుడైతే వామమార్గములోకి వస్తామో అప్పుడు వికర్మల ఖాతా ప్రారంభమవుతుంది. ఇచ్చట వికర్మల ఖాతాను చుక్తా చేసుకొని మళ్లీ మనము వికర్మాజీతులుగా అవుతాము. అక్కడ వికర్మలేవీ ఉండవు. అందువలన ఇచ్చట మేము శ్రేష్ఠమైన భాగ్యమును తయారు చేసుకుంటున్నామనే నషా పిల్లలకు ఉండాలి. ఇది అత్యంత గొప్ప అదృష్టాన్ని తయారు చేసుకునే పాఠశాల. సత్యయుగంలో అదృష్టాన్ని తయారు చేసుకునే మాటే ఉండదు. పాఠశాలలోనే సదా భాగ్యము తయారవుతుంది. మేము నరుని నుండి నారాయణునిగా లేక రాజాధి రాజులుగా తయారౌతామని మీకు తెలుసు. పతిత రాజులు తప్పనిసరిగా పావన రాజులను పూజిస్తారు. నేను మిమ్ములను పావనంగా తయారు చేస్తాను. పతిత ప్రపంచములో అయితే రాజ్య పాలన చేయరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధిలో స్వదర్శన చక్ర జ్ఞానముంచుకొని రాహు గ్రహణము నుండి ముక్తులుగా అవ్వాలి. శ్రేష్ఠ కర్మలు, యోగబలము ద్వారా వికర్మల ఖాతాను చుక్తా(సమాప్తము) చేసుకొని వికర్మాజీత్‌లుగా అవ్వాలి.
2. మీ భాగ్యమును ఉన్నతంగా తయారు చేసుకునేందుకు చదువు పై పూర్తిగా గమనముంచాలి. 

వరదానము :- ''సాధన మరియు సాధనాల సమతుల్యత (బ్యాలెన్స్‌) ద్వారా తమ ఉన్నతి చేసుకునే ఆశీర్వాదాలకు (బ్లెస్సింగ్స్‌) అధికారీ భవ''
సాధనాలను ఆధారంగా చేసుకునేందుకు బదులు మీ సాధన ఆధారంతో సాధనాలను కార్యంలో ఉపయోగించండి. ఏ సాధనాన్నీ ఉన్నతికి ఆధారంగా చేసుకోకండి. ఆధారంగా చేసుకుంటే, ఆధారము కదులుటతో పాటు ఉమంగ-ఉత్సాహాలు కూడా కదిలిపోతాయి. ఎందుకంటే సాధనాలను ఆధారంగా చేసుకున్నందున మధ్యలో తండ్రి వెళ్లిపోతాడు, అందువలన హల్‌చల్‌(ఆందోళన) కలుగుతుంది. సాధనాలతో పాటు సాధన ఉంటే ప్రతీ కార్యంలో తండ్రి ఆశీర్వాదాన్ని అనుభవం చేస్తారు, ఉమంగ-ఉత్సాహాలు కూడా తగ్గిపోవు. 

స్లోగన్‌ :- '' అగర్‌ మగర్‌ (ఇదిగో,అదిగో అంటూ వాయిదా వేయడం) '' అను చక్కర్‌ (మోసము, గందరగోళము) నుండి అతీతంగా అవ్వాలంటే తండ్రి సమానంగా శక్తిశాలిగా అవ్వండి. ''
 

No comments:

Post a Comment