Thursday, 25 January 2018

Telugu Murli 25/01/18

25-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఈ సృష్టి లేక ప్రపంచము దు:ఖమయంగా ఉంది. కావున దీని నుండి నిర్మోహులుగా(నష్టమోహులుగా) అవ్వండి. నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని ఈ ప్రపంచము నుండి తొలగించి నూతన ప్రపంచంతో జోడించండి'' 

ప్రశ్న :- కృష్ణపురములోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు ఏ ఏర్పాట్లు చేస్తారు, చేయిస్తారు ?
జవాబు :- కృష్ణపురములోకి వెళ్లేందుకు కేవలం ఈ అంతిమ జన్మలో అన్ని వికారాలను వదిలి పావనంగా అవ్వాలి, ఇతరులను కూడా పావనంగా చేయాలి. పావనంగా అవ్వడమే దు:ఖధామము నుండి సుఖధామములోకి వెళ్లేందుకు చేసుకునే ఏర్పాట్లు. ఇది అశుద్ధమైన(డర్టీ, మురికి) ప్రపంచమని, దీని నుండి బుద్ధియోగాన్ని తొలగిస్తే నూతన సత్యయుగ ప్రపంచములోకి వెళ్ళిపోతారని అందరికీ సందేశమును ఇవ్వండి. 

పాట:- నాకు ఆధారాన్ని (సహయోగమును) ఇచ్చువారు,........ ( ముఝ్‌కో సహారా దేనేవాలే,............)   
ఓంశాంతి. ఈ పాటలో పిల్లలు బాబా అని పిలుస్తారు, వెంటనే పిల్లల బుద్ధి అనంతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. ఏ పిల్లలకైతే ఇప్పుడు సుఖము లభిస్తూ ఉందో లేక సుఖధామానికి దారి లభిస్తూ ఉందో, ఆ పిల్లలు - తప్పకుండా స్వర్గములో 21 జన్మల సుఖ వారసత్వమునిచ్చేందుకు తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటారు. ఈ సుఖము ప్రాప్తి చేయించేందుకు స్వయం తండ్రే వచ్చి శిక్షణనిస్తున్నారు. వారు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఈ ప్రపంచము ఏదైతే ఉందో అనగా ఇంతమంది మనుష్యులు ఎవరైతే ఉన్నారో, వారు మీకు ఏమీ ఇవ్వలేరు. వీరందరూ రచనయే కదా. పరస్పరములో సోదరీ-సోదరులు. అందువలన రచన ఒకరికొకరు పరస్పరములో సుఖ వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు? సుఖ వారసత్వమును ఇచ్చేవారు తప్పకుండా రచయిత అయిన ఒక్క తండ్రి మాత్రమే అయ్యి ఉంటారు. ఈ ప్రపంచములో ఎవరికైనా సుఖమునివ్వగలిగిన మనిషి ఒక్కరు కూడా లేరు. సుఖదాత, సద్గతిదాత ఒక్క సద్గురువు మాత్రమే అయ్యారు. ఇప్పుడు ఏ సుఖాన్ని అడుగుచున్నారు? స్వర్గములో చాలా సుఖముండేదని అందరూ మర్చిపోయారు, ఇప్పుడు నరకములో దు:ఖముందని కూడా తెలియదు. అందువలన పిల్లలందరి పై ఆ మాలికునికే(తండ్రైన భగవంతునికి) జాలి కలుగుతుంది. ఈ సృష్టికి అధిపతినని అంగీకరించేవారు చాలామంది ఉన్నారు కాని వారు ఎవరో, వారి ద్వారా ఏమి లభిస్తుందో ఎవ్వరికీ ఏ మాత్రమూ తెలియదు. యజమాని ద్వారా మనకు దు:ఖము లభించదని కాదు. వారిని స్మృతి చేసేదే సుఖ-శాంతులను పొందేందుకు. భక్తులు భగవంతుని స్మృతి చేసేది తప్పకుండా ప్రాప్తి కొరకే. అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. అందుకే సుఖ-శాంతుల కొరకు స్మృతి చేస్తారు. అనంతమైన సుఖమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలినవారు హద్దులోని అల్పకాలికమైన సుఖమునైతే ఒకరికొకరు ఇచ్చుకుంటూనే ఉంటారు. అది ఏమంత పెద్ద విషయము కాదు. భక్తులందరూ ఒక్క భగవంతుడినే పిలుస్తూ ఉంటారు. భగవంతుడు తప్పకుండా అందరికంటే గొప్పవారు. వారి మహిమ చాలా గొప్పది. కనుక వారు తప్పకుండా చాలా సుఖమునిచ్చేవారుగా ఉంటారు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు గాని, ప్రపంచానికి గాని దు:ఖమునివ్వజాలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు విచారము చేయండి - నేను ఏ సృష్టిని లేక ప్రపంచాన్ని దు:ఖమునిచ్చేందుకు రచిస్తానా? నేను రచించేది సుఖమునిచ్చేందుకు. అయితే ఈ డ్రామాలో సుఖము, దు:ఖము రెండూ ఉన్నాయి. మనుష్యులు ఎంత దు:ఖితులుగా ఉన్నారు! తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ ప్రపంచము లేక సృష్టి క్రొత్తదిగా ఉన్నప్పుడు అందులో సుఖముంటుంది, దు:ఖము పాత సృష్టిలో ఉంటుంది. అన్నీ పురాతనమై శిథిలావస్థకు చేరుకున్నాయి. మొదట నేను ఏ సృష్టినైతే రచిస్తానో దానిని సతోప్రధాన సృష్టి అని అంటారు. ఆ సమయంలో మనుష్యులందరూ ఎంతో సుఖంగా ఉంటారు. ఆ ధర్మము ఇప్పుడు ప్రాయ: లోపమైనందున ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు.

క్రొత్త ప్రపంచము సత్యయుగమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాతదిగా ఉంది కాబట్టి తండ్రి వచ్చి తప్పకుండా నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారనే ఆశను ఉంచుకుంటారు. మొదట నూతన సృష్టి, నూతన ప్రపంచములో చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారు చాలా సుఖంగా ఉండేవారు. ఆ సుఖాలు అపారమైనవి(ఆ సుఖాలకు అంతే లేదు). దాని పేరే స్వర్గము, వైకుంఠము, నూతన ప్రపరచము అని అంటారు. కావున అందులో తప్పకుండా కొత్త మనుష్యులే ఉంటారు. ఆ దేవీ దేవతల రాజధానిని తప్పకుండా నేనే స్థాపన చేసి ఉంటాను కదా లేకుంటే కలియుగములో ఒక్క రాజు కూడా లేనప్పుడు, అందరూ నిరుపేదలుగా ఉన్నప్పుడు ఒక్కసారిగా సత్యయుగములో దేవీ దేవతల రాజ్యము ఎలా వస్తుంది ? ఎక్కడ నుండి వచ్చింది ? ఈ ప్రపంచము ఎలా మార్పు చెందింది? అయితే అందరి బుద్ధి ఏమీ అర్థము చేసుకోలేనంతగా నశించిపోయింది. తండ్రి వచ్చి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. మనుష్యులు - సుఖమిచ్చేది వారే, దు:ఖమిచ్చేది వారే అని ఆ తండ్రి పైనే దోషము మోపుతారు. అయితే ఈశ్వరుని - మీరు వచ్చి మాకు సుఖ-శాంతులు ఇవ్వండి, స్వీట్‌ హోమ్‌కు(శాంతిధామానికి) తీసుకెళ్ళమని స్మృతి చేస్తారు. మళ్లీ పాత్ర చేసేందుకు అయితే తప్పకుండా పంపుతారు కదా. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము తప్పకుండా రానున్నది. మనుష్యులైతే రావణుని మతము పై నడుస్తున్నారు. శ్రేష్ఠ మతమంటే శ్రీమతము. తండ్రి అంటున్నారు - నేను సహజ రాజయోగాన్ని నేర్పిస్తాను. నేను ఏ గీతా శ్లోకము మొదలైన వాటిని గానము చేయను - ఆ కార్యము మీరు చేస్తారు. తండ్రి కూర్చొని గీతనేమైనా నేర్పుతారా? నేను సహజ రాజయోగమును నేర్పుతాను. పాఠశాలలో పాటలు, కవితలు వినిపిస్తారా? పాఠశాలలో అయితే చదివిస్తారు. తండ్రి కూడా అంటున్నారు - పిల్లలైన మిమ్ములను నేను చదివిస్తున్నాను, రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నాతో ఇతరులెవ్వరికీ యోగము లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. ఈ మర్చిపోవడం కూడా డ్రామాలో ఫిక్స్‌ అయ్యి ఉంది. నేను వచ్చి మళ్లీ స్మృతినిప్పిస్తాను. నేను మీ తండ్రిని. భగవంతుడు నిరాకారుడని అంగీకరిస్తారు. మరి వారి పిల్లలైన మీరు కూడా నిరాకారులే కదా. నిరాకార ఆత్మలైన మీరు మళ్లీ పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తారు. నిరాకార ఆత్మలందరి నివాస స్థానము నిరాకార ప్రపంచమే. అది అత్యంత ఉన్నతమైనది, ఇది సాకార ప్రపంచము. దీని తర్వాత ఆకారీ ప్రపంచము, దాని తర్వాత అది నిరాకార ప్రపంచము. నిరాకార ప్రపంచము - అన్నిటికంటే పైన మూడవ అంతస్థులో ఉంది. బాబా సన్ముఖములో కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - నేను కూడా అచ్చటి నివాసినే. నూతన ప్రపంచమున్నప్పుడు అచ్చట ఒకే ధర్మముండేది. దానిని హెవెన్‌(స్వర్గము) అని అంటారు. తండ్రిని హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. కలియుగము కంసపురి, సత్యయుగము కృష్ణపురి. కనుక ఇప్పుడు మీరు కృష్ణపురికి వస్తారా? అని అడగాలి. మీరు కృష్ణపురికి రావాలనుకుంటే పవిత్రముగా అవ్వండి. ఏ విధంగా మేము దు:ఖధామము నుండి సుఖధామములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామో, అలా మీరు కూడా చేయండి. అక్కడకు వచ్చేందుకు వికారాలను తప్పక వదలవలసి ఉంటుంది. ఇది అందరికీ అంతిమ జన్మ, అందరూ వాపస్‌ వెళ్ళాలి. 5 వేల సంవత్సరాల క్రితము ఆ మహాభారత యుద్ధము జరగలేదా? మీరు మర్చిపోయారా? అందులో అన్ని ధర్మాలు వినాశమైపోయాయి. ఏకధర్మము స్థాపించబడింది. సత్యయుగములో దేవీ దేవతలు ఉండేవారు కదా. కలియుగములో వారు లేరు. ఇప్పుడిది రావణరాజ్యము, ఇక్కడ ఉండేవారు ఆసురీ మనుష్యులు. వారిని మళ్లీ దేవతలుగా తయారు చేయవలసి ఉంటుంది. అందువలన తండ్రి ఆసురీ ప్రపంచములో రావలసి ఉంటుందా? లేక దైవీ ప్రపంచములో వస్తారా? లేక రెండింటి సంగమ సమయములో వస్తారా? కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమ యుగే యుగే వస్తానని గాయనము కూడా ఉంది. తండ్రి మనకు ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు - మనము వారి శ్రీమతమును అనుసరిస్తున్నాము. నేను మార్గదర్శకుడినై పిల్లలైన మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు వచ్చాను అందువలన నన్ను మృత్యువుకు మృత్యువు (కాలోంకా కాల్‌) అని కూడా అంటారు. కల్పక్రితము కూడా మహాభారత యుద్ధము జరిగింది, దాని వలన స్వర్గ ద్వారాలు తెరచుకున్నాయి. కానీ దేవీ దేవతలు తప్ప మిగిలిన వారెవ్వరూ అచ్చటికి వెళ్ళలేరు. మిగిలిన వారందరూ శాంతిధామములో ఉన్నారు. కావున నిర్వాణధామానికి అధిపతినైన నేను అందరినీ నిర్వాణధామములోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు రావణుని సంకెళ్ళలో చిక్కుకొని వికారాల మురికిలో ఆసురీ గుణాలు కలిగినవారిగా ఉన్నారు. అన్నిటికంటే నంబరువన్‌ డర్టీ (అశుద్ధము) కామము. తర్వాత క్రోధము తర్వాత లోభము నంబరువారుగా అశుద్ధాలు. కావున మొత్తం ప్రపంచమంతటి నుండి నిర్మోహులుగా అవ్వాలి, అప్పుడు స్వర్గములోకి వెళ్తారు. ఉదాహరణానికి హద్దు తండ్రి ఇల్లు కట్టిస్తే బుద్ధి క్రొత్త ఇంటిలో లగ్నమౌతుంది. పిల్లలు - నాన్నా! ఇంట్లో ఇది కట్టాలి, అది కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి అని అంటారు కదా. అలాగే బేహద్‌ తండ్రి అంటున్నారు - నేను మీ కొరకు నూతన ప్రపంచమైన స్వర్గమును ఎంతో మంచిగా తయారు చేస్తాను. అందువలన మీ బుద్ధియోగము పాత ప్రపంచము నుండి తెగిపోవాలి. వాస్తవానికి ఇక్కడ ఏముంది ? దేహమూ పాతదే. ఆత్మలో కూడా మలినాలు ఏర్పడ్డాయి. మీరు యోగము చేస్తే ఆ మలినాలు తొలగిపోతాయి. అప్పుడు జ్ఞానము కూడా ధారణ అవుతుంది. ఈ బాబా భాషణ చేస్తున్నారు కదా. ఓ పిల్లలారా! ఆత్మలైన మీరందరూ నా రచన. ఆత్మ స్వరూపములో మీరంతా భాయి-భాయి(సోదరులు). ఇప్పుడు మీరందరూ నా వద్దకు వాపసు రావాలి. ఇప్పుడు మీరంతా తమోప్రధానంగా అయిపోయారు. ఇది రావణరాజ్యము కదా. రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇంతకుముందు మీకు తెలియదు. సత్యయుగములో 16 కళలు ఉంటాయి, తర్వాత 14 కళలు అవుతాయి, అయితే ఒక్కసారిగా రెండు కళలు తగ్గిపోవు, నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. ఇప్పుడైతే ఒక్క కళ కూడా లేదు. పూర్తిగా గ్రహణము పట్టి ఉంది. దానము ఇస్తే గ్రహణము వదులుతుందని(దే దాన్‌ తో ఛూఠే గ్రహణ్‌) బాబా చెప్తున్నారు. ఐదు వికారాలను దానమిచ్చేయండి. ఇక మీదట ఏ పాపమూ చేయకండి. భారతవాసులు రావణుని తగులబెట్తారు అనగా ఇది తప్పకుండా రావణ రాజ్యమనే కదా. అయితే రావణరాజ్యమని దేనినంటారో, రామరాజ్యమని దేనినంటారో కూడా వారికి తెలియదు. రామరాజ్యము రావాలని, నూతన భారతదేశము రావాలని అంటారు. కాని క్రొత్త ప్రపంచము క్రొత్త భారతదేశము ఎప్పుడు అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ సమాధుల(కబ్ర్‌)లో నిదురిస్తున్నారు.

ఇప్పుడు పిల్లలైన మీకు సత్యయుగీ వృక్షము కనిపిస్తోంది. ఇచ్చట దేవతలు ఎవ్వరూ లేరు. ఈ విషయాలన్నీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీ తల్లి-తండ్రి వారే. స్థూలంగా వీరు మాతా- పితలు అవుతారు. మీరు మాతా-పితలని వారిని మహిమ చేస్తారు. సత్యయుగములో అయితే ఇలా గాయనం చేయరు. అచ్చట కృప అనే మాటే లేదు. ఇచ్చట మాతా-పితలకు చెందిన వారిగా అయ్యి అర్హులుగా కూడా తయారవ్వవలసి ఉంటుంది. ఓ భారతవాసులారా! మీరు దేవీదేవతలుగా ఎంతో ధనవంతులుగా ఉండేవారు, ఎంత వివేకవంతులుగా కూడా ఉండేవారో మీరు మరచిపోయారు. ఇప్పుడు తెలివిహీనులై దివాలా తీశారు, ఇలాంటి బుద్ధిహీనులుగా మిమ్ములను మాయా రావణుడు తయారు చేశాడు. అందుకే రావణుని తగులబెట్తున్నారు. శత్రువు దిష్టిబొమ్మను తయారు చేసి దానిని తగులబెడ్తారు కదా. పిల్లలైన మీకు ఎంత జ్ఞానము లభిస్తుంది! అయితే పిల్లలు విచార సాగర మథనము చేయరు. బుద్ధి భ్రమిస్తూ ఉంటే ఇటువంటి పాయింట్లను ఉపన్యాసములో వినిపించడం మర్చిపోతారు. పూర్తిగా అర్థం చేయించరు. మీరు బాబా వచ్చారనే సందేశము ఇవ్వాలి. ఈ మహాభారత యుద్ధము ఎదుర్లో నిలబడి ఉంది. అందరూ వాపసు వెళ్ళాలి. స్వర్గ స్థాపన జరుగుతోంది. తండ్రి అంటున్నారు - దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరిచి నన్ను స్మృతి చేయండి. అంతేగాని ముస్లింలు, బౌద్ధులు అందరూ భాయి-భాయి(సోదరులు) అని నామమాత్రంగా అనకండి. ఈ ధర్మాలన్నీ దేహ సంబంధమైనవి కదా. అందరి ఆత్మలైతే ఆ ఒక్క తండ్రి సంతానమే. తండ్రి అంటున్నారు - ఈ దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఇచ్చిన ఈ సందేశము అందరికీ తెలిపేందుకు మనము శివజయంతిని జరుకుంటున్నాము. మనమంతా బి.కె.లము, శివుని పౌత్రులము. మనకు వారి నుండి స్వర్గ రాజధాని వారసత్వంగా లభిస్తోంది. తండ్రి మనకు సందేశమిస్తున్నారు - '' మన్మనాభవ '' ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశమౌతాయి, అశరీరులుగా అవ్వండి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహ ధర్మాలన్నీ వదిలి అశరీరి ఆత్మగా భావించి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. యోగము మరియు జ్ఞాన ధారణ ద్వారా ఆత్మను పావనంగా చేసుకోవాలి.
2. తండ్రి ఇచ్చే జ్ఞానము పై విచార సాగర మథనము చేసి అందరికీ తండ్రి సందేశమునివ్వాలి. బుద్ధిని భ్రమింపజేయరాదు. 

వరదానము :- ''మర్యాదా పురుషోత్తములుగా అయ్యి సదా ఎగిరేకళలో ఎగిరే నంబరువన్‌ విజయీ భవ ''
నంబరువన్‌కు గుర్తు - ప్రతి విషయములో విన్‌ అయ్యేవారు(గెలుపొందేవారు). ఏ విషయములోనూ ఓడిపోరాదు. సదా విజయీగా ఉంటారు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా ఓడిపోతే అందుకు కారణం - మర్యాదల పాలనలో హెచ్చు-తగ్గులవ్వడం. కాని ఇది సంగమ యుగము. మర్యాదా పురుషోత్తములుగా తయారయ్యే యుగము. పురుషుడూ కాదు, నారీ కాదు పురుషోత్తములు. సదా ఇదే స్మృతిలో ఉంటే ఎగిరేకళలో ఎగురుతూ పోతూ ఉంటారు. క్రింద నిలబడరు. ఎగిరోకళలోని వారు సెకండులో సర్వ సమస్యలు దాటుకుంటారు. 

స్లోగన్‌ :- '' ఒక్క తండ్రి శ్రేష్ఠమైన సాంగత్యంలో ఉంటే, ఏ ఇతర సాంగత్యమూ తన ప్రభావాన్ని వేయలేదు ''
రాత్రి క్లాసు -

ఇప్పుడు పిల్లలైన మీరు స్థూలవతనం, సూక్ష్మవతనం, మూలవతనాల గురించి బాగా అర్థం చేసుకున్నారు. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుతారు. దేవతలకైతే ఈ జ్ఞానము అవసరమే లేదు. మీకిప్పుడు మొత్తం విశ్వ జ్ఞానమంతా ఉంది. మీరు ఇంతకు ముందు శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారు. మళ్లీ బ్రహ్మకుమారులైనప్పుడు ఈ జ్ఞానమునిస్తారు. ఈ జ్ఞానము ద్వారా మీ దైవీ వంశము స్థాపనవుతూ ఉంది. తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని, సూర్య వంశాన్ని, చంద్ర వంశాన్ని స్థాపన చేస్తారు. అది కూడా ఈ సంగమ యుగంలో స్థాపన చేస్తారు. ఇతర ధర్మాల వారైతే వెంటనే వారి వంశాన్ని స్థాపన చేయరు. వారిని గురువులని అనరు. తండ్రియే వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అంటున్నారు - ఇప్పుడు తల పై తండ్రిని స్మృతి చేయాలనే చింత ఉంది. ఆ స్మృతిని పదే పదే మర్చిపోతారు. ఆరోగ్యవంతముగా అయ్యేందుకు పురుషార్థము చేసి వ్యాపారము మొదలైన వాటిని కూడా చేస్తూ ఉండండి, స్మృతి కూడా చేస్తూ ఉండండి. తండ్రి చాలా గొప్ప సంపాదన చేయిస్తారు. ఇందులో అంతా మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలమైన మనము వెళ్లిపోతున్నాము. అభ్యాసము చేయించబడ్తుంది - తినేటప్పుడు తండ్రిని స్మృతి చేయలేరా? బట్టలు కుట్టేటప్పుడు కూడా బుద్ధియోగము తండ్రి స్మృతిలో ఉండాలి. చెత్తను(వ్యర్థాన్ని) తీసేయాలి. బాబా అంటున్నారు - శరీర నిర్వహణ కొరకు భలే ఏ పని అయినా చేయండి, ఈ స్మృతి చాలా సలభము. 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని, ఇప్పుడు రాజయోగము నేర్పించేందుకు తండ్రి వచ్చారని అర్థము చేసుకున్నారు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళము ఈ సమయంలో రిపీట్‌ అవుతుంది. కల్పక్రితము వలెనే పునరావృతమవుతోంది. రిపిటీషన్‌(పునరావృత) రహస్యాన్ని కూడా తండ్రియే అర్థం చేయిస్తున్నారు. ఒన్‌ గాడ్‌, ఒన్‌ రిలిజన్‌ (ఒకే దేవుడు, ఒకే మతము) అని కూడా అంటారు కదా. శాంతి అక్కడ మాత్రమే ఉంటుంది. అది అద్వైత రాజ్యము. ద్వైతమంటే ఆసురీ రావణ రాజ్యము. వారు దేవతలు, వీరు దైత్యులు. ఆసురీ రాజ్యము మరియు దైవీ రాజ్యముల ఆట భారతదేశము పైనే తయారు చేయబడింది. భారతదేశంలో ఆది సనాతన ధర్మముండేది. పవిత్రమైన ప్రవృత్తి మార్గముండేది. మళ్లీ ఇప్పుడు తండ్రి వచ్చి ప్రవృత్తి మార్గాన్ని పవిత్రంగా చేస్తారు. మనమే దేవతలుగా ఉండేవారము. మళ్లీ కళలు తగ్గుతూ వచ్చాయి. మనమే శూద్ర వంశములోకి వచ్చాము. ఎలాగైతే టీచర్లు చదివిస్తే విద్యార్థులు వింటారో అలా తండ్రి మనలను చదివిస్తారు. మంచి విద్యార్థులైతే చదువు పై పూర్తి గమనముంచుతారు. చదువును మిస్‌ చేయరు. ఈ చదువును రెగ్యులర్‌గా చదవాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఆబ్సెంట్‌ అవ్వరాదు. అతి రహస్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. అచ్ఛా, గుడ్‌నైట్‌. ఆత్మిక పిల్లలకు నమస్తే.
 

No comments:

Post a Comment